నటి రక్షిత: పీలింగ్స్, చోళీ కే పీఛే కనపడలేదా...
ABN, Publish Date - Mar 18 , 2026 | 10:20 AM
వివాదాస్పదమైన 'కె.డి.' పాట విషయంలో నటి రక్షిత తన భర్త, దర్శకుడు ప్రేమ్‌ను వెనకేసుకు వచ్చింది. గతంలో వచ్చిన ఇలాంటి పాటలను విమర్శించని వారు ఇప్పుడీ పాటను తప్పుపట్టడాన్ని ఆమె ప్రశ్నిస్తోంది.
కన్నడ నటి రక్షిత (Rakshita) గుర్తుంది కదా! రవితేజ (Raviteja) 'ఇడియట్' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత పలు విజయవంతమైన చిత్రాలలో నటించింది. ఆపైన కన్నడ దర్శకుడు ప్రేమ్ (Prem) ను వివాహం చేసుకుని నటనకు స్వస్తి పలికి, నిర్మాతగా కొన్ని చిత్రాలు ప్రొడ్యూస్ చేసింది. ఆమె భర్త ప్రేమ్ తెరకెక్కించిన తాజా చిత్రం 'కెడి: ద డెవిల్' (K.D. The Devil) సినిమాలోని ఐటమ్ సాంగ్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఆ పాట చిత్రీకరణ, అందులో ఉపయోగించిన పదాలపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ వివాదం ముదిరి పాకాన పడటంతో చిత్ర నిర్మాణం సంస్థ, మ్యూజిక్ కంపెనీ హిందీ పాటను యూట్యూబ్ నుండి తొలగించాయి. కేంద్రం సెన్సార్ బోర్డ్ ను ఆ పాట తొలగించమని చెప్పడంతో, నిర్మాతలు వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకున్నారని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే... దర్శకుడు ప్రేమ్ భార్య, ఒకప్పటి నటి రక్షిత ఈ విషయంలో తన భర్తను వెనకేసుకుని వచ్చింది. 'కెడి: ది డెవిల్' సినిమాలోని ఐటమ్ సాంగ్‌ను తాను సమర్థించడం లేదని చెబుతూనే, కొందరు వ్యక్తిగతంగా తన భర్తను దూషించడాన్ని ఆమె తప్పుపట్టింది. 'గతంలో 'పీలింగ్స్, చోళీ కే పీఛే' వంటి పదాలను ఉపయోగిస్తూ ఎన్నో పాటలు వచ్చాయని, అప్పుడు విమర్శించని వారు ఇప్పుడు ఎందుకు విమర్శిస్తున్నారో అర్థం కావడం లేద'ని వాపోయింది. తమ పాటను మాత్రమే తప్పుపట్టడం వివక్ష కిందకే వస్తుందని ఆమె ఆ పోస్ట్‌లో తెలిపింది. ఒక్క పాట సరిగా లేనంత మాత్రం ఎవరూ చెడ్డ రచయిత అయిపోరని, ఒక్క సినిమా ఆడనంత మాత్రాన చెడ్డ దర్శకులు అయిపోరని తన భర్త ప్రేమ్‌ను రక్షిత సమర్థించింది. రాబోయే రోజుల్లో అంతా సర్దుకుంటుందనే నమ్మకం తనకుందని, ప్రస్తుతం తమకు మద్దతు పలికిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని రక్షిత ఆ పోస్ట్‌లో పేర్కొంది. కె.వి.ఎన్. ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన 'కేడి: ద డెవిల్' మూవీ ఏప్రిల్ 30న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.