చెన్నై లవ్ స్టోరి.. సినిమా చూస్తూ వ్యక్తి మృతి
ABN, Publish Date - Jul 26 , 2026 | 07:34 AM
కూకట్‌పల్లి అర్జున్ థియేటర్‌లో 'చెన్నై లవ్ స్టోరీ' సినిమా చూస్తుండగా కార్మికుడు డొక్కా కృష్ణ అస్వస్థతకు గురై మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఓ కార్మికుడు మృతిచెందిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. పోలీసులు, థియేటర్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ కు చెందిన డొక్కా కృష్ణ(35) (Krishna) కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ (Kukatpally Housing Board Colony) సమీపంలో నివాసం ఉంటూ రోజు కూలీగా పనిచేస్తున్నాడు. శనివారం మరో స్నేహితుడితో కలిసి అర్జున్ థియేటర్ (Arjun Theatre)లో చెన్నై లవ్ స్టోరి (Chennai Love Story) సినిమా ఉదయం 11గంటల షోకు వెళ్లాడు. ఇంటర్వెల్‌లోనూ బయటకు వచ్చి మళ్లీ వెళ్లి సినిమా చూశాడు.
అయితే.. సినిమా అయిపోయిన తర్వాత చూడగా కృష్ణ సీట్లో కిందకు జారిపోయి ఉన్నాడు. స్నేహితుడు లేపేందుకు యత్నించినా కృష్ణలో ఎటువంటి స్పందన లేదు. దీంతో వెంటనే థియేటర్ నిర్వాహకులకు సమాచారం ఇచ్చాడు. వారు వెంటనే 108కు, పోలీసులకు సమాచారం అందించారు. 108 సిబ్బంది వచ్చి సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు. ఈ మేరకు కృష్ణ కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అస్స త్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.