బాక్సాఫీస్‌పై.. మరో హాలీవుడ్ సినిమా దండయాత్ర!
ABN, Publish Date - Aug 19 , 2026 | 05:22 PM
గత కొంతకాలంగా ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై హాలీవుడ్ చిత్రాల జోరు మామూలుగా లేదు. ఇండియన్ స్ట్రెయిట్ చిత్రాలను తరహాలో కలెక్షన్లు కొల్లగొడుతున్న విషయం తెలిసిందే.
గత కొంతకాలంగా ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై హాలీవుడ్ చిత్రాల జోరు మామూలుగా లేదు. ఇండియన్ స్ట్రెయిట్ చిత్రాలను తరహాలో కలెక్షన్లు కొల్లగొడుతున్న విషయం తెలిసిందే. మన ఆడియన్స్‌కు హాలీవుడ్ మేకింగ్, అక్కడి విజువల్స్ విపరీతంగా నచ్చేస్తున్నాయి. ముఖ్యంగా హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ సినిమాలకైతే మన దగ్గర ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. భాషతో సంబంధం లేకుండా సీట్ ఎడ్జ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇచ్చే సినిమాలను మన ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటున్నారు. ఈ ఏడాది ఇప్పటికే విడుదలైన పలు హారర్ చిత్రాలు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ఇంపాక్ట్ స్పష్టంగా కనిపించింది.
'ది కంజూరింగ్: ది లాస్ట్ రైట్స్', అలానే 'ఈవిల్ డెడ్ బర్న్' లాంటి సినిమాలు థియేటర్లలో ప్రేక్షకులకు వెన్నులో వణుకు పుట్టించాయి. ఈ సినిమాలు కేవలం భయపెట్టడమే కాకుండా, థియేటర్లకు భారీగా జనాలను రప్పించి వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టించాయి. లోకల్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్స్ సైతం హౌస్‌ఫుల్ బోర్డులతో కళకళలాడాయి. ఇండియన్ సినిమా లవర్స్ ఇప్పుడు సరికొత్త హారర్ వరల్డ్‌ను ఎంతలా ఆస్వాదిస్తున్నారో ఈ కలెక్షన్లే నిరూపించాయి. ఇప్పుడు సరిగ్గా ఇదే బాటలో బాక్సాఫీస్‌పై దండయాత్ర చేసేందుకు మరో భయంకరమైన మూవీ సిద్ధమైంది. అదే ఇన్‌సీడియస్: అవుట్ ఆఫ్ ది ఫర్దర్ (Insidious: Out of the Further).
హారర్ సినిమా ప్రియులకు ఇన్‌సిడియస్ ఫ్రాంచైజ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దెయ్యాలు, ఆత్మలు తిరిగే ది ఫర్దర్ అనే డార్క్ డైమెన్షన్ కాన్సెప్ట్‌తో వచ్చిన మునుపటి భాగాలు ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా, మన ఇండియాలోనూ కల్ట్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాయి. జంప్ స్కేర్స్, మైండ్ బ్లోయింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో థియేటర్లలో కూర్చున్న ప్రేక్షకుడి గుండె వేగాన్ని పెంచడం ఈ ఫ్రాంచైజ్ స్పెషాలిటీ. ఇప్పటికే ఐదు భాగాలుగా వచ్చిన ఈ సినిమాలు ఒకదాన్ని మించి మరోటి సంచలన విజయాలను నమోదు చేశాయి. 2023లో వచ్చిన ఇన్సీడియస్ ది రెడ్ డోర్ (Insidious: The Red Door) చిత్రానికి సీక్వెల్‌గా ఇన్సీడియస్ ఫ్రాంచైజీలో 6వ సినిమాగా ఈ మూవీ తెరకెక్కింది. జాకబ్ చేస్ (Jacob Chase) దర్శకత్వం వహించగా సోనీ పిక్చర్స్ (Sony Pictures) ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తోంది. అమేలియా ఈవ్ (Amelia Eve), బ్రాండన్ పెరియా (Brandon Perea), మైసీ రిచర్డ్‌సన్-సెల్లర్స్ (Maisie Richardson-Sellers), లిన్ షే (Lin Shaye) వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటించారు
ఈ నేపథ్యంలో ఈ సూపర్ నాచురల్ హర్రర్ థ్రిల్లర్ మూవీ ఈ నెల 21న హాలీవుడ్‌తో పాటే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఇంగ్లీష్‌తో పాటు ప్రధాన భారతీయ భాషల్లోకి డబ్ చేసి భారీ స్థాయిలో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు, టీజర్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. తల్లీ కూతురు ఇద్దరే ఒంటరిగా ఓ ఇంట్లో నివసిస్తూ ఉండడం వారు అనుకోకుండా ఒక డార్క్, స్పిరిట్ వరల్ఢ్‌లో చిక్కుకు పోవడం అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేయడం, ఆపై ఆత్మలు వెంటాడడం, మరికొన్ని దుష్ట శక్తులు సైతం బయటకు వచ్చి భయానక ఘటనలు ఒళ్లు జలదరించేలా ఉన్నాయి. చూస్తుంటే హర్రర్ మూవీస్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సినిమా ఆ కోరిక తీర్చేలానే ఉంది.
అయితే.. గత చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రంలో చూపించబోయే ఆ డార్క్ ఎలిమెంట్స్ ఏంటి, ఎలాంటి కొత్త ట్విస్ట్‌లతో ఆడియన్స్‌ను భయ పెట్టబోతున్నారనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. హారర్ జానర్‌కు ఇండియాలో పెరుగుతున్న ఆదరణ చూస్తుంటే, 'ఇన్‌సిడియస్: అవుట్ ఆఫ్ ది ఫర్దర్' కూడా మొదటి రోజు నుంచే భారీ ఓపెనింగ్స్ రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఇప్పటివరకు ఉన్న బజ్‌ను క్యాష్ చేసుకుంటూ, ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో, ప్రేక్షకులను ఏ స్థాయిలో భయ పెడుతుందో చూడాలి.