పృథ్వీ షాతో మళ్లీ కలిసిన ఆకృతి అగర్వాల్.. బ్రేకప్ తర్వాత కీలక నిర్ణయం
ABN, Publish Date - Oct 14 , 2026 | 06:33 AM
భారత క్రికెటర్ పృథ్వీ షా, నటి ఆకృతి అగర్వాల్ మళ్లీ ఒక్కటయ్యారు. నిశ్చితార్థం రద్దు తర్వాత తీసుకున్న నిర్ణయంపై ఆకృతి ఇన్స్టాగ్రామ్లో స్పందించారు.
భారత యువ క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw), నటి ఆకృతి అగర్వాల్ మళ్లీ ఒక్కటయ్యారు. కొన్ని వారాల కిందట నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్న ఈ జంట.. తాజాగా బంధాన్ని కొనసాగించాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని ఆకృతి (Akriti Agarwal) ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు.
సన్నిహితుల మాటలు విని తప్పుగా ఆలోచించానని, పృథ్వీతో నేరుగా మాట్లాడకుండా నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోవడం తన పొరపాటని అంగీకరించారు. తన నిర్ణయంతో అతడికి కలిగిన బాధకు బాధ్యత వహిస్తున్నట్లు ఆమె రాసుకొచ్చారు.
‘‘ఇటీవల ఇద్దరం మాట్లాడుకున్నాం. పరస్పరం అర్థం చేసుకున్న తర్వాత మళ్లీ కలవాలని నిర్ణయించుకున్నాం. మా వ్యక్తిగత జీవితాన్ని గౌరవించండి. మా నిర్ణయంపై ఊహాగానాలు ప్రచారం చేయొద్దు’’ అని ఆకృతి అభిమానులను కోరింది. పృథ్వీ షా సైతం ఆకృతి పోస్టును షేర్ చేశాడు.
టాలీవుడ్ నటి ఆకృతి అగర్వాల్తో మార్చి 8న పృథ్వీ షా ఎంగేజ్మెంట్ (Prithvi Shaw Engagement) జరిగింది. అయితే భవిష్యత్తు లక్ష్యాలు ఇద్దరివీ వేరువేరుగా ఉన్నాయని చెబుతూ తాము విడిపోతున్నట్లు ఆకృతి సెప్టెంబరులో ప్రకటించిన విషయం తెలిసిందే.