సావిత్రమ్మ అద్భుతాలకే అద్భుతం: బ్రహ్మానందం
ABN , Publish Date - Jul 11 , 2026 | 01:47 PM
వెండితెర ధృవతార, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే మహానటి సావిత్రి 90వ జయంతి సందర్భంగా సంజయ్ కిషోర్ రచించిన ‘సావిత్రి క్లాసిక్స్’ ఇంగ్లీషు పుస్తకాన్ని శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు.
వెండితెర ధృవతార, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే మహానటి సావిత్రి (Mahanati Savitri) 90వ జయంతి సందర్భంగా సంజయ్ కిషోర్ (Sanjay Kishore) రచించిన ‘సావిత్రి క్లాసిక్స్’ (Savitri Classics) ఇంగ్లీషు పుస్తకాన్ని శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నటీమణి జయప్రద ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి, తొలి ప్రతిని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు అందజేశారు. ఈ కార్యక్రమానికి బ్రహ్మానందం, తమ్మారెడ్డి భరద్వాజ, కేఐ వరప్రసాద్ రెడ్డి, నిర్మాత నాగ సుశీల, సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి, జయలలిత, సంజయ్ కిషోర్, బొల్లినేని కృష్ణయ్య తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా బ్రహ్మానందం (Brahmanandam) మాట్లాడుతూ.. సావిత్రమ్మ ప్రాత:స్మరణీయులు కారు.. చిరస్మరణీయులు. కొంత మంది పుడతారు.. భగవంతుడు కొంత మందిని పుట్టిస్తాడు. అలాంటి వారిని కారణజన్ములు అంటారు. అలాంటి వారిలో సావిత్రమ్మ ఒకరు. ఎంతో మంది మహానుభావులు జన్మించిన ఈ గడ్డపై సావిత్రమ్మ జన్మించడం మన అదృష్ణం. ఆ తల్లి కోటానుకోట్ల హావభావాల్ని అందించారు. ఆమె గంధర్వుల్లాంటి వారు. ఆమె అద్భుతాలకే అద్భుతం. అలాంటి వారికి మరణం ఉండదు. ఆమెతో ఒక్క సినిమా అయినా నటిస్తే బాగుండు కదా? అనే కోరిక ఉండేది. ఆమెతో నటించే భాగ్యం నాకు దక్కలేదు. ఆమెను స్మరించుకోని తెలుగు వారు, తెలుగు జాతి ఉండదు. ఒక్క సెకనులో మూడు రకాల ఎక్స్‌ప్రెషన్స్‌లో ఇచ్చే మహానటి సావిత్రి. అలాంటి సావిత్రమ్మ పై పుస్తకాలు రాస్తున్న కిషోర్‌కు ధన్యవాదాలు. తల్లి రుణాన్ని తీర్చుకుంటున్న చాముండేశ్వరి జీవితం చరితార్థం అవుతుంది. ఈ పుస్తకం, ఆ ముఖచిత్రం చూసి నా కంట్లోంచి నీరు వచ్చేసింది. సంజయ్ ప్రతీ పనిని త్రికరణ శుద్ధితో చేస్తాడు. ఇలాంటి గొప్ప పుస్తకాలెన్నో ఆయన రచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.
విజయ చాముండేశ్వరి మాట్లాడుతూ.. అమ్మ మీద అందరికీ అభిమానం ఉంటుంది. అయితే ఆమె జ్ఞాపకాల్ని ఎప్పటికీ భద్రపర్చాలని సంజయ్ కిషోర్‌ను సంప్రదించాను. తెలుగులో ఈ బుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంగ్లీష్‌లో అనువదిస్తే మరింత మందికి రీచ్ అవుతుందని ఇంగ్లీష్ ఎడిషన్‌ను రిలీజ్ చేస్తున్నామని తెలిపారు. గోవింద రావు మాట్లాడుతూ.. జయప్రద అభినయం అంటే నాకు ఇష్టం. ఆమె నటించిన ‘మేఘ సందేశం’ చూసి ఆశ్చర్యపోయాను. నాగ సుశీల, చాముండేశ్వరి ఒకే స్టేజ్ మీద కలిసి కనిపించడం చాలా అరుదు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్ అని పేర్కొన్నారు. వర ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. గోవింద రావు అడిగిన వెంటనే ఈ కార్యక్రమానికి వస్తానని చెప్పాను. రాజుల గురించి, రాజ వంశాల గురించి చరిత్రకారులు రాస్తుంటారు. అయితే కళాకారులకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. వారి వల్లే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. అందుకే అలాంటి మహామహుల చరిత్రను భద్రపర్చాలి, గ్రంథస్థం చేయాలి. ఇలాంటి పుస్తకాలే భావి తరాలకు కరదీపికగా ఉంటాయి. సంజయ్ కిషోర్ ఇలాంటి మరెన్నో గొప్ప పుస్తకాలు రాయాలని కోరుకుంటున్నానని అన్నారు.
