భానుప్రియ కుటుంబానికి గుండెపోటు శాపమా..? సిస్టర్స్ ట్రాజెడీ స్టోరీ
ABN , Publish Date - Apr 06 , 2026 | 09:00 PM
కొన్నిసార్లు అంతే.. కాలం కొందరిని కాలనాగులా పగబడుతుంది. ఒక దెబ్బ నుంచి కోలుకోక ముందే మరో దెబ్బ కొడుతుంది. టాలీవుడ్‌కు చెందిన సీనియర్ నటి భానుప్రియ కుటుంబాన్ని
కొన్నిసార్లు అంతే.. కాలం కొందరిని కాలనాగులా పగబడుతుంది. ఒక దెబ్బ నుంచి కోలుకోక ముందే మరో దెబ్బ కొడుతుంది. టాలీవుడ్‌కు చెందిన సీనియర్ నటి భానుప్రియ కుటుంబాన్ని అలాగే వెంటాడుతోంది. సీనియర్ నటి భానుప్రియ (Senior Actress Bhanupriya)కు పరిచయం అక్కర్లేదు. తన అందం, అభినయం, నృత్యంతో దశాబ్దాలు వెండితెరను ఏలింది. అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఆమె వ్యక్తిగత జీవితంలో మాత్రం వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. 2026 మార్చిలో భానుప్రియ తల్లి ఎం. లక్ష్మి (M Lakshmi) గుండెపోటుతో కన్నుమూయడంతో ఆమె కుటుంబం తీవ్ర శోకంలో మునిగిపోయింది. దాదాపుగా భానుప్రియ కుటుంబాన్ని గుండెపోటు అనేది ఓ శాపంగా మారడం అభిమానులను కలచి వేస్తోంది. భానుప్రియ జీవితంలోనే కాదు ఆమె సోదరి నటి శాంతిప్రియ (Shanthi Priya) లైఫ్‌లోనూ ఇలాంటి ట్రాజెడీలు చోటు చేసుకోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.
కెరీర్ నుంచి బ్రేక్ తీసుకుని మ్యారేజ్ లైఫ్‌లోకి ఎంటర్ అవ్వాలనే ఉద్దేశ్యంతో 1998లో భానుప్రియ ప్రముఖ నృత్యకారిణి సుమతి కౌశల్ కుమారుడు ఆదర్శ్ కౌశల్‌ను పెళ్ళి చేసుకుంది. పెళ్ళి తర్వాత యూఎస్‌లో సెటిల్ అయింది. అయితే 2005లో భర్తతో వచ్చిన విభేదాల కారణంగా కూతురుతో కలిసి ఇండియాకు వచ్చేసింది. అలా వచ్చిన కొంత కాలానికే ఆమె భర్త ఆదర్శ్ కౌశల్ అమెరికాలో గుండెపోటుతో మరణించారు. అప్పటి నుంచి తల్లి దగ్గరే ఉంటోంది. భర్త దూరమైనప్పుడు, కెరీర్ కష్టాల్లో ఉన్నప్పుడు భానుప్రియకు వెంటే ఉండి ఆమె తల్లి ఎంతగానో ఓదార్చారు. ఇప్పటి వరకు భానుప్రియకు అన్నింటా తోడుగా ఉన్న ఆమె తల్లి మరణించడం ఆమెకు తీరని లోటు. అటు అక్క జీవితం లాగే సోదరి శాంతిప్రియ లైఫ్ ఉండటం మరింతగా బాధపెట్టే అంశం.
శాంతిప్రియ.. భానుప్రియలాగే హీరోయిన్‌గా తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ‘మహర్షి’ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. అవకాశాలు మంచిగా వస్తున్న సమయంలోనే బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ రేను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆయన కూడా 2004లో 40 ఏళ్ళ వయసులోనే గుండెపోటుతో మరణించారు. ఒకే కుటుంబంలో అక్కాచెల్లెళ్ళ భర్తలు, తల్లి అలా వరుసగా గుండెపోటుతో మరణించడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. పైగా పెద్ద దిక్కుగా ఉన్న తల్లి కూడా గుండెపోటుతో మరణించడంతో ఆ ఇద్దరు సోదరీమణులు ఒంటరివారయ్యారు. ఆత్మీయులను కోల్పోతున్న బాధ నుంచి భానుప్రియ, శాంతి ప్రియ త్వరగా కోలుకోవాలని సినీ ఇండస్ట్రీ, అభిమానులు కోరుకుంటున్నారు.