A.R. Rahman: విభజనకు దారి తీసే వ్యాఖ్యలు...
ABN, Publish Date - Jan 19 , 2026 | 01:12 PM
ఎ.ఆర్. రెహమాన్ తన వ్యాఖ్యలను సరిగా అర్థం చేసుకోలేదని వివరణ ఇచ్చినా... కొందరు సినీ రంగ ప్రముఖులు మాత్రం రెహమాన్ వ్యాఖ్యల పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవ పరిస్థితులను ఆయన అర్థం చేసుకోవడం లేదని విమర్శించారు.
ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఎ.ఆర్. రెహమాన్ (AR Rehman) చేసిన వ్యాఖ్యలు చాలామంది మనసుల్ని గాయపరిచాయి. ఆయన తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా... సినిమా రంగానికి ముఖ్యంగా సంగీత ప్రపంచానికి చెందిన వారు తమ మనసులోని భావాలను వెలిబుచ్చే ప్రయత్నం చేశారు. ఎ.ఆర్. రెహమాన్ వంటి ఉన్నత స్థాయిలోని వ్యక్తి అలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రం సబబు కాదని మధుర ఆడియోస్ అధినేత, ప్రముఖ దర్శక నిర్మాత 'మధుర' శ్రీధర్ (Madhura Sridhar Reddy) అభిప్రాయపడ్డారు.
'మధుర' శ్రీధర్ రెడ్డి, రెహమాన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ, 'ఈ సినిమా రంగంలో సంగీత దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ ఎత్తుపల్లాలు అనేవి ఉంటాయి. హిందీ, తెలుగు, తమిళ చిత్రసీమలలో కూడా ఇది సహజంగా జరిగేదే. వ్యక్తులకు ఆదరణ తగ్గడం అనే దాని రకరకాల కారణాల ఉంటాయి. తరం మారడం, ప్రేక్షకుల అభిరుచిలో మార్పు రావడం, బడ్జెట్ పరిమితులు, కొత్త పనితీరు, ట్రెండ్స్ మారడం... ఇవన్నీ కారణమే. గడిచిన దశాబ్ద కాలంలో డిజిటల్ మ్యూజిక్ యుగంలో పెను మార్పులు సంభవించాయి. సంగీతం ప్రజాస్వామ్య రూపం దాల్చింది. సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ కారణంగా ఎంతోమంది యువ, ప్రతిభావంతులైన వారు ఈ రంగంలోకి వచ్చారు. దాంతో ప్రముఖ నిర్మాణ సంస్థలు, మ్యూజిక్ లేబుల్స్ ఈ రంగంలో ఉన్న లబ్దప్రతిష్ఠులపై ఆధారపడలేదు. పెట్టుబడిని, దానిపై వచ్చిన లాభాన్ని, ప్రేక్షకులకు చేరువ కావడానికి చేయాల్సి విషయాలను గురించి ఎక్కువ ఫోకస్ చేశాయి. దాంతో సహజంగా కొత్త ప్రతిభావంతులకు అవకాశాలు వచ్చాయి.
