Makutam Review: విశాల్ డైరెక్ట్ చేసిన మొదటి సినిమా ఎలా ఉందంటే..
ABN, Publish Date - Aug 14 , 2026 | 04:17 PM
కెరీర్ బిగినింగ్ నుంచి విశాల్ (Vishal) మంచి చిత్రాలే చేశారు. నటుడిగానూ, నిర్మాతగానూ అటు తమిళ, ఇటు తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించారు. ఆయన చిరకాల కోరిక డైరెక్షన్ చేయడం. ‘మకుటం’ చిత్రంతో ఆ కోరిక నెరవేరింది.
సినిమా రివ్యూ: 'మకుటం' (Makutam Review)
విడుదల తేది: 14-8-2026
కెరీర్ బిగినింగ్ నుంచి విశాల్ (Vishal) మంచి చిత్రాలే చేశారు. నటుడిగానూ, నిర్మాతగానూ అటు తమిళ, ఇటు తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించారు. ఆయన చిరకాల కోరిక డైరెక్షన్ చేయడం. ‘మకుటం’ (Makutam Review) చిత్రంతో ఆ కోరిక నెరవేరింది. తాజాగా ఆయన నటించి, దర్శకత్వం వహించిన చిత్రమిది. అంజలి, దుషారా విజయన్ నాయికలు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంస్థలో వచ్చిన 99వ చిత్రమిది. శుక్రవారం తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటివరకూ హీరోగా మెప్పించిన విశాల్.. దర్శకుడిగా సక్సెస్ అయ్యారా? లేదా అన్నది చూద్దాం.
కథ:
కృపాకర్ (విశాల్) ఓ కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్. ఇష్టపడిన అమ్మాయి జమున (దుషారా విజయన్)ను పెళ్లి చేసుకుని చాలీచాలని జీతంతో జీవితం గడిపేస్తుంటాడు. పెళ్లి చూపుల సమయంలో తన మామగారికి కారు ఉందని అబద్దం చెప్పడంతో దాన్ని నిజం చేయడానికి నానా తిప్పలు పడుతుంటాడు. అతని గోల పడలేక ఏదోలా తిప్పలు పడి సెకెండ్ హ్యాండ్ బీఎమ్డబ్య్లూ కారు కోనుగోలు చేసి భార్య పిల్లలతో సరదాగా ఊటీ ట్రిప్ వేస్తాడు. ఈ ప్రయాణంలో ఓ గ్యాంగ్ ఫాలో అయి ఎటాక్ చేస్తుంది. ఆ ఎటాక్లో భార్య, పాపను కోల్పోతాడు. ప్రాణాలతో బయటపడిన తన కొడుకును తీసుకుని కృపాకర్ పరుగులు తీస్తాడు. ఈ విషయం విశాఖపట్నం, అక్కడి పోర్టును తన గుప్పిట్లో పెట్టుకున్న లింగ (విశాల్)కు చేరుతుంది. గాయాలతో ఉన్న కొడుకును పరామర్శించేందుకు లింగ వచ్చినప్పుడు, కృపాకర్ ఆగ్రహంతో అతడిపై విరుచుకుపడతాడు. తన భార్య, పిల్లల మరణానికి లింగానే కారణమని నిందిస్తాడు. తండ్రీకొడుకులైన లింగ, కృపాకర్ మధ్య ఇంతటి దూరం ఎందుకు ఏర్పడింది? కృప కుటుంబంపై దాడి చేసింది ఎవరు? లింగ భార్య అన్నపూర్ణ (అంజలి) మరణానికి అసలు కారణమెవరు? ఈ సంఘటనలన్నింటి వెనుక దాగిన నిజం ఏమిటి?