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ.. సంజయ్‌తో నాకు ఎన్నో ఏళ్ల నుంచి మంచి అనుబంధం ఉంది. ఆయన నిర్వహించిన సావిత్రమ్మ జయంతి, వర్దంతి కార్యక్రమాలకు హాజరవుతుండేవాడ్ని. వర ప్రసాద్ రెడ్డి నాకు మంచి స్నేహితులు. నా ఇంట్లో హోం థియేటర్‌కి సావిత్రి సినిమా అని పేరు పెట్టాను. ప్రతీ సీన్‌లో, ప్రతీ పాటలో, లిరిక్స్‌కి తగ్గట్టుగా సావిత్రమ్మ అద్భుతమైన ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తారు. ఆ హావభావాల కోసం ఎన్నోవేల సార్లు సినిమాలని చూసి ఉంటాను. సావిత్రమ్మ అంటే నాకు ఓ ఎమోషన్. ఇంకా ఎన్ని దశాబ్దాలైనా సరే ఆమె గుర్తుండిపోయేలా ఇలాంటి పుస్తకాలు తీసుకు రావడం ఆనందంగా ఉందని అన్నారు. బొల్లినేని కృష్ణయ్య మాట్లాడుతూ.. మహానటి సావిత్రి గురించి అందరూ మాట్లాడుతూ ఉంటే విని ఆనందించాలని ఇక్కడకు వచ్చాను. ఆమె నటనలో తారాస్థాయికి చేరుకున్నారు. అమ్మని తల్చుకునేలా ఇలాంటి పుస్తకాల్ని రిలీజ్ చేస్తున్న చాముండేశ్వరికి, సంజయ్‌కు ధన్యవాదాలని చెప్పుకొచ్చారు.
పుస్తక రచయిత సంజయ్ కిషోర్ మాట్లాడుతూ.. అలనాటి నటీమణిని మనం ఇప్పటికీ తల్చుకుంటున్నాం. ‘ఈ సావిత్రి మరణించదు.. మరో సావిత్రి జన్మించదు’ అని ఆత్రేయ అన్నారు. అది ముమ్మాటికీ నిజం. తెలుగు సినిమాలో చరిత్రలో ఏ కథానాయికకి ఊరురా విగ్రహాలు లేవు. అందుకు సావిత్రి ఎప్పుడూ జీవించే ఉంటారు. తెలుగు జాతి స్త్రీకి ప్రతీకగా సావిత్రి నిలిచారు. నా పట్టుదల, ప్యాషన్ చూసి సావిత్రికి సంబంధించిన అరుదైన ఫోటోలెన్నో చాముండేశ్వరి ఇచ్చారు. 90వ జయంతికి సంబంధించిన కార్యక్రమాల గురించి చాముండేశ్వరి ఎన్నో ఇన్ పుట్స్ ఇచ్చారు. ఈ జర్నీలో బొల్లినేని కృష్ణయ్య ఎంతో సహకరించారు. ఆయన మా అందరినీ ముందుండి నడిపించారు. చిరంజీవి తన సొంత ఖర్చుతో భారీ ఈవెంట్‌ను నిర్వహించి తెలుగు బుక్‌ను లాంఛ్ చేశారు. ఈ ఇంగ్లీష్ ఎడిషన్ పుస్తకాన్ని జయప్రద లాంఛ్ చేయడం ఆనందంగా ఉంది. ఈ ఇంగ్లీష్ ఎడిషన్ తొలి కాపీని రఘురామకృష్ణంరాజు అందుకోవడం ఆనందంగా ఉంది. బ్రహ్మానందం అంటే నాకు అపరిమితమైన గౌరవం. ఆయన తెలుగు సినిమా చరిత్రలో నాలుగు దశాబ్దాలుగా నెంబర్‌వన్ కమెడియన్‌గా రాణిస్తున్నారని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
టూర్‌కు రెడీ అవుతోన్న ప్రభాస్.. వచ్చాక ఇక ర్యాంపే!
అప్పుడు చిరంజీవి.. ఇప్పుడు నేను.. అదృష్టంగా భావిస్తున్నా: జయప్రద
Sunday Tv Movies: జూలై 12, ఆదివారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు