Shakira: షకీరా ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్.. తొలిసారి ప్రపంచవ్యాప్తంగా లైవ్ స్ట్రీమింగ్
ABN, Publish Date - Sep 29 , 2026 | 02:35 PM
పాప్ మ్యూజిక్ వరల్డ్ లో షకీరా గురించి తెలియని వారు ఉండరు. గాయనిగా మాత్రమే కాకుండా గేయ రచయిత, డ్యాన్సర్, నిర్మాత, కొరియోగ్రాఫర్‌గా ఆమె తన ప్రతిభను చాటుకున్నారు.
పాప్ మ్యూజిక్ వరల్డ్ లో షకీరా(Shakira) గురించి తెలియని వారు ఉండరు. గాయనిగా మాత్రమే కాకుండా గేయ రచయిత, డ్యాన్సర్, నిర్మాత, కొరియోగ్రాఫర్‌గా ఆమె తన ప్రతిభను చాటుకున్నారు. లాటిన్ సంగీతంతో పాటు అరబిక్ మ్యూజిక్, రాక్ అండ్ రోల్, బెల్లీ డ్యాన్స్ వంటి విభిన్న శైలులను తన సంగీతంలో మిళితం చేయడం ఆమె ప్రత్యేకత. ‘హిప్స్ డోంట్ లై’, ‘వెన్నెవర్, వేర్ ఎవర్’, ‘షీ వోల్ఫ్’, ‘వాకా వాకా’ (Waka Waka) వంటి పాటలతో ప్రపంచవ్యాప్తంగా భారీ అభిమానగణాన్ని సంపాదించుకున్నారు. 2010 ఫిఫా వరల్డ్ కప్ కోసం ఆమె ఆలపించిన ‘వాకా వాకా’ ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ స్పోర్ట్స్ ఈవెంట్స్ నుంచి పార్టీల వరకు ఈ పాట వినిపిస్తూనే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న పాప్ స్టార్ షకీరా..ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇవ్వబోతున్నారు. షకీరా లైవ్ పెర్ఫార్మెన్స్ కు ఉన్న క్రేజే వేరు. టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతాయి. అయితే ఈసారి ఆమె కన్సర్ట్ ను లైవ్ లో చూడాలంటే షో జరిగే ప్రాంతానికి వెళ్లాల్సిన అవసరం లేదు. తొలిసారి తన లైవ్ షోను ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ చేయబోతున్నారు. షకీరా ప్రస్తుతం స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో ప్రత్యేక రెసిడెన్సీ షోలు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 18న ప్రారంభమైన ఈ షెడ్యూల్ అక్టోబర్ 11 వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా అక్టోబర్ 3న మాడ్రిడ్‌లో జరిగే షోను ప్రపంచవ్యాప్తంగా అభిమానులు లైవ్‌లో వీక్షించే అవకాశం కల్పిస్తున్నారు. భారతీయ అభిమానులు అక్టోబర్ 4న అర్ధరాత్రి 12.15 గంటలకు ఈ షో చూడొచ్చు.
ఈ లైవ్ షోను అమెజాన్ మ్యూజిక్ ఇండియా యాప్, ప్రైమ్ వీడియో, ఫైర్ టీవీతో పాటు అమెజాన్ మ్యూజిక్ ఛానల్ ట్విచ్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ముఖ్యంగా ఈ లైవ్ స్ట్రీమింగ్ కోసం అభిమానులు ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. దీంతో షకీరా ఇండియా ఫ్యాన్స్ కూడా ఆమె గ్రాండ్ స్టేజ్ పెర్ఫార్మెన్స్‌ను ఇంటి నుంచే ఆస్వాదించే అవకాశం దక్కనుంది.