సెన్సార్ నిబంధనలు కఠినతరం.. నిర్మాతలకు సీబీఎఫ్సీ శ్రీముఖం!
ABN , Publish Date - Nov 02 , 2026 | 02:47 PM
సీబీఎఫ్సీ ఛైర్మన్ శశి శేఖర్ వెంపటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై ఫైనల్ వెర్షన్ సినిమాలకే సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయాలని, టైటిల్ ఆమోదం, విడుదల తేదీల విషయంలో కొత్త మార్గదర్శకాలను పాటించాలని నిర్మాతలకు స్పష్టం చేసింది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఛైర్మన్ గా తెలుగువారైన శశి శేఖర్ వెంపటి బాధ్యతలు స్వీకరించిన తర్వాత దానిని సరైన మార్గంలో నడిపేందుకు పలు చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా సీబీఎఫ్‌సీకి కొత్త రక్తం ఎక్కించే పనిచేశారు. పాత బోర్డ్ మెంబర్స్ ను తొలగించి, కొత్తవారిని ఎంపిక చేశారు. ఇటీవల వీరు తీసుకున్న నిర్ణయాలను సి.బి.ఎఫ్.సి. సీఈవో రాజేంద్ర సింగ్ నిర్మాతలకు తెలియచేశారు.
కొంతకాలంగా నిర్మాతలు చాలా ఉదారంగా సెన్సార్ వారి సేవలను ఉపయోగించు కుంటున్నాయి. సినిమా ఫైనల్ వర్షన్ పూర్తి కాకముందే నిర్మాణ సంస్థలు సెన్సార్‌కు అప్లయ్ చేస్తున్నాయి. సెన్సార్ అయిన తర్వాత గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్, ఫైనల్ మిక్సింగ్ జరుపుతామని రిక్వెస్ట్ చేస్తున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో రేయింబవళ్ళు తమ టెక్నీషియన్స్ ఫస్ట్ కాపీ కోసం పనిచేస్తున్నారని, కాబట్టి కాస్తంత పెద్ద మనసుతో ఇచ్చిన సినిమాను చూసి, సెన్సార్ చేయమని అభ్యర్థిస్తుంటాయి. అయితే ఇక మీదట అలాంటి అభ్యర్థనలు చెల్లవంటూ సీ.బి.ఎఫ్.సి. సీఈవో రాజేంద్ర సింగ్ నిర్మాతలకు తాఖీదులు జారీ చేశారు.
అక్టోబర్ 24న సి.బి.ఎఫ్.సి. 150 బోర్డ్ మీటింగ్‌ను ముంబైలో నిర్వహించింది. తాజాగా ఎంపికైన కొత్త సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అక్కడ తీసుకున్న నిర్ణయాలను ఇటీవల సీఈవో ఓ లేఖ ద్వారా నిర్మాతలకు తెలియచేశారు. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల నుంచి బోర్డ్ సభ్యురాలిగా ఉన్న యార్లగడ్డ సుప్రియ హాజరయ్యారు. నిజానికి తాజాగా విడుదల చేసిన నిబంధనలన్నీ గతంలో ఉన్నవే. కొంతకాలంగా వాటిని నిర్మాతలెవరూ పట్టించుకోవడం లేదు. పైగా సినిమా సెన్సార్ సర్టిఫికెట్ జారీ కావడంలో జాప్యం జరిగినప్పుడు సంబంధిత అధికారులను టార్గెట్ చేస్తున్నారు. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు తాజాగా బోర్డ్ తీసుకున్న నిర్ణయాలు ఉపకరించే ఆస్కారం కనిపిస్తోంది.
