హాలీవుడ్‌ను వీడుతున్న 'ఆస్కార్'! భారీ మార్పులు, చేర్పులు
ABN, Publish Date - Mar 30 , 2026 | 07:24 AM
ప్రపంచంలోని పలు దేశాల చిత్ర ప్రముఖులు, ప్రేక్షకులు ఆస్కార్ (Oscars) అవార్డులను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుంటారు.
ప్రపంచంలోని పలు దేశాల చిత్ర ప్రముఖులు, ప్రేక్షకులు ఆస్కార్ (Oscars) అవార్డులను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుంటారు. వీటి పేరు చెప్పగానే హాలీవుడ్ (Hollywood) లోని డాల్బీ థియేటర్ వెంటనే గుర్తుకు వస్తుంది. దాదాపు పాతికేళ్ల నుంచి ఆస్కార్ అవార్డులకు ఆతిధ్యం ఇస్తున్న ఈ వేదిక మరో రెండేళ్ల తర్వాత ఆ వైభవానికీ, ప్రాభవానికీ దూరం కానుంది.
ఇకపై లాస్ ఏంజెల్స్ (Los Angeles) లోని పీకాక్ థియేటర్ (Peacock Theater) లో 2029 నుంచి పదేళ్ల పాటు ఆస్కార్ వేడుకలను నిర్వహిస్తారు. ఈ మేరకు ది అకాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఇటీవల ఓ ప్రకటన విడుదల చేసింది. ఆస్కార్ శత వసంతాల వేడుకను ఆఖరిసారిగా డాల్బీ థియేటర్‌లో 2028లో నిర్వహించి, దశబ్దాలుగా ఆతిధ్యం ఇస్తున్న ఈ థియేటర్‌కు వీడ్కోలు పలుకుతామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
మరో విషయం ఏమిటంటే డాల్బీ థియేటర్ సీటింగ్ సామర్థ్యం 3,400. కానీ పీకాక్ థియేటర్‌లో దానికి రెండింతల మంది కూర్చునే సదుపాయం ఉంది. అకాడెమీ సభ్యుల సంఖ్య ఇప్పుడు పదకొండు వేలకు చేరుకుంది కనుక పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా థియేటర్‌ను మార్చాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ వేదిక మారడం వల్ల ఆస్కార్ వేడుకలు కొత్త రూపును సంతరించుకుంటాయనే భావన వినిపిస్తోంది. ప్రస్తుత డాల్బీ థియేటర్‌కు 15 కిలోమీటర్ల దూరంలో ఉందీ కొత్త వేదిక. అయితే ఆస్కార్స్ ప్రక్రియ ‘పీకాక్’కు మారేలోపు ఈ థియేటర్ పేరును కూడా మార్చే ఆలోచనలో ఉన్నారు నిర్వాహకులు.
ఐదు దశాబ్దాల డీల్‌కు బ్రేక్
ఆస్కార్ అవార్డుల వేడుకను ఇప్పటివరకూ ఏబీసీ ( ABC) ఛానల్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా టెలికాస్ట్ చేస్తున్నారు. దాదాపు ఐదు దశాబ్దాలుగా సాగుతున్న ఈ ప్రసార ఒప్పందానికి బ్రేక్ పడింది. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు నాలుగు కోట్ల మంది ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని లైవ్‌లో చూసేవారు. అయితే రానురానూ వీక్షకుల సంఖ్య సగానికి పైగా తగ్గింది. ఈ ఏడాది జరిగిన ఆస్కార్ అవార్డుల వేడుకలో ఈ సంఖ్య మరింత క్షీణించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా పూర్వ ఆదరణను తెచ్చుకోవడానికి యూట్యూబ్‌తో చేతులు కలిపింది కమిటీ. ఈ ప్రసార హక్కులను యూట్యూబ్ కైవసం చేసుకోవడంతో ఇకపై అంటే 2029 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు అధిక సంఖ్యలో ఈ వేడుకలను తిలకించే వీలు కలుగుతుంది.