విశ్లేషణ
యాక్షన్, కమర్షియల్ చిత్రాలతో గుర్తింపు పొందారు విశాల్. ఒకప్పుడు కమర్షియల్ చిత్రాల్లో కూడా కొత్త జానర్ కథలు తెచ్చి అలరించారు. అయితే కొన్నాళ్లుగా ఆయన రొటీన్ కథలనే ఎంచుకుంటూ సక్సెస్‌కు దూరమయ్యారు. ప్రస్తుతం ఆయన దర్శకుడిగా పరిచయమవుతూ ‘మకుటం’ చిత్రం తెరకెక్కించారు. కృపాకర్ లైఫ్‌తో కథను ప్రారంభించారు. అతని జీవితం ఎలా సాగుతుందనే కోణంలో చూపించారు. ఇంటర్‌వెల్‌కు ముందు ఓ ఎటాక్.. అక్కడి నుంచి కృపాకర్‌కు ఓ ప్లాష్‌బ్యాక్ ఉంది అనేది తెరపైకి తెచ్చారు. అక్కడి వరకూ రొటీన్గా ఉన్నా.. ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం సెకెండాఫ్‌లో ఏదో ఉందనే ఆసక్తి కలిగించింది. అక్కడి నుంచి తండ్రి లింగా పాత్ర తెరపైకి వస్తుంది. కొడుకు బాగు కోసం తండ్రి (లింగా పాత్ర) అందరికీ దూరంగా ఉంటూ.. జీవితాన్ని సాగిస్తాడు. అతని లక్ష్యం ఒక్కటే హార్బర్‌లోకి నకిలీ గూడ్స్ దిగకూడదు. చైనా నుంచి దిగుమతి అయ్యే డూప్లికేట్ స్పేర్‌పార్ట్స్‌ను ఆపడం, నకిలీ స్పేర్‌పార్ట్స్ వల్ల జరిగే ప్రమాదాలను తగ్గించడం అతని లక్ష్యం. దాని కోసమే పోర్టులో మార్టిన్‌తోపాటు పలువురు విదేశీయులతో పోరాటం చేస్తుంటాడు. తన కొడుకుకు ఆ మట్టి అంటకూడదని వారికి దూరంగా ఉంటాడు. సెకండాఫ్‌లో ఇదంతా చూపిస్తారు. ఇందులో ప్రతి సన్నివేశం ‘మిర్చి’ సినిమాను గుర్తు చేస్తుంది. అందులో కూడా కొడుకు గొడవలకు దూరంగా ప్రశాంతంగా ఉండాలని తండ్రి కోరుకుంటాడు. అయితే ఆ కథలో ఉన్న ఎమోషన్, బలం ఇందులో లేవు. లింగా, అంజలి పాత్రల్లో భావోద్వేగాలు ఉన్నా తెరపై సరిగా పండలేదనిపించింది. డెప్త్‌గా చూపించే సన్నివేశాలకు స్కోపున్న ఉపయోగించుకోలేకపోయారు. కొత్తదనం కరువైంది. క్లైమాక్స్ ఆడవాళ్లతో తీసిన ఫైట్ మాత్రం ఆకట్టుకునేలా ఉంది. ఆడవాళ్లంతా విలన్‌లను చేపల్ని కోసినట్లు కోసిపారేశారు. ఒకింత అది ఆసక్తిగా ఉంది. అంతకుమించి ఈ కథలో చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఈ కథ దర్శకుడిగా విశాల్‌కు సరైన ఎంపిక కాదనిపించింది.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు..
విశాల్ ఇందులో ద్విపాత్రాభినయం చేశారు. లింగ, కృపాకర్ అని తండ్రి కొడుకులుగా డిఫరెంట్ లుక్స్‌లో కనిపించారు. తండ్రి గెటప్, వాయిస్ విశాల్‌కు అసలు సూట్ కాలేదు. యంగ్ గెటప్ కాస్త ఫర్వాలేదనిపించింది. దుషారా విజయన్, అంజలి పాత్రలు ఓకే. జాన్ విజయ్, జయప్రకాశ్, మార్టిన్ పాత్రధారులు ఇలా ప్రతి ఒక్కరి నటనలో అతి కనిపిస్తుంది. కెమెరా వర్క్ ఫర్వాలేదు. వీఎఫ్ఎక్స్ విషయంలో అంతగా జాగ్రత్త తీసుకోలేదు. జీవీ ప్రకాష్ కుమార్ పాటలు, నేపథ్య సంగీతం బాదుడే బాదుడు. ఇది జీవీ సంగీతమేనా అనిపించక మానదు. యాక్షన్ కొరియోగ్రఫీ కొత్తగా ఉంది. పాటలు, డాన్స్ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. సూపర్‌గుడ్ ఫిల్మ్స్ నిర్మాణ విలువలు బావున్నాయి. సెకెండాఫ్ ఫైట్ సీన్స్‌ను కత్తిరించవచ్చు. ఇక దర్శకుడు విశాల్‌కు విషయానికొస్తే.. ఆయనకిది తొలి చిత్రం, పైగా ఆయనే హీరో. రెండు బాధ్యతలు తీసుకున్నప్పుడు ఒత్తిడి కూడా అలాగే ఉంటుంది. దర్శకుడిగా తొలి సినిమా కాబట్టి కాస్త కొత్త తరహా కథను ఎంచుకుంటే బావుండేది. కానీ ఇక్కడ ఆయన రొటీన్ ఫార్ములానే అప్లై చేశారు. కథ పాతది అయినప్పుడు ట్రీట్‌మెంట్ కొత్తగా ఉండాలి. పాత్రల్లో వైవిధ్యం చూపించాలి. ఆ జాగ్రత్తలేమీ తీసుకోలేదు. అదే సినిమాకు మైనస్ అయింది. హీరోగా పక్కనపెడితే దర్శకుడిగా విశాల్ ఫెయిల్ అయ్యారనే చెప్పాలి.
ట్యాగ్‌లైన్: కొత్తదనంలేని మకుటం
రేటింగ్: 2/5