ఈ లేఖలో పేర్కొన్న దాని ప్రకారం సర్టిఫికెట్ కోసం అప్లయ్ చేసే నిర్మాతలు ఖచ్చితంగా ఫైనల్ వర్షన్ ను సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది. గ్రాఫిక్స్, టైటిల్స్, క్రెడిట్స్, సబ్ టైటిల్స్, డిస్ క్లయిమర్, సెన్సార్ సర్టిఫికెట్ స్లాట్ అన్ని పర్ ఫెక్ట్ గా ఉండాల్సిందే. అలానే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సౌండ్ మిక్సింగ్ తర్వాత జత చేస్తామంటే కుదురదు. ఫైనల్ వర్షన్ ఏదైతే సెన్సార్ వారి ఆమోదం పొందుతుందో దానినే థియేటర్లలో ప్రదర్శించాల్సి ఉంటుంది.
ఈ మధ్య కాలంలో తెలుగులో చాలా సినిమాల టైటిల్స్ పై సెన్సార్ వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. దానిపై నిర్మాతలు వాపోయారు. ఎంతో కాలంగా పబ్లిసిటీ చేసుకున్న పేరును కాదని కొత్త పేరు పెట్టడం వల్ల తమ సినిమా కిల్ అయిపోతుందని అసహనం వ్యక్తం చేశారు. దానిపై కూడా బోర్డ్ స్పష్టమైన వివరణ ఇచ్చింది. టైటిల్ రిజిస్టర్ అయినంత మాత్రాన దానికి సెన్సార్ ఆమోదం లభించినట్టు కాదని, ట్రైలర్, టీజర్, ప్రోమోలలో టైటిల్‌ను వాడారనే కారణంగా దానికి తాము పచ్చజెండా ఊపలేమని తెలిపింది. ఎగ్జామింగ్ కమిటీ, రివైజింగ్ కమిటీ టైటిల్ పరిశీలించి, ఆమోదిస్తేనే టైటిల్ కన్ ఫర్మ్ అయినట్టుగా పేర్కొంది. సెన్సార్ సర్టిఫికెట్ లభించకుండా అదే ఫైనల్ టైటిల్ అన్నట్టుగా ప్రచారం చేయడం సబబు కాదని తెలిపింది. పూర్తి స్థాయిలో సినిమాను సిద్ధం చేసిన తర్వాత సబ్మిట్ చేసిన అప్లికేషన్ తేదీని మాత్రమే పరిగణనలోకి తీసుకుని, ఎగ్జామినేషన్ కు క్యూలో ఉంచుతామని చెప్పింది.
సినిమా విడుదల తేదీని ముందుగా ప్రకటించినంత మాత్రాన దానిని పరిగణనలోకి తీసుకుని, సినిమాను ఎగ్జామిన్ చేయడం కుదరదని స్పష్టం చేసింది. ప్రస్తుత చట్టం, నియమాల కింద నిర్దేశించిన విధివిధానాల ప్రకారమే సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందని తెలిపింది. ఒకవేళ ఏదైనా కట్స్ లేదా మార్పులు, సవరణలు చేయాల్సి వస్తే దానికి తగిన సమయాన్ని ఇవ్వాల్సి ఉంటుందని, ఎవరికి వారు తమకు అనుగుణంగా విడుదల తేదీని ప్రకటిస్తే దానికి సెన్సార్ బోర్డ్ బాధ్యత వహించదని ప్రకటించింది. నిర్మాతలు తమ విడుదల తేదీని దృష్టిలో ఉంచుకుని ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని, సెన్సార్ బోర్డ్ చేసే ఆదేశాలను పాటించడానికి అవసరమైన సమయాన్ని సైతం నిర్మాతలు దృష్టిలో పెట్టుకోవాలని కోరింది. మరి సెన్సార్ బోర్డ్ తీసుకున్న ఈ నిర్ణయాల పట్ల నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
ఇవి కూడా చదవండి:
టాలీవుడ్ స్టార్ హీరోలూ.. సూర్య, ధనుష్‌లను చూసి నేర్చుకోండయ్యా..
King: ‘కింగ్’.. ఫస్ట్ సాంగ్.. చూసేయండి
డ్రాగన్' కోసం 'ధురంధర్' మ్యూజిక్ డైరెక్టర్