కాంట్రాక్టర్ మెడలో బంగారు గొలుసు చోరి.. యూ ట్యూబర్ మధుమితపై కేసు
ABN, Publish Date - Oct 06 , 2026 | 02:41 PM
యూట్యూబర్ మధుమితపై బంగారు గొలుసు చోరీ ఆరోపణలతో కేసు నమోదైంది.
యూట్యూబర్ (YouTuber) మధుమిత (Madhumitha)పై చోరీకేసు నమోదైంది. తిరునల్వేలికి చెందిన పేచ్చిముత్తు అనే బిల్డింగ్ కాంట్రాక్టర్‌ను మధుమిత మాయమాటలతో బోల్తా కొట్టించి మెడలోని బంగారు గొలుసును అపహరించింది. నాలుగేళ్ల క్రితం జరిగిన ఈ సంఘటనపై పేచ్చి ముత్తు రాజమంగళం పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులోని వివరాల ప్రకారం పేచ్చిముత్తు తరచూ వెన్నునొప్పితో బాధపడుతూ ఫిజియోథెరపీ చికిత్సకు వెళ్ళి వస్తుండేవారు. ఆ సమయంలో మదుమితతో ఆయనకు పరిచయం ఏర్పడింది.
ఆ తర్వాత ఆమె అదే పనిగా పేచ్చిముత్తుతో ఫోన్‌లో మాట్లాడుతుండేది. దీంతో విసిగిపోయిన పేచ్చిముత్తు ఆమె ఫోన్ కాల్స్ తీయడం మానేసాడు. ఆ తర్వాత ఓ రోజు తిరునల్వేలి కోర్టు వద్ద తనను అర్జెంటుగా కలుసుకోమని మధుమిత ఫోన్ చేయడంతో పేచ్చిముత్తు వెళ్లాడు. తనను ఓ చోటుకు తీసుకెళ్ళమని అడగటంతో ఆయన బైకుపై ఆమెను తీసుకువెళ్ళాడు. అదే అదనుగా ఆమె అతడి మెడలోని బంగారు గొలుసు చోరీ చేసింది.
ఇంటికి వెళ్ళిన తర్వాత తన మెడలో గొలుసు లేకపోవడంతో మధుమితను అడిగితే తానే తీసుకున్నానని, పోలీసులకు ఫిర్యాదు చేసినా తనకు భయం లేదని, అంతే కాకుండా పోలీసులకు చెబితే తన పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు లైంగిక వేధింపుల కేసు నమోదయ్యేలా చేస్తానని బెదరించింది. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయకుండా మౌనం దాల్చాడు. ఈ నేపథ్యంలో పేచ్చిముత్తు ప్రస్తుతం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మధుమిత వద్ద విచారణ జరిపేందుకు సిద్ధమవుతున్నారు.