Telugu Cinema: బి. నరసింగరావు ఆవిష్కరించిన హెచ్. ఎం. రెడ్డి పుస్తకం
ABN, Publish Date - Jan 20 , 2026 | 11:53 AM
హెచ్. రమేశ్ బాబు రాసిన 'హెచ్.ఎం. రెడ్డి: తెలుగు సినిమా పితామహుడు' పుస్తకం విడుదలైంది. ప్రముఖ దర్శకుడు బి. నరసింగరావు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి, రచయితను అభినందించారు.
తెలుగు సినిమా చరిత్రతో పాటు మరీ ముఖ్యంగా తెలంగాణ సినిమా ప్రారంభ వికాసాలను అక్షరబద్ధం చేస్తున్న వారిలో హెచ్. రమేశ్ బాబు (H. Ramesh Babu) ఒకరు. సినిమా రంగానికి సంబంధించి పలు పుస్తకాలను ఇప్పటికే వెలువరించిన ఆయన తాజాగా 'హెచ్.ఎం. రెడ్డి: తెలుగు సినిమా పితామహుడు' (H.M. Reddy Telugu Cinema Pithamahudu) పేరుతో మరో గ్రంధాన్ని తీసుకొచ్చారు. దీనిని జనవరి 19వ తేదీ సాయంత్రం రవీంద్రభారతిలోని మినీ ఆడిటోరియంలో ప్రముఖ దర్శక నిర్మాత బి. నరసింగరావు (B. Narasingarao) ఆవిష్కరించారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ సినిమా వేదిక నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత పరవస్తు లోకేశ్వర్, దర్శకులు ప్రేమ్ రాజ్ (Premraj), సీనియర్ జర్నలిస్ట్ చల్లా శ్రీనివాస్, ఆనందాచారి తదితరులు హాజరయ్యారు. వహీద్ ఖాన్ కార్యక్రమాన్ని నిర్వహించగా, పి. రామిరెడ్డి సభకు అధ్యక్షత వహించారు.
తెలంగాణ సినిమా వేదిక ఆధ్వర్యంలో ఈ పుస్తకావిష్కరణ జరగడం పట్ల సంస్థ గౌరవాధ్యక్షుడు ప్రఫుల్ రాంరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా సినిమా రంగానికి మంచి రోజులు రాలేదని, హైదరాబాద్ ను ప్రపంచ సినిమా హబ్ గా చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కాకపోతే తెలంగాణ సినిమాను నిలబెట్టేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని దర్శకుడు ప్రేమ్ రాజ్ అన్నారు. పాన్ ఇండియా సినిమా మోజులో ప్రస్తుతం నిర్మాతలు ఉన్నారని, అయితే ఈ క్రేజ్ ఎక్కువ కాలం ఉండదని, సినిమాను బలంగా నిలబెట్టేవి ప్రాంతీయ చిత్రాలేనని చల్లా శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు.
మిత్రుల సహకారంతో 'హెచ్.ఎం. రెడ్డి' పుస్తకాన్ని తాను తీసుకొచ్చానని, త్వరలోనే తెలంగాణ సినిమా చరిత్రను పుస్తకంగా తీసుకు రాబోతున్నానని రచయిత హెచ్. రమేశ్ బాబు చెప్పారు. సినిమా రంగం పట్ల, సినిమా వ్యక్తుల పట్ల ఉన్న అపారమైన ప్రేమ కారణంగా హెచ్. రమేశ్ బాబు ఇలాంటి పుస్తకాలను తీసుకొస్తున్నారని, ఎంతో శ్రమకోర్చి సినిమా చరిత్రను ఆయన రికార్డ్ చేయడం గొప్ప విషయమని బి. నరసింగరావు అభినందించారు. సహాయ దర్శకులు కమలాకర్ రెడ్డి 'హెచ్.ఎం. రెడ్డి' పుస్తకంలోని అంశాలను సోదాహరణంగా సభికులకు వివరించారు. తెలంగాణ సినిమా వేదిక అధ్యక్షులు లారా వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.