The Odyssey: 3 వారాల్లోనే బిలియన్‌ డాలర్ల క్లబ్‌లోకి ‘ది ఒడిస్సీ’

ABN , Publish Date - Aug 08 , 2026 | 03:12 PM

హాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ క్రిస్టోఫర్‌ నోలన్ తెరకెక్కించిన విజువల్‌ వండర్‌ ‘ది ఒడిస్సీ’ బాక్సాఫీస్‌ వద్ద దూసుకుపోతోంది.

హాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ క్రిస్టోఫర్‌ నోలన్ (Christopher Nolan) తెరకెక్కించిన విజువల్‌ వండర్‌ ‘ది ఒడిస్సీ’ బాక్సాఫీస్‌ వద్ద దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నఈ ఫాంటసీ యాక్షన్‌ డ్రామా.. విడుదలైన కేవలం మూడు వారాల్లోనే 1 బిలియన్‌ డాలర్ల మార్క్‌ను అందుకుంది. భారత కరెన్సీ ప్రకారం రూ.9,500 కోట్లకు పైగానే! ఈ విజయంతో నోలన్‌ కెరీర్‌లో 1 బిలియన్‌ డాలర్లకు పైగా వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా ‘ది ఒడిస్సీ’ నిలిచింది. గతంలో ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘ది డార్క్‌ నైట్‌’, ‘ది డార్క్‌ నైట్‌ రైజెస్‌’ ఈ ఘనతను అందుకున్నాయి. ‘ఓపెన్‌హైమర్‌’ మాత్రం బిలియన్‌ డాలర్ల మార్క్‌కు చేరువగా వెళ్లి ఆగిపోయింది. ‘ది ఒడిస్సీ’ ఇదే జోరు కొనసాగిస్తే.. నోలన్‌ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మరోవైపు ఐమాక్స్‌ స్క్రీన్లలోనూ ‘ది ఒడిస్సీ’ ప్రభంజనం కొనసాగుతోంది. ఇప్పటివరకు ఐమాక్స్‌ నుంచి మాత్రమే సుమారు 257 మిలియన్‌ డాలర్ల వసూళ్లు వచ్చినట్లు తెలిసింది.  భారత కరెన్సీలో దాదాపు రూ.2,445 కోట్లు. దీంతో త్వరలోనే ఐమాక్స్‌ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా కూడా ‘ది ఒడిస్సీ’ నిలిచే అవకాశం ఉంది. 

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సినీ మార్కెట్‌ అయిన చైనాలో ఈ సినిమా ఇంకా విడుదల కావాల్సి ఉంది. అక్కడ సుమారు 800 ఐమాక్స్‌ స్క్రీన్లతో పాటు వేలాది సాధారణ థియేటర్లలో భారీగా రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. చైనాలో విడుదల తర్వాత ‘ది ఒడిస్సీ’ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉండటంతో.. నోలన్‌ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి!

Updated Date - Aug 08 , 2026 | 03:16 PM