తండ్రి జ్ఞాపకార్ధం అరవింద్ విరాళం
ABN , Publish Date - Jun 01 , 2026 | 09:42 AM
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తన తండ్రి అల్లు రామలింగయ్య పేరిట ఓ గదిని నిర్మించానికి ఆయన ఆల్ ఇండియా కాపు, తెలగ, బలిజ సంఘానికి విరాళం అందించారు.
ప్రముఖ హాస్యనటుడు, స్వర్గీయ అల్లు రామలింగయ్య (Allu Ramalingaiah) తన జీవిత కాలంలో ఎన్నో దానధర్మాలు చేశారు. హోమియోపతి వైద్యుడు కూడా అయిన అల్లు రామలింగయ్య పాలకొల్లులో ఆ కళాశాల నిర్మాణానికి సహకరించడంతో దానికి అప్పట్లో ఆయన పేరే పెట్టారు. ప్రస్తుతం ఆయన తనయుడు, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) సైతం తండ్రి బాటలో పలు సేవా కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్నారు.
తాజాగా అల్లు అరవింద్ హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ లోని ఆల్ ఇండియా కాపు, తెలగ, బలిజ సంఘం (AITKB Sangham)కు విరాళం అందించారు. తన తండ్రి అల్లు రామలింగయ్య పేరిట ఆ భవన సముదాయంలో ఓ గదిని నిర్మించడానికి రూ. 30 లక్షల రూపాయల విరాళం ఇచ్చారు. ఈ సంఘం విద్యార్థులను, నిరుపేదలను ఆదుకోవడానికి పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో బీద విద్యార్థుల నివాసానికి చోటు కల్పిస్తోంది. సమాజసేవలో నిమగ్నమైన తమ సంఘాన్ని గుర్తించి, అల్లు అరవింద్ సాయం చేయడం ఆనందంగా ఉందని, వారి సహకారానికి ధన్యవాదాలు తెలియచేస్తున్నామని సంఘం నాయకులు ఏవీ రత్నం, కోటేల శ్రీహరి, అరవ రామకృష్ణ, బైరా దిలీప్, చల్వాది రవి, విద్యాసాగర్, సుంకర వెంకటేశ్వరరావు, శివాజీ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
ఆ అవకాశం కోసం వేచి చూస్తున్నా.. పవన్‌పై బండ్ల గణేష్ పోస్ట్ వైరల్!
Nbk: బాలయ్య స్పీడ్ మాములుగా లేదుగా.. మరో డైరెక్టర్‌కి గ్రీన్ సిగ్నల్!
రానాతో కలిసి రామ్ చరణ్ చేసిన ఈ తుంటరి పనులు తెలుసా?