జాకీ చాన్ మృతి.. అసలు నిజమేంటి
ABN, Publish Date - Sep 29 , 2026 | 06:31 PM
మార్షల్ ఆర్ట్స్ లెజెండ్, ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న హాలీవుడ్ స్టార్ జాకీ చాన్ (Jackie Chan) మరణించారంటూ సోషల్ మీడియాలో వార్తలు విపరీతంగా ప్రచారమవుతున్నాయి.
మార్షల్ ఆర్ట్స్ లెజెండ్, ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న హాలీవుడ్ స్టార్ జాకీ చాన్ (Jackie Chan) మరణించారంటూ సోషల్ మీడియాలో వార్తలు విపరీతంగా ప్రచారమవుతున్నాయి. '1954–2026' అని రాసి ఉన్న ఆయన బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు, నివాళి అర్పించే పోస్టులు ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారడంతో అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కొద్దిసేపట్లోనే ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. జాకీ చాన్ కి ఏమైంది అంటూ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.
అయితే, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అది కేవలం ఒక ఫేక్ న్యూస్ అని ఫ్యాక్ట్ చెక్ నివేదికలు స్పష్టం చేశాయి. 72 ఏళ్ల జాకీ చాన్ పూర్తి ఆరోగ్యంతో, క్షేమంగా ఉన్నారని అధికారిక వర్గాలు ధృవీకరించాయి. ఎటువంటి ఆధారాలు లేకుండా కొందరు నెటిజన్లు సృష్టించిన ఈ తప్పుడు ప్రచారం నెట్టింట దావానలంలా వ్యాపించింది. ప్లాట్‌ఫామ్‌లలోని కమ్యూనిటీ నోట్స్ కూడా ఈ పోస్టులు అబద్ధమని ధృవీకరించి చెప్పడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.
సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, మార్ఫింగ్ ఫోటోలు ఎంత వేగంగా విస్తరిస్తాయో చెప్పడానికి ఈ సంఘటనే ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది. ఎలాంటి అధికారిక ప్రకటన లేదా విశ్వసనీయ మీడియా కథనాలు లేకుండానే లక్షలాది మంది నెటిజన్లు ఈ ఫేక్ పోస్టులను షేర్ చేస్తూ శ్రద్ధాంజలి ఘటించారు. అయితే ఇదేమి జాకీ చాన్‌పై వచ్చిన మొదటి డెత్ హోక్స్ కాదు గతంలో కూడా ఆయన గురించి అనేకసార్లు ఇలాంటి నిందారహిత రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి.
జాకీ చాన్ సురక్షితంగా ఉన్నారనే వార్త బయటకు రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఆయన ప్రస్తుతం తన రాబోయే సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి వార్తను బ్లైండ్‌గా నమ్మకూడదని, అధికారిక సమాచారం వచ్చేంతవరకు వేచి చూడాలని ఈ సంఘటన మరోసారి నిరూపించింది.