సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

క‌ల్లోలం న‌డుమ.. 'మణిహారం' బూంగ్‌

ABN, Publish Date - Mar 02 , 2026 | 09:18 AM

నిరంత‌ర‌ కల్లోలం, అగమ్యంగా మారిన పిల్లల భవిష్యత్తును తెరపై చూపుతూ తెరకెక్కిన మణిపురీ (Manipuri) చిత్రం ‘బూంగ్‌’.

Boong

బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థల్లో, అగ్రశ్రేణి దర్శకుల దగ్గర పని చేసిన అనుభవం లక్ష్మీప్రియాదేవి (Lakshmipriya Devi )ది. ప్రయత్నిస్తే పెద్ద స్టార్లు, నిర్మాతల నుంచి దర్శకురాలుగా అవకాశం పొందడం కష్టం కాదు. కానీ తను పుట్టిన నేలను సంక్షుభితం చేస్తున్న కల్లోలాన్ని, అగమ్యంగా మారిన పిల్లల భవిష్యత్తును తెరపై చూపాలనుకున్నారు. అలా తెరకెక్కిన మణిపురీ (Manipuri) చిత్రం ‘బూంగ్‌’ (Boong) బ్రిటిష్‌ అకాడమీ (బాఫ్టా) (BAFTA) పురస్కారాన్ని గెలుచుకున్న తొలి భారతీయ చిత్రంగా చరిత్రకెక్కింది.‘లక్ష్య’, ‘తలాష్‌’, ‘రంగ్‌ దే బసంతి’, ‘పీకె’ లాంటి లాంటి పలు చిత్రాలకు ఫస్ట్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా.. రాజ్‌కుమార్‌ హిరానీ, ఫర్హాన్‌ అక్తర్‌, మీరానాయర్‌ లాంటి దర్శకులు, ఆమిర్‌ఖాన్‌ తదితర స్టార్లతో కలిసి పని చేసినప్పటికీ వాణిజ్య చిత్రాలు తీయాలని తాను ఎప్పుడూ కోరుకోలేదంటారు లక్ష్మీప్రియా దేవి. రచనలు చేయడం ఆమెకు ఇష్టం. తన సృజనాత్మకతను ప్రదర్శించడానికి, మరింత పదును పెట్టుకోవడానికి బాలీవుడ్‌ను వేదికగా ఎంచుకున్నారు.

కొవిడ్‌తో బ్రేక్‌..

ఇరవయ్యేళ్ళ క్రితం బాలీవుడ్‌లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా అడుగుపెట్టిన లక్ష్మీప్రియ పలు చిత్రాలకు పని చేశారు. అయితే మణిపూర్‌లో తీవ్రమవుతున్న సంక్షోభం ఆమె ఆలోచనల్లో ఎప్పుడూ మెదులుతూ ఉండేది. ఆ క్రమంలోనే ఒక కథ రాసుకున్నారు. దానికి తనే దర్శకత్వం చేద్దామనుకున్నారు. ‘అది 2018. కొద్దికాలం మా నాన్న, అత్తయ్య సంరక్షణ చూసుకోవాల్సి వచ్చింది. కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నాను. ఆ సమయంలో ఆ కథకు మెరుగులు దిద్దాను. స్క్రిప్ట్‌ పూర్తయిపోయింది. కానీ అంతలోనే కొవిడ్‌ రావడంతో.. సినిమాకు బ్రేక్‌ పడింది. పరిస్థితులు చక్కబడ్డాక స్క్రిప్ట్‌ను నా స్నేహితుడు వికేష్‌ భూటానీకి పంపాను. మర్నాడు అతను ఫోన్‌ చేసి ‘ఈ సినిమాను నేను నిర్మించవచ్చా?’ అని అడిగారు.

ఆ తరువాత అతని ద్వారా మరికొందరు కూడా నిర్మాణంలో భాగస్వాములు కావడానికి ముందుకు వచ్చారు. అయితే దాన్ని మణిపురి భాషలో తీయాలనుకుంటున్నానని చెప్పినపుడు.. నా శ్రేయోభిలాషులు చాలామంది నిరుత్సాహపరిచారు. ‘బాలీవుడ్‌లో నువ్వు పని చేస్తున్నావు. మంచి పరిచయాలు ఉన్నాయి. హిందీలోనే తియ్యొచ్చు కదా!’ అన్నారు.‘నా కథలోని పాత్రలన్నీ మణిపూర్‌ ప్రాంతానివి. అవి అక్కడే ఉండాలి. ఆ భాషే మాట్లాడాలి. కాబట్టి మణిపురీలోనే తియ్యాలి’ అని చెప్పాను. దర్శకురాలిగా నా మొదటి సినిమా ‘బూంగ్‌’ అలా మొదలైంది’ అని చెప్పారు లక్ష్మీపియ.

అది కష్టం అనిపించింది..

