ఆనంద్ బక్షి సినీ ప్రస్థానం.. తెలుగులోకి 'నగ్మే, కిస్సే, బాతే, యాదే'
ABN , Publish Date - Nov 03 , 2026 | 02:00 PM
ప్రముఖ సినీ గీత రచయిత ఆనంద్ బక్షి సినీ జీవిత ప్రయాణాన్ని తెలిపే 'నగ్మే కిస్సే బాతే యాదే' పుస్తకాన్ని కొల్లూరి సోమశంకర్ తెలుగులోకి అనువదించారు. హైదరాబాద్‌లో ప్రముఖుల సమక్షంలో గ్రంథావిష్కరణ జరిగింది.
ప్రముఖ సినీ గీత రచయిత ఆనంద్ బక్షి జీవిత గాథను తెలుగులోకి తీసుకొచ్చారు రచయిత కొల్లూరి సోమశంకర్. ఆనంద్ బక్షి తనయుడు రాకేశ్ బక్షి తన తండ్రి సినీ జీవన ప్రయాణాన్ని ఇంగ్లీష్ లో పుస్తకంగా తీసుకు రాగా, దానిని సోమశంకర్ తెలుగులో అనువదించారు. 'నగ్మే, కిస్సే, బాతే, యాదే' అనే ఈ గ్రంథాన్ని ఇటీవల ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ ఓలేటి పార్వతీశం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఓలేటి పార్వతీశం మాట్లాడుతూ, 'ఆనంద్ బక్షి పాటల్లో జీవన మూల్యాలు, కష్టాలు, నిత్య జీవన చిత్రాలు ప్రజల హృదయాలలో చెరగని ముద్రవేశాయ'ని అన్నారు. ఈ గ్రంథంలోని పలు ఆసక్తికరమైన అంశాలను సమీక్షకులు ఆచార్య ఫణీంద్ర వివరించారు. ప్రధాన వక్తగా హాజరైన కస్తూరి మురళీకృష్ణ తెలుగు - హిందీ సినీ గీతాలలోని వైవిధ్యతను సభికులకు వివరించారు. మరో వక్త కుంతిపురం తిలక్ ఆరుద్ర సినీ గీతాలను విశ్లేషించారు. ఈ రచన చేయడానికి గల కారణాలను గ్రంథ రచయిత కొల్లూరి సోమశంకర్ వివరించారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆచార్య వంగపల్లి విశ్వనాథం అధ్యక్షత వహించగా, సాధన నరసింహాచార్య, కాకర్ల హనుమంతరావు, కేవీఎన్ ఆచార్య పాల్గొన్నారు. శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయంలో యువభారతి సాహితీ సాంస్కృతిక సంస్థ, తెలుగు సాహిత్య వెబ్ మేగజైన్ 'సంచిక' సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి.
ఇవి కూడా చదవండి:
Ritika Singh: నా పేరుతో.. నాకు తెలియకుండానే సబ్ స్క్రిప్షన్ రూ.400 వసూలు చేస్తున్నారు
Mahesh Babu: గేమింగ్ రంగంలోకి మహేశ్ బాబు.. షార్ట్ గన్ గేమ్స్‌లో పెట్టుబడి!
Sundar C: నిజాలు తెలుసుకోకుండా.. వార్తలు రాయడం బాధిస్తుంది