సీఎం విజయ్‌కి మెగాస్టార్ ఫోన్.. ఏం మాట్లాడుకున్నారంటే?

ABN , Publish Date - May 15 , 2026 | 08:56 PM

మెగాస్టార్ చిరంజీవి, తమిళనాడు నూతన సీఎం దళపతి విజయ్ మధ్య ఆత్మీయమైన ఫోన్ సంభాషణ నడిచినట్లుగా తెలుస్తోంది. వీరి సంభాషణకు సంబంధించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

Vijay and Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), తమిళనాడు నూతన సీఎం దళపతి విజయ్ (Thalapathy Vijay) మధ్య ఆత్మీయమైన ఫోన్ సంభాషణ నడిచినట్లుగా తెలుస్తోంది. తమిళనాడు ఎన్నికలలో విజయ్ టీవీకే (TVK) పార్టీ మెజార్జీ పొందిన వెంటనే ట్విట్టర్ వేదికగా మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే. రీసెంట్‌గా తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మే 14, గురువారం రోజు సీఎం విజయ్‌కి మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేసి, హృదయపూర్వక అభినందనలు తెలియజేయడమే కాకుండా.. ప్రజాకేంద్రీకృత పాలనతో తమిళనాడు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని, దివంగత మహానేత ఎం.జి.ఆర్, ఎలా అయితే ప్రజల ప్రేమాభిమానాలు పొందారో.. అలాగే విజయ్ కూడా పేరు ప్రఖ్యాతులు సాధించాలని ఆకాంక్షించినట్లుగా తెలుస్తోంది.


దక్షిణ భారత సినీ రంగంలో అత్యంత ఆదరణ పొందిన ఇద్దరు ప్రముఖుల మధ్య ఉన్న పరస్పర గౌరవం, అభిమానాన్ని ఈ సంభాషణ ప్రతిబింబించిందని చెప్పుకోవాలి. ఇక చిరంజీవి తెలిపిన అభినందనలకు విజయ్ కూడా ధన్యవాదాలు తెలపడంతో పాటు.. ఇటీవల ఆయన నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రాన్ని చూశానని తెలిపినట్లుగా తెలుస్తోంది. ఆ చిత్రంలో చిరంజీవిని తెరపై చూడటం ఎంతో ఆనందంగా అనిపించిందని తెలుపుతూ.. KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న చిరంజీవి తదుపరి చిత్రానికి విజయ్ శుభాకాంక్షలు తెలియజేశారనేది ఈ ఇద్దరి మధ్య ఫోన్ కాల్ సంభాషణ సారాంశం.


ప్రస్తుతం KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌లో విజయ్ నటించిన ‘జననాయగన్’ సినిమా విడుదల కావాల్సి ఉంది. అలాగే చిరంజీవి హీరోగా ఇదే బ్యానర్‌లో సినిమా ప్రారంభం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య జరిగిన ఆత్మీయ సంభాషణ ప్రస్తుతం అభిమానులు, సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. తెలుగు, తమిళ సినీ పరిశ్రమల మధ్య ఉన్న స్నేహబంధాన్ని మరోసారి ఈ ఘటన చాటిచెప్పింది. సీఎం అయినా, పీఎం అయినా మెగాస్టార్‌తో బాండింగ్ ఇలా ఉంటుందంటూ.. మెగాభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ సంభాషణపై రియాక్ట్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి:

మోదీ ‘పొదుపు మంత్రం’.. కమల్ హాసన్ సంచలన ప్రకటన!

Varanasi: ‘వారణాసి’ కోసం మైత్రీ వేట.. టెంప్టింగ్ ఆఫర్‌!

Tom Cruise: తెలుగు యువ దర్శకుడితో టామ్ క్రూజ్ భారీ చిత్రం!

నిన్న ఆలీ.. నేడు రాజీవ్ కనకాల.. ఇలాంటి ఇబ్బందులు తప్పవు మరి!

Updated Date - May 15 , 2026 | 08:57 PM