Hayden Panettiere: 36 ఏళ్లకే ‘హీరోస్’ నటి హేడెన్ పానెటెర్ కన్నుమూత

ABN , Publish Date - Aug 17 , 2026 | 11:46 AM

హాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటి హేడెన్ పానెటెర్ (Hayden Panettiere) 36 ఏళ్ల వయసులో కన్నుమూశారు.

హాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటి హేడెన్ పానెటెర్ (Hayden Panettiere) 36 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ‘హీరోస్’, ‘నాష్‌విల్లె’ వంటి  టీవీ సిరీస్‌లతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె మరణవార్త అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది  హేడెన్  మరణ వార్తను ఆమె  ప్రతినిధి ధ్రువీకరించారు. ఆదివారం ఆమె మరణించినట్లు తెలిపారు. అయితే మరణానికి గల కారణాన్ని మాత్రం ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించలేదు. అనుమానాస్పద మృతిగా భావించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 21న ఆమె పుట్టిన రోజు. దానికి నాలుగు రోజుల ముందు ఈ విషాదం చోటు చేసుకుంది.

1989 ఆగస్టు 21న న్యూయార్క్‌లో జన్మించిన హేడెన్ చిన్న వయసులోనే నటనా రంగంలోకి అడుగుపెట్టారు. బాలనటిగా పలు టెలివిజన్ కార్యక్రమాలు, చిత్రాల్లో కనిపించిన ఆమెకు ‘హీరోస్’ సిరీస్‌ కెరీర్‌లో కీలక మలుపుగా నిలిచింది. ఇందులో క్లేర్ బెన్నెట్ పాత్రలో ఆమె నటన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.  ఆ తర్వాత ‘నాష్‌విల్లె’ సిరీస్‌లో జూలియట్ బార్న్స్ పాత్రతో మరోసారి తన సత్తా చాటారు. ‘రిమెంబర్ ది టైటాన్స్’, ‘స్క్రీమ్ 4’ తదితర చిత్రాల్లోనూ నటించి సినీ ప్రేక్షకులకు చేరువయ్యారు. నటనతో పాటు గాయనిగానూ ఆమె తన ప్రతిభను చాటుకున్నారు. ‘నాష్‌విల్లె’లో ఆమె పాడిన పాటలు కూడా మంచి ఆదరణ పొందాయి. 

ఈ ఏడాది హేడెన్‌ పానెటెర్‌ తన ఆత్మకథ ‘దిస్ ఈజ్ మీ: ఎ రెకనింగ్’ను విడుదల చేశారు. ఇందులో బాలనటిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత తాను ఎదుర్కొన్న వ్యక్తిగత, వృత్తిపరమైన సవాళ్లతో పాటు మానసిక ఒత్తిడి, వ్యసన సమస్యలు, జీవితంలో ఎదురైన ఒడిదుడుకుల గురించి ఆమె తన అనుభవాలను పంచుకున్నారు.  

 

Updated Date - Aug 17 , 2026 | 12:45 PM