ఆస్కార్స్‌కు సర్వం సిద్ధం! ఎప్పుడు.. ఎలా చూడాలంటే! స్ట్రీమింగ్ డిటైల్స్
ABN, Publish Date - Mar 11 , 2026 | 09:25 AM
ప్రపంచ సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అతి పెద్ద వేడుక ‘ఆస్కార్స్ 2026’ (Oscars) 98వ అకాడమీ అవార్డ్స్ (Academy Awards) కు సర్వం సిద్ధమైంది.
ప్రపంచ సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అతి పెద్ద వేడుక ‘ఆస్కార్స్ 2026’ (Oscars) 98వ అకాడమీ అవార్డ్స్ (Academy Awards) కు సర్వం సిద్ధమైంది. 2025లో విడుదలైన ఉత్తమ చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు పురస్కారాలు అందించేందుకు లాస్ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అగ్రశ్రేణి హాలీవుడ్ తారలు, ప్రతిభావంతులైన దర్శకులు, నిర్మాతలు ఒకే వేదికపై సందడి చేయనున్నారు.
98వ అకాడమీ అవార్డ్స్ ఈనెల 15న (ఆదివారం) అమెరికా కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు లాస్ ఏంజెల్స్‌లోని ప్రఖ్యాత డాల్బీ థియేటర్‌లో అట్టహాసంగా జరగనున్నాయి. కాల వ్యత్యాసం కారణంగా భారతదేశంలో ఈ వేడుకలను మార్చి 16 (సోమవారం) వేకువ ఝామున 4:30 గంటల నుంచి వీక్షించవచ్చు. తారల తళుకులతో రెడ్ కార్పెట్ ఈవెంట్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత అవార్డుల ప్రదానోత్సవం మొదలవుతుంది. ప్రముఖ హాస్యనటుడు, టెలివిజన్ వ్యాఖ్యాత కోనన్ ఓబ్రియన్ వరుసగా రెండో ఏడాది కూడా ఈ వేడుకలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.
ఎక్కడ చూడొచ్చు
భారతీయ ప్రేక్షకులు ఆస్కార్స్ వేడుకలను డిజిటల్, టెలివిజన్ ప్లాట్‌ఫామ్‌లలో వీక్షించవచ్చు. స్టార్ మూవీస్‌లో ఉదయం 4:30 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఉదయం చూడలేని వారి కోసం అదే రోజు రాత్రి ఈ వేడుకను పునః ప్రసారం చేయనున్నారు. అలాగే జియో హాట్‌స్టార్ యాప్‌లోనూ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఈ ఏడాది ఆస్కార్ వేదికపై భారతీయ నటి ప్రియాంక చోప్రా కూడా ప్రెజెంటర్‌గా వ్యవహరించనున్నారు. రాబర్ట్ డౌనీ జూనియర్, అన్నే హాత్‌వే, గ్వినేత్ పాలిట్ర, పాల్ మెస్కల్ వంటి ప్రముఖ స్టార్స్‌తో కలసి ఆమె వేదికపై అవార్డులను ప్రదానం చేయనున్నారు.