చిన్న యూనిట్‌తో, 38 రోజుల్లో, తక్కువ ఖర్చుతో బూంగ్‌ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ‘ఈ సినిమా తీస్తున్నప్పుడు పిల్లలతో నటింపజెయ్యడం కష్టంగా అనిపించింది. కానీ నాకు నచ్చిన విషయం కూడా అదే. వారు స్వచ్ఛంగా, అమాయకంగా ఉంటారు. వాళ్ళ ప్రశ్నల్లో నిజాయితీ ఉంటుంది. వారు లేకపోతే ఈ సినిమా ఇంత బాగా వచ్చేది కాదు’ అంటారు లక్ష్మీప్రియ. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర బూంగ్‌ అనే చిన్న పిల్లాడిది. అతని తండ్రి ఉపాధి కోసం వేరే చోటుకు వెళ్తాడు. కొన్నేళ్ళు గడిచినా అతని జాడ ఆ కుటుంబానికి తెలియదు. భర్త ఏమయ్యాడోనని బూంగ్‌ తల్లి బాధపడుతూ ఉంటుంది. తండ్రిని వెతకడానికి బూంగ్‌, అతనికి సాయంగా ఒక స్నేహితుడు బయలుదేరుతారు. ఈ ప్రయాణంలో వారికి ఎదురైన అనుభవాలను మణిపూర్‌ కల్లోలం నేపథ్యంలో లక్ష్మీప్రియ ఆవిష్కరించారు. ‘బూంగ్‌’ సినిమా మన దేశంతోపాటు వివిధ దేశాల్లో పురస్కారాలు అందుకుంది.

2024లో ‘టొరంటో ఇంటర్నేషనల్‌ ఫిలిమ్‌ ఫెస్టివల్‌’లో విమర్శకులు బూంగ్‌ను అభినందనలతో ముంచెత్తారు. ఇటీవల ‘బ్రిటిష్‌ అకాడమీ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఆర్ట్‌ - (బాఫ్టా) 2026’ పురస్కారాన్ని ‘ఉత్తమ బాలల-కుటుంబ చిత్రం’ విభాగంలో ‘బూంగ్‌’ గెలుచుకుంది. ఒక భారతీయ చిత్రానికి ఈ పురస్కారం లభించడం ఇదే మొదటిసారి. ప్రధాని నరేంద్రమోదీ, ఎంతోమంది సినీ ప్రముఖులు ఈ చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. ‘ఈ అవార్డు నాకు మరువలేని మధురానుభూతి. చిన్న స్థాయిలో తీసిన ఈ సినిమాను ఇంత ఘనమైన గౌరవం దక్కడం సంతోషంగా ఉంది. నా మాతృభూమి మణిపూర్‌లో మళ్ళీ శాంతి నెలకొనాలని, మా సినిమాలో నటించిన బాలలతో పాటు మణిపూర్‌లోని పిల్లలందరూ సంతోషాన్ని తిరిగి పొందాలని, తమ కలలు నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాను’ అంటూ స్పందించింది. ఇక‌ లక్ష్మీప్రియ చిత్రం.. తమ ప్రాంతంలో శాంతి నెలకొనాలనే ఎందరో మణిపురి ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపం అని చెప్పొచ్చు.

అవే ఆసక్తిని పెంచాయి..

మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌లో పుట్టిన లక్ష్మీప్రియ.. ఆ ఈశాన్య రాష్ట్రం సామాజికంగా, రాజకీయంగా ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులను చూస్తూ పెరిగారు. ‘సుదీర్ఘమైన అనిశ్చితి, అశాంతి, మానవత్వానికి ఎదురవుతున్న సవాళ్ళు ప్రపంచాన్ని నేను చూసే తీరును ప్రభావితం చేశాయి. ఆలోచనాపరురాలుగా, రచయిత్రిగా నన్ను తీర్చిదిద్దాయి’ అని ఆమె చెబుతారు. పదేళ్ళ వయసులో ఆమె మకాం మణిపూర్‌ నుంచి ఢిల్లీలోని ఒక బోర్డింగ్‌ స్కూల్‌కు మారింది. అక్కడే గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాక... ముంబాయి చేరుకున్నారు. ‘మా తాతయ్య (అమ్మ తండ్రి) రాజవంశానికి చెందినవారయినప్పటికీ సామ్యవాది. అప్పట్లో మణిపూర్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో సినిమా థియేటర్లు పెద్దగా లేవు. తాతయ్య ఒక వ్యాన్‌లో ప్రొజెక్టర్‌ను తీసుకువెళ్ళి, వీధుల్లో దుప్పట్లు కట్టి సినిమాలు ప్రదర్శించేవారు. నేను చదువుకొనే సమయంలో విహెచ్ ఎఫ్‌ టేప్‌లు ఉండేవి. వాటిని నేను, నా ఫ్రెండ్స్‌ కలిసి చూసేవాళ్ళం. అలాగే మా బామ్మ ఎన్నో కథలు చెప్పేది. నాలో సినిమాలంటే ఆసక్తి పెరగడానికి ఇవన్నీ దోహదం చేశాయి’ అని గుర్తుచేసుకుంటారు లక్ష్మీప్రియ.

Updated Date - Mar 02 , 2026 | 09:54 AM