సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Nagabandham Review: నాగ‌బంధం.. సినిమా రివ్యూ

ABN, Publish Date - Jul 03 , 2026 | 09:44 AM

ఎన్నో అంచ‌నాల న‌డుమ భారీ బ‌డ్జెట్ చిత్రం నాగ‌బంధం శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ఎదుట‌కు వ‌చ్చేసింది. సినిమా ఎలా ఉందంటే?

Nagabandham Review

Nagabandham Review: నాగ‌బంధం.. సినిమా రివ్యూ

టాలీవుడ్‌లో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని వ్యక్తి అభిషేక్ నామా (Abhishek Nama). డిస్ట్రిబ్యూటర్‌గా, నిర్మాతగా, దర్శకుడిగా పలు చిత్రాలను అందించారు అభిషేక్. నిర్మాతగా ‘గూఢచారి’, ‘ది కాశ్మీర్ ఫైల్స్’, దర్శకుడిగా ‘డెవిల్: ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ వంటి చిత్రాలను రూపొందించారు. ఇప్పుడు కొంత గ్యాప్ తర్వాత స్వీయ దర్శకత్వంలో ‘పెద్ద కాపు’ ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా అందించిన సినిమా ‘నాగబంధం’. విజువల్ ఎఫెక్ట్స్ తో కూడిన ఈ మ్యాజిస్టిక్ ఎడ్వంచర్ మూవీ శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చింది. విడుదలకు ముందు నుంచే మంచి బజ్ తెచ్చుకున్న ఈ మూవీ ఏ స్థాయిలో అలరిస్తుందో చూద్దాం.

కథ: 1960లో ఇద్దరు ఔత్సాహిక అర్కియాలజిస్టులు టెస్లా, అలీ (రిషబ్) హిమాలయాలలో సర్వే చేస్తుండగా అక్కడే కాలవృక్ష బంధనంలో బందీగా ఉన్న బైరాగి అనే తాంత్రికుడు అలీని వశ పరుచుకుంటాడు. అక్కడే నాగబంధం విముక్తికి సంబంధించిన ఓ పుస్తకం టెస్లాకి దొరుకుతుంది. అటు అలీని వశపరచుకున్న బైరాగి ప్రపంచాన్ని శాసించే శక్తులు అందించ గల బ్రహ్మ కమలాన్ని కనిపెట్టి తీసుకు రావాలని ఆదేశిస్తాడు. టెస్లా తనకు దొరికిన నాగంబంధం పుస్త‌కాన్ని ఆర్కియాలజీ శాస్త్రవేత్త ప్రభాకర్ (జగపతిబాబు)కు అందిస్తాడు. ఇదిలా ఉంటే అనాధ అయిన రుద్ర (విరాట్ కర్ణ) శ్రీరంగపురం సమీపంలో తనను చేరదీసిన కుటుంబంతో కలిసి ఓ గూడెంలో జీవిస్తుంటాడు. చెల్లి (సోనియాసింగ్) అంటే పంచ ప్రాణాలు. చెల్లి పెళ్లి నిమిత్తం రంగనాథ స్వామిని దర్శించుకునేందుకు శ్రీరంగపురం వెళ్లిన రుద్ర అక్కడ తొలి చూపులోనే పార్వతి (నభా నటేశ్)ని ప్రేమిస్తాడు.

అదే సమయంలో అక్కడి అలయంలోని బ్రహ్మ కమలం అపహరణకు గురవుతుంది. దానిని అగంతకులు తీసుకెళుతుండగా నాగ సర్పాలు వెంటపడి అడ్డుకుంటాయి. ఈ క్రమంలో బ్రహ్మ కమలం భైరవకోనలో ఉదృతంగా ప్రవహిస్తున్న నది మధ్యలో చిక్కుకు పోతుంది. దానిని సాధించాలనుకునే కొందరు వ్యక్తులు రుద్రకు డబ్బు అశ చూపి భైరవ కోనకు తీసుకెళ్లమంటారు. అక్కడ బ్రహ్మ కమలం దక్కించుకునే సమయంలో అది చేజారిపోతుంది. ఆ బ్రహ్మ కమలాన్ని కనిపెట్ట గలిగారా!? లేదా? అసలు దానిని ఆలయం నుంచి ఎవరు ఎందుకు తస్కరించారు, వారికి దానితో ఉన్న సంబంధమేంటి, ఆ కమలం వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటి? రుద్ర, అలీ గత జీవితానికి సంబంధం ఏమిటి? ఈ విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ: మరణాన్ని జయించడం కోసం మనిషి అడ్డదారులు తొక్కితే కాలమే అతనికి సమాధానం చెబుతుందనే కాన్సెప్ట్‌తో రూపొందింది ఈ సినిమా. మనం ఇప్పటివరకు చూసిన, తెలిసిన తరహా కథతోనే రూపొందిన మూవీ నాగబంధం అంటూ ప్రకటించిన నాటి నుంచే హ్యూజ్ బజ్ సొంతం చేసుకుంది. నభా నటేశ్, జగపతి బాబు, మహేశ్ మంజ్రేకర్, మురళీశర్మ, గరుడ రామ్, దక్ష నగర్కర్, శరణ్య, ఐశ్వర్యమీనన్ వంటి తారాగనణంతో భారీ బడ్జెట్, విజువల్స్, రంగనాథ స్వామి వంటి బ్యాగ్రౌండ్‌తో పాటు రిలీజ్‌కు ముందే జనాల్లోకి ఈ సినిమా బాగానే వెళ్లింది. అయితే.. సినిమా తొలి భాగం అంతా నాగబంధం పుస్తకం, బ్రహ్మ కమలం, రంగనాథ స్వామి అలయం చుట్టూ సినిమా నడుస్తుంది. పుస్తకం దొరకడం ఆపై దానికి అనుసంధానమైన బ్రహ్మ కమలం కోసం హీరో రుద్ర సాయంతో విలన్ గ్యాంగ్ వెంటబడడం ఈ క్రమంలో వచ్చే అడ్వెంచర్ యాక్షన్ సీన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, ట్విస్టులతో బాగానే ఎంగేజ్ చేస్తుంది. అయితే అనసూయ కుటుంబం ