Tollywood: నిర్మాతలను కలిసిన సీబీఎఫ్‌సీ ఛైర్మన్!
ABN, Publish Date - Jul 03 , 2026 | 04:28 PM
సీబీఎఫ్‌సీకి ఇప్పుడు తెలుగువారైన వెంపటి శశి శేఖర్ ఛైర్మన్ గా ఉన్నారు. గత కొంతకాలంగా సెన్సార్ విధానాలపై నిర్మాతలలో అసంతృప్తి ఏర్పడిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన నిర్మాతలను కలిసి చర్చించారు.
ఇటీవల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఛైర్మన్‌గా తెలుగువారైన శశి శేఖర్ వెంపటి నియమితులయ్యారు. గతంలో ప్రసార భారతి సీఈఓగా ఉన్న సమయంలో దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో ఆధునీకరణలో భాగంగా కీలక సంస్కరణలను ఆయన తీసుకొచ్చారు. అలానే రాజ్యసభ టీవీని కూడా సమర్థంగా నిర్వహించారు. ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థి అయిన శశి శేఖర్ మే తొలి వారంలో సి.బి.ఎఫ్.సి. ఛైర్మన్ గా నియమితులైన దగ్గర నుంచి ఈ శాఖలోనూ సంస్కరణలపై దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది.
గత కొంతకాలంగా సినిమా నిర్మాతలు సెన్సార్ బోర్డ్ వైఖరిపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలలో ఇది మరీ ప్రత్యేకంగా కనిపిస్తోంది. గత యేడాది సురేశ్ గోపీ నటించిన 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' సినిమా సెన్సార్ ఇబ్బందులను ఎదుర్కొంది. నిజానికి సురేశ్ గోపీ కేంద్ర మంత్రిగా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఆ సినిమా కూడా సెన్సార్ కారణంగా విడుదల వాయిదా పడింది. అలానే తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ నటించిన 'జన నాయగన్' సంక్రాంతికి రావాల్సింది. సెన్సార్ వివాదం కారణంగా అనుకున్న సమయానికి విడుదల కాలేదు. ఇది రిలీజ్ కాకుండానే విజయ్ ఎన్నికల్లో పోటీ చేసి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఇటీవల దీనిని చూసిన రివైజింగ్ కమిటీ 'ఎ' సర్టిఫికెట్ జారీ చేసిందని తెలుస్తోంది. కానీ సినిమా విడుదల తేదీపై నిర్మాత ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే... ఇటీవల చాలా చిన్న సినిమాల పేర్లపై సెన్సార్ వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో 'హే భగవాన్, వానర, చాయ్ వాలా' వంటి సినిమాల పేర్లను నిర్మాతలు మార్చుకోవాల్సి వచ్చింది. అలానే 'కపుల్ ఫ్రెండ్లీ' మూవీ టైటిల్ మార్చడానికి నిర్మాత అంగీకరించని కారణంగా దానికి సెన్సార్ వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చారు. అలానే ఇటీవల విడుదలైన 'దీవానా' సినిమాకూ 'యు/ఎ' కాకుండా 'ఎ' సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల తమ సినిమా కలెక్షన్స్ పై ఆ సర్టిఫికెట్ ప్రభావం పడిందని నిర్మాతలు ప్రెస్ మీట్ లో వాపోయారు.
ఈ నేపథ్యంలో నిర్మాతలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేయడానికి సెన్సార్ బోర్డ్ ఛైర్మన్ శశిశేఖర్ చొరవ చూపారు. ముంబై నుండి ఆయన హైదరాబాద్ వచ్చి, గురువారం ఎఫ్.ఎన్.సి.సి.లో ఇక్కడ తెలుగు నిర్మాతలను కలిసి వారితో చర్చించారు. తెలుగు సినిమా నిర్మాతలు పలువురు ఈ సమావేశానికి హాజరై... సెన్సార్ నుంచి తమకు ఎదురౌతున్న సమస్యలను చెప్పారని, దానిపై ఆయన సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సెన్సార్ నిబంధనలకు సంబంధించి పాత జీవోలో కొన్ని సవరణలు చేసింది. దాంతో 'యు/ఎ' సర్టిఫికెట్ ను సైతం వయసుల వారిగా మూడు కేటగిరిల్లో ఇస్తున్నారు. అలానే దివ్యాంగులు సైతం థియేటర్లకు వచ్చి వినోదాన్ని పొందేలా వారికి కొన్ని సౌకర్యాలు కల్పించాలనే నిబంధనను ప్రభుత్వం పెట్టింది. దీనిపై థియేటర్ల యాజమాన్యం నుంచి అంత సానుకూల స్పందన రావడం లేదు. అలానే చిన్న చిత్రాల నిర్మాతలు సైతం వాయిస్ యాప్ రూపకల్పనపై విముఖత ప్రదర్శిస్తున్నారని సమాచారం. దీనిపై కూడా శశిశేఖర్ నిర్మాతలకు అవగాహన కల్పించారని తెలుస్తోంది.
మొత్తం మీద తెలుగు వ్యక్తి తొలిసారి సెన్సార్ బోర్డ్ ఛైర్మన్ కావడం పట్ల నిర్మాతలు హర్షం వ్యక్తం చేశారని, తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారని, అదే సమయంలో సెన్సార్ అధికారులు సైతం తమకు సహకరించాలని కోరినట్టు తెలుస్తోంది. ఛైర్మన్ హోదాలో ఉండి కూడా శశిశేఖర్ నిర్మాతలను స్వయంగా ఈ సమావేశానికి ఆహ్వానించి, తమ సమస్యలపై చర్చించడం పట్ల పలువురు నిర్మాతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సి.బి.ఎఫ్.సి. ఛైర్మన్ శశి శేఖర్ తో పాటు సీఈఓ రాజేంద్రసింగ్, సి.బి.ఎఫ్.సి. బోర్డ్ మెంబర్ జీవితా రాజశేఖర్, రీజనల్ ఆఫీసర్ రాహుల్ గౌలీకర్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి:
National Award: మళ్లీ అల్లు అర్జున్‌కేనా? అదే జరిగితే చరిత్రే!
‘జైలర్ 2’కి పోటీగా.. చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్ అప్పుడేనా!