గడిచిన పదిహేను సంవత్సరాలలో ముఖ్యంగా బాలీవుడ్ లో చాలా మార్పులు వచ్చాయి. ఒకే సినిమాకు పలువురు సంగీత దర్శకులు స్వరాలు సమకూర్చుతున్నారు. పాటలకు భిన్నమైన వ్యక్తలు స్వరాలు అందిస్తున్నారు. మరొకరు నేపథ్య సంగీతం ఇస్తున్నారు. ఇది పరిశ్రమలో జరిగిన మార్పు తప్పితే వివక్ష ఎంతమాత్రం కాదు. కాబట్టి, వృత్తిపరంగా వెనకబడి పోవడానికి మతం కారణంగా చెప్పడం అనేది సమాజాన్ని తప్పుదోవ పట్టించడం తప్పితే మరొకటి కాదు. భారతీయ సంగీతాభిమానులు దశాబ్దాలుగా ఎ. ఆర్. రెహమాన్ మ్యూజిక్ ను ప్రాంతాలు, మతాలతో సంబంధం లేకుండా ప్రేమిస్తున్నారు. ఇప్పటికీ ఆయన ప్రముఖుల చిత్రాలకు, ప్రముఖ నిర్మాణ సంస్థలకు వర్క్ చేస్తున్నారు. ఇళయరాజా గారు కెరీర్ పరంగా పీక్స్ లో ఉన్నప్పుడు, ఆ తర్వాత తరం ఎ. ఆర్. రెహమాన్ ను అభిమానించడం మొదలు పెట్టింది. అంత మాత్రాన ఇళయరాజాను తిరస్కరించినట్టు కాదు... శ్రోతల అభిరుచిలో మార్పు వచ్చిందని అర్థం చేసుకోవాలి. ఇవాళ కూడా అదే విధానం కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా గౌరవాన్ని అందుకుంటున్న ఓ కళాకారుడు పరిశ్రమలోని మార్పులకు మతపరమైన కారణాలను ఎత్తి చూడడం, అదీ ఇప్పుడున్న సున్నితమైన సమయంలో సరైనది కాదు. ఇది ప్రజలలో గందరగోళానికి, విభజనకు దారి తీస్తుంది. ప్రజలలో గుర్తింపు ఉన్న బాధ్యత గల వ్యక్తి పరిశ్రమలోని మార్పులను అంగీకరించాలి తప్పితే, పెడర్థాలకు తావిచ్చే వ్యాఖ్యలు చేయడం సబబు కాదు. ఎందుకంటే అలాంటి వారి మాటలకు ఎంతో విలువ ఉంటుంది' అని అన్నారు. 'మధుర' శ్రీధరే కాకుండా తెలుగు సినిమా రంగంలో ఎ.ఆర్. రెహమాన్ ను ఇష్టపడే పలువురు ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
'రెహమాన్, తుఝే సలాం' అన్నాం... కానీ మీరు...
నటుడు, దర్శకుడు రాజ్ మాదిరాజు (Raj Madiraju) సైతం ఈ విషయమై సోషల్ మీడియాలో స్పందించారు.
రెహమాన్ ను ఉద్దేశించి ఆయన పోస్ట్ పెడుతూ, 'ఒక హిందూ పురాణం ఇతివృత్తంగా 4వేల కోట్ల రూపాయల బడ్జెట్ లో అతి పెద్ద భారతీయ చిత్రం 'రామాయణ' (Ramayana) కు పాటలు కంపోజ్ చేస్తూ, 'గత కొన్నేళ్ళుగా నాకు బాలీవుడ్‌లో అవకాశాలు తగ్గడానికి మతపరమైన కారణాలే అయ్యుండవచ్చు' అనడం హాస్యాస్పదంగా ఉంది రెహమాన్!' అని అన్నారు. అంతేకాదు, రెహమాన్ కెరీర్ ను విశ్లేషిస్తూ, '2006 నుండి 2015 వరకు పదేళ్ళలో 21 హిందీ సినిమాలకు సంగీతం ఇస్తే 2016 నుండి 2025 వరకు పదేళ్లలో సరిగ్గా 21 సినిమాలకే ఇచ్చావు... సో, బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత గత ఎనిమిదేళ్ళలో అవకాశాలు తగ్గాయనడమే తప్పు, అంతకన్నా పెద్ద తప్పు దానికి మీరు చెప్పిన కారణం! మిమ్మల్ని గొప్ప కళాకారుడిగా అభిమానించాం, ఆరాధించాం, ఈ చీప్ ట్రిక్స్ వైపుకి మీరు వెళ్ళకపోతే బెటర్. ఎందుకంటే వందేమాతరం అన్న ఒరిజినల్ జాతీయ గీతానికి ఎంత అభిమానం, గౌరవం ఇచ్చామో అంత ఉత్తేజం మీ పాటకీ ఇచ్చాం. రెహమాన్, తుఝే సలాం అన్నాం... మీరీ మాట అనేవరకు మీరు నా మతం కాదు అన్న స్పృహే లేదు నాకు. దూరం వెళ్ళకు రెహమాన్... You don't know how much it hurts... Not just me but millions of Indians' అంటూ రాజ్ మాదిరాజు తన ఆవేదనను వ్యక్తం చేశారు.