సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సినీ మేకప్ అసిస్టెంట్‌ నుంచి దొంగగా.. 95వ చోరీతో అడ్డంగా బుక్కయ్యాడు!

ABN, Publish Date - Nov 29 , 2026 | 10:33 AM

సినీ మేకప్ అసిస్టెంట్‌ పోలాకి అప్పలనాయుడు విజయవాడలో 764 గ్రాముల బంగారం చోరీ చేసి పోలీసులకు చిక్కాడు.

Hyderabad Thief

ఒకప్పుడు సినీ పరిశ్రమలో మేకప్ అసిస్టెంట్‌గా పనిచేశాడు. ఆ తర్వాత జీవనోపాధి కోసం హైదరాబాద్ (Hyderabad) కు వచ్చి పాఠశాల బస్సు డ్రైవర్‌గా మారాడు. అయితే దొంగతనాలను మాత్రం వదల్లేదు. ఏకంగా తెలంగాణలో 94 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డాడు. పలుమార్లు పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లినా అతడి తీరు మారలేదు. బెయిల్‌పై బయటకు వచ్చిన ప్రతిసారీ మళ్లీ దొంగతనాల బాట పట్టాడు. అలా హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లి 95వ చోరీకి పాల్పడి చివరకు పోలీసులకు చిక్కాడు. 764 గ్రాముల బంగారు ఆభరణాలను అపహరించిన ఈ నిందితుడిని పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు.

ఈ కేసు వివరాలను విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు, డీసీపీలు గుణ్ణం రామకృష్ణ, తిరుమలేశ్వరరెడ్డి, ఇబ్రహీంపట్నం ఇన్‌స్పెక్టర్ సుబ్రహ్మణ్యం శనివారం వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం సేపన్నపేటకు చెందిన పోలాకి అప్పలనాయుడు (Polaki Appala Naidu) ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని కిస్మత్‌పూర్‌లో నివాసం ఉంటున్నాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో అక్కాబావల వద్ద పెరిగాడు. అయితే బాల్యంలోనే ఇంటి నుంచి వెళ్లిపోయి హైదరాబాద్ చేరుకున్నాడు.

సినీ పరిశ్రమలో మేకప్ అసిస్టెంట్‌గా ప్రయాణం..

హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత కొంతకాలం సినీ పరిశ్రమలో మేకప్ అసిస్టెంట్‌గా పనిచేశాడు. అనంతరం పాఠశాల బస్సు డ్రైవర్‌గా ఉపాధి పొందాడు. అయితే ఈ క్రమంలోనే దొంగతనాలకు అలవాటు పడ్డాడు. 1999లో జూబ్లీహిల్స్ పోలీసులు తొలిసారిగా చోరీ కేసులో అతడిని అరెస్టు చేశారు. అప్పటి నుంచి దొంగతనాలు చేయడం, పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లడం, బెయిల్‌పై బయటకు వచ్చి మళ్లీ చోరీలకు పాల్పడటం అతడికి అలవాటుగా మారింది. ఇలా ఇప్పటివరకు తెలంగాణలో 94 ఇళ్లలో చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

విజయవాడలో 95వ చోరీ..

ఈ నెల 11న హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లిన అప్పలనాయుడు భవానీపురంలోని కుమ్మరిపాలెం సెంటర్‌లో ఓ లాడ్జిలో బస చేశాడు. అక్కడి నుంచి గుంటుపల్లికి వెళ్లి దోనేపూడి కల్యాణి అనే మహిళ ఇంటిని లక్ష్యంగా చేసుకున్నాడు. ముందుగా ఇంటి పరిసరాలను పరిశీలించి, అనువైన సమయం చూసుకుని లోపలికి ప్రవేశించాడు. అనంతరం ఇంట్లో ఉన్న 764 గ్రాముల బంగారు ఆభరణాలను అపహరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడి గుర్తింపు..

ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో నిందితుడు గుంటుపల్లిలో చోరీ చేసిన అనంతరం ఆటోలో మూలపాడు వరకు వెళ్లినట్లు గుర్తించారు. అక్కడి నుంచి మరో ఆటోలో కుమ్మరిపాలెంలోని లాడ్జికి చేరుకున్నట్లు సీసీ కెమెరాల ద్వారా తెలుసుకున్నారు. లాడ్జిలో నమోదు చేసిన వివరాలను పరిశీలించి అతడి ఫోన్ నంబర్, ఆధార్ కార్డు ఆధారాలను సేకరించారు. విచారణలో అతడిపై తెలంగాణలో ఇప్పటికే 94 చోరీ కేసులు ఉన్నట్లు పోలీసులకు తెలిసింది. దీంతో ప్రత్యేక పోలీసు బృందాలు హైదరాబాద్‌కు వెళ్లి అప్పలనాయుడిని అదుపులోకి తీసుకున్నాయి.

రూ.9.50 లక్షలు, బంగారు ఆభరణాలు స్వాధీనం..

చోరీ చేసిన బంగారంలో కొంత భాగాన్ని అప్పలనాయుడు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. ఆ విక్రయం ద్వారా వచ్చిన రూ.9.50 లక్షలను, మిగిలిన బంగారు ఆభరణాలను తన అక్క ఇంట్లో భద్రపరిచినట్లు విచారణలో వెల్లడైంది. దీంతో పోలీసులు నగదుతో పాటు మిగిలిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడిపై హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, ఎస్‌ఆర్ నగర్, కూకట్‌పల్లి, పంజాగుట్ట, అంబర్‌పేట, మలక్‌పేట, చైతన్యపురి, మీర్‌పేట, ముషీరాబాద్, చందానగర్ తదితర పోలీస్ స్టేషన్లతో పాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లోనూ కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి పోలీస్ స్టేషన్‌లోనూ చోరీ కేసు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

Updated Date - Nov 29 , 2026 | 10:33 AM