The Odyssey: అవతార్’ను వెనక్కి నెట్టిన ‘ది ఒడిస్సీ’.. సరికొత్త రికార్డు
ABN , Publish Date - Aug 11 , 2026 | 12:36 PM
క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో వచ్చిన ‘ది ఒడిస్సీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లతో చరిత్ర సృష్టిస్తోంది.
క్రిస్టోఫర్ నోలన్ (Christopher Nolan) దర్శకత్వంలో వచ్చిన ‘ది ఒడిస్సీ’ (The Odyssey)సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లతో చరిత్ర సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధిస్తూ.. నోలన్ కెరీర్‌లోనే అత్యంత విజయవంతమైన చిత్రంగా నిలవడంతో పాటు IMAX చరిత్రలోనూ సరికొత్త రికార్డును సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా $1.1 బిలియన్ వసూళ్లు సాధించిన ‘ది ఒడిస్సీ’.. ఇప్పటివరకు నోలన్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన ‘ది డార్క్ నైట్ రైజెస్’ రికార్డును అధిగమించింది. చైనా, జపాన్ లాంటి భారీ మార్కెట్లలో ఇంకా విడుదల కాకముందే ఈ ఘనత సాధించడం విశేషం.
జేమ్స్ కేమరూన్ తెరకెక్కించిన ‘అవతార్’ ఇప్పటివరకు IMAX చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ‘అవతార్’ IMAX ద్వారా సుమారు $271 మిలియన్లు రాబట్టగా.. ‘ది ఒడిస్సీ’ ఇప్పటికే $289 మిలియన్లు వసూలు చేసి ఆ రికార్డును బద్దలు కొట్టింది. ఈ రికార్డు వెనుక నోలన్ సినిమాలకు ఉన్న ప్రత్యేకమైన థియేట్రికల్ క్రేజ్ కీలకంగా కనిపిస్తోంది. పెద్ద తెరపై, ముఖ్యంగా IMAXలో తన సినిమాలను చూడాలని ప్రేక్షకులు కోరుకునేలా నోలన్ చిత్రాలను రూపొందిస్తుంటారు. ‘ది ఒడిస్సీ’ను పూర్తిస్థాయిలో IMAX కెమెరాలతో చిత్రీకరించడం కూడా ఈ ఆసక్తిని మరింత పెంచింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న IMAX 70mm స్క్రీన్లలో సెప్టెంబర్ వరకు టికెట్లు ముందుగానే అమ్ముడవడం.. సినిమాకు ఉన్న డిమాండ్‌ను స్పష్టంగా తెలియజేస్తోంది. అమెరికా మార్కెట్‌లోనే IMAX వెర్షన్ $147.3 మిలియన్లు రాబట్టగా.. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మరో $141.8 మిలియన్లు వచ్చాయి. అంటే IMAX ఫార్మాట్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్లో పెరుగుతున్న ఆదరణను ఈ సినిమా మరోసారి నిరూపించింది. ఇక ఈ శుక్రవారం చైనాలో 800 ఐమాక్స్ స్క్రీన్లలో ‘ది ఒడిస్సీ’ విడుదల కానుంది. దీంతో చైనా మార్కెట్‌లోనూ భారీ వసూళ్లు సాధించి మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. జపాన్ మార్కెట్ కూడా ఇంకా మిగిలి ఉండటంతో.. సినిమా తుది వసూళ్లు మరింత భారీ స్థాయికి చేరే అవకాశం ఉంది.
‘ది ఒడిస్సీ’ విజయం కేవలం నోలన్ కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్ మాత్రమే కాదు. ఓటిటి స్ట్రీమింగ్ యుగంలోనూ బిగ్ స్క్రీన్ పై ప్రత్యేకమైన సినిమాటిక్ అనుభూతికి ప్రేక్షకులు ఎంత విలువ ఇస్తున్నారో ఈ సినిమా నిరూపించింది.