అల్లు శిరీష్ పెళ్ళికి ఆహ్వానం!
ABN, Publish Date - Feb 23 , 2026 | 01:12 PM
ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవికి తన వెడ్డింగ్ కార్డ్ అందించి ఆశీస్సులు పొందిన అల్లు శిరీష్, తాజాగా తల్లిదండ్రులతో కలిసి చిన మావయ్యలు నాగబాబు, పవన్ కళ్యాణ్‌కు శుభలేఖలు అందించాడు.
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) చిన్న కుమారుడు అల్లు శిరీష్ (Allu Sirish) ఇప్పుడు క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఒకపక్క మార్చి 6న నయనిక (Nayanika) తో జరుగబోతున్న వివాహ వేడుక కార్యక్రమ ఏర్పాట్లతో బిజీగా ఉన్నాడు. మరో పక్క స్నేహితులకు, సన్నిహితులకు బ్యాచిలర్ పార్టీస్ ఇస్తున్నాడు. దీనితో పాటు తల్లిదండ్రులతో కలిసి బంధుమిత్రులను వివాహానికి స్వయంగా ఆహ్వానిస్తున్నాడు.
పెళ్ళి శుభలేఖల పంపిణీని పెద మావయ్య చిరంజీవితో అల్లు శిరీష్ ప్రారంభించాడు. ఆయన ఆశీస్సులు తీసుకున్న శిరీష్, తాజాగా చిన్న మావయ్యలు నాగబాబు, పవన్ కళ్యాణ్ దంపతులను తల్లిదండ్రులతో కలిసి వెళ్ళి వివాహానికి ఆహ్వానించాడు. దీనికి సంబంధించిన ఫోటోలను శిరీష్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. తన పెళ్ళి పట్ల మావయ్యలంతా చాలా హ్యాపీగా ఉన్నారంటూ శిరీష్ ఆ పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఇటీవల శిరీష్ పెళ్ళి సందర్భంగా అల్లు అర్జున్ (Allu Arjun) ఇచ్చిన గ్రాండ్ పార్టీకి రామ్ చరణ్, ఉపాసన దంపతులు హాజరైన విషయం తెలిసిందే!
పసుపు కొట్టేశారు...
హిందువుల పెళ్ళిలో కార్యక్రమాల నిర్వహణకు ముందు పసుపు కొట్టడం అనేది ప్రధాన ఘట్టం. అల్లు శిరీష్ వివాహానికి సంబంధించి పసుపు కొట్టడం పూర్తయ్యింది. ఈ కార్యక్రమానికి దగ్గర బంధువులంతా హాజరయ్యారు. వారంతా పసుపు దుస్తులు ధరించి మెరిపిపోయారు. ఈ మొత్తం వేడుకలో అల్లు శిరీష్ వదిన, అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి, వాళ్ళమ్మాయి అర్హా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.