Oscars 2027: ఆస్కార్ అవార్డులు.. కీలక మార్పులు..
ABN, Publish Date - May 02 , 2026 | 10:27 AM
ప్రపంచ సినిమా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ వేడుక రానున్న ఎడిషన్ కోసం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది
ప్రపంచ సినిమా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ వేడుక రానున్న ఎడిషన్ కోసం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది అకాడమీ(Oscars 2027) . వచ్చే ఏడాది అవార్డుల కోసం అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ యాక్టింగ్, ప్రపంచవ్యాప్తంగా సినిమాలు, సాంకేతిక విభాగాల్లో కీలక మార్పులు చేసింది. కొత్తగా తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం ఒక నటుడు ఒకే కేటగిరీలో రెండు వేరువేరు సినిమాలకు నామినేట్ అయ్యే అవకాశం ఉంది. నామినేట్ కావడానికి రెండు పాత్రలకు సరిపడినన్ని ఓట్లు వచ్చి ఉండాలి. పాత నిబంధనల ప్రకారం ఇప్పటి వరకూ నటీనటులు ఒక విభాగంలో ఒక సినిమాకు మాత్రమే నామినేట్ అయ్యే అవకాశం ఉండేది. దీనివల్ల ప్రతిభ ఉన్న నటులు ఒకే ఏడాది ఎన్ని చిత్రాల్లో గొప్ప నటన కనబర్చినా ఒకదానికే నామినేషన్ దక్కేది. అవార్డు వరించేది. ఇప్పుడు ఈ నిబంధనలు తొలగించి ఎన్ని సినిమాలకు అయినా నామినేట్ చేసుకునే అవకాశాన్ని అకాడమీ కల్పించింది.
ఇంటర్‌నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలోనూ మార్పులు తీసుకొచ్చింది. ఒక దేశం నుంచి ఇప్పుడు ఒకటి కంటే ఎక్కువ సినిమాలు నామినేషన్లకు అర్హత సాధించే అవకాశం ఉంది. నాన్ ఇంగ్లిష్ సినిమా సన్‌డాన్స్, కేన్స్, బెర్లిన్, బూసాన్, టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్‌లాంటి పేరున్న అంతర్జాతీయ చలనచిత్ర వేడుకల్లో పురస్కారాలు అందుకున్న సినిమాలు నేరుగా ఆస్కార్ బరిలో పోటీపడే అవకాశాన్ని కల్పించింది అకాడమీ. ఒకవేళ ఇంటర్‌నేషనల్ సినిమాను ఆ దేశానికి చెందిన సబ్‌మిషన్ కమిటీ సెలెక్ట్ చేయకపోయినా ఆస్కార్‌లో క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. అంతర్జాతీయ సినిమా కేటగీరీలో ట్రోఫీపై దేశం పేరుతో డైరెక్టర్ పేరును కూడా ముద్రించనున్నారు. ప్రభుత్వ ఆంక్షలు పట్టించుకోకుండా సినిమాలు తీసే జాఫర్ ఫనాహి వంటి మేకర్స్‌కు ఈ అవకాశం ఎంతో ఉపయోగపడుతుంది.
సినిమాల్లో ఏఐ వినియోగంపై సంచలన నిర్ణయం తీసుకుంది అకాడమీ. రచన, స్ర్కీన్‌ప్లే విభాగాల్లో రచయితలకే పనికే విలువనిస్తూ, వారు రాసిన కథలను మాత్రమే పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలిపింది. ఏఐ సహాయంతో రాసిన రచనలను అనుమతించేది లేదని వెల్లడించారు. నటనలో కూడా ఏఐతో క్రియేట్ చేసిన సన్నివేశాలను అంగీకరించబోమని స్పష్టం చేసింది. ఆర్టిస్ట్‌లు స్వయంగా చేసిన యాక్టింగ్‌కే అవార్డులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.