బాక్సాఫీస్ గెట్ రెడీ...
ABN, Publish Date - Jul 27 , 2026 | 01:59 PM
ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మరో మార్వెల్ తుఫాన్ మొదలవబోతోంది.
ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మరో మార్వెల్ తుఫాన్ మొదలవబోతోంది. స్పైడీ ఫ్యాన్స్ అత్యంత ఆత్రుతగా ఎదురుచూస్తున్న స్పైడర్-మేన్: బ్రాండ్ న్యూ డే (Spider-Man: Brand New Day) ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్‌తో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేయడానికి సిద్ధమైంది. డాక్టర్ స్ట్రేంజ్ మంత్రంతో తన అస్తిత్వాన్ని కోల్పోయి, ప్రపంచంలో ఒంటరిగా మిగిలిపోయిన పీటర్ పార్కర్ కథ... ఇప్పుడు ఎలాంటి అనూహ్య మలుపు తిరగబోతోంది..? ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో పీటర్ జీవితంలోకి హల్క్ ( Hulk) ఎలా అడుగుపెట్టాడు..? దాదాపు రూ. 1,800 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం... గతంలో 'నో వే హోమ్' సాధించిన రూ. 15,900 కోట్ల ఆల్‌టైమ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయగలదా..? హల్క్ ఎంట్రీ ఈ సినిమాకు ఎంత వరకు ప్లస్ కానుంది..?
ముందుగా ఈ సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. సోనీ పిక్చర్స్, మార్వెల్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాయి. ఈ సినిమా కోసం దాదాపు 200 మిలియన్ డాలర్ల నుండి 220 మిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు సమాచారం. మన భారతీయ కరెన్సీలో చెప్పాలంటే ఇది సుమారుగా ₹1,650 కోట్ల నుండి ₹1,800 కోట్లు. గతంలో వచ్చిన నో వే హోమ్ సినిమా కూడా దాదాపు ఇదే బడ్జెట్‌తో రూపుదిద్దుకుంది. భారీ విజువల్ ఎఫెక్ట్స్, మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీన్స్ కోసం నిర్మాతలు ఏమాత్రం రాజీ పడకుండా ఖర్చు చేశారు. ఇక ఈ సినిమాలో మెయిన్ అట్రాక్షన్.. అవెంజర్స్ టీమ్‌లోని దిగ్గజ సూపర్ హీరో హల్క్ ఎంట్రీ. నో వే హోమ్ ముగింపు తర్వాత ప్రపంచంలో ఎవరికీ పీటర్ పార్కర్ ఎవరో తెలియదు. ఒంటరిగా మారిన పీటర్ జీవితంలోకి బ్రూస్ బేనర్ ఎలా వచ్చాడు అనేది చాలా ఇంట్రస్టింగ్ పాయింట్. బ్రూస్ బేనర్ తన సైన్స్ నాలెడ్జ్‌తో పీటర్ పార్కర్‌కు కొత్త సూట్ లేదా కొత్త టెక్నాలజీ డిజైన్ చేయడంలో హెల్ప్ చేస్తాడనే ప్రచారం సాగుతోంది.
న్యూయార్క్ నగర వీధుల్లో స్పైడర్‌మేన్ స్పీడ్, హల్క్ పవర్ కలసి విలన్లపై దాడి చేసే సీన్స్ థియేటర్లలో నెక్ట్స్ లెవెల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వనున్నాయి. 'నో వే హోమ్' లో ముగ్గురు స్పైడర్‌మేన్‌లు ఉంటే.. ఇందులో స్పైడర్‌మేన్ + హల్క్ కలయిక అవెంజర్స్ రేంజ్ క్రేజ్‌ను తీసుకొస్తోంది. ఇది మల్టీ-స్టారర్ ఫీలింగ్‌ను ఇస్తూ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడంలో దాదాపు 30% నుండి 40% అదనపు హెల్ప్ చేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక 2021లో వచ్చిన స్పైడర్-మేన్: నో వే హోమ్ ప్రపంచవ్యాప్తంగా రూ. 15,900 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది. ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా తొలి వీకెండ్‌లోనే దాదాపు ₹4,500 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని టాక్.
భారతదేశంలో కూడా తొలిరోజే ₹50 - ₹60 కోట్ల గ్రాస్ వసూళ్లతో గ్రాండ్ ఓపెనింగ్ ఖాయంగా కనిపిస్తోంది. అయితే నో వే హోమ్ చిత్రంలో తోబీ మాగ్వైర్, ఆండ్రూ గార్‌ఫీల్డ్ పాత్రల వల్ల నోస్టాల్జియా ఫ్యాక్టర్ ప్లస్ అయ్యింది. ఇక్కడ హల్క్, పనిషర్, స్కార్పియన్ లాంటి పవర్ ఫుల్ క్యారెక్టర్లు ఉన్నప్పటికీ.. కంటెంట్, థియేటర్లలో టాక్ చాలా బలంగా ఉంటే తప్ప ఆ రూ. 15,900 కోట్ల ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేయడం సాధ్యపడదు. మొత్తంగా చూస్తే ఈ సినిమా చాలా సులభంగా ప్రపంచవ్యాప్తంగా ₹12,500 కోట్ల మార్కును రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. హల్క్ కాంబో వర్కవుట్ అయి థియేటర్లలో పాజిటివ్ టాక్ వస్తే మాత్రం పాత రికార్డులన్నీ తిరగరాయడం ఖాయం!