2 కోట్లు తీసుకుని.. రెండు రోజుల్లో తిరిగిస్తానని మోసం! సినీ నిర్మాతపై కేసు
ABN, Publish Date - Jul 07 , 2026 | 06:22 AM
రూ.2 కోట్లు అప్పుగా తీసుకుని ఏడాదైనా తిరిగి చెల్లించలేదన్న ఆరోపణలతో సినీ నిర్మాత వెంకట అనీష్ రెడ్డిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
రెండు కోట్ల రూపాయలు చేబదులు తీసు కొని రెండు రోజుల్లో తిరిగిస్తానని చెప్పి ఏడాది గడిచినా ఇవ్వడం లేదని సినీ నిర్మాతపై కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్ జిల్లాకు చెందిన బాల్టూరి రంజిత్ కుమార్ రావు (Ranjith Kumar Rao) సినీ నిర్మాత.. మైనింగ్ కంపెనీలు కూడా నిర్వహిస్తుంటారు. గతేడాది ఎటర్నల్ 7ఎంటర్టైన్ మెంట్స్ (Eternal 7 Entertainments) నిర్వాహకుడు, మరో నిర్మాత వెంకట అనీష్ రెడ్డి (Aneesh Reddy) తో పరిచయం ఏర్పడింది.
ఈ క్రమంలో ఆనీష్ రెడ్డి తనకు 2 కోట్లు అవసరముందని, రెండు రోజుల్లో తిరిగి ఇస్తానని రంజిత్ కుమార్ రావుతో చెప్పగా, అతడు తన వద్ద ఉన్న డబ్బుతో పాటు భాగస్వాముల నుంచి రూ. 40 లక్షలు తీసుకొని అనీష్‌కి ఇచ్చాడు. రోజులు గడుస్తున్నా అనీష్ రెడ్డి డబ్బు తిరిగి ఇవ్వకపోగా కార ణాలు చెబుతూ తప్పించుకుంటున్నాడు. కొద్ది రోజులుగా ఫోన్ చేస్తే స్పందించకపోవడంతో బాధితుడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
పోలీసులు (Jubilee Hills Police) నిర్మాత అనీష్ రెడ్డిపై కేసు నమోదు చేసు కొని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా రూ.25 లక్షలు తీసుకొని డబ్బు తిరిగి ఇవ్వ కుండా కాలయాపన చేయడంతో పాటు తనను నిర్భందించి దాడి చేశాడని ఐపీఎస్ మాజీ అధికారి ఏకే ఖాన్ కుమారుడు మోసిన్‌పై అనీష్ రెడ్డి గతంలో ఫిర్యాదు చేయడం గమనార్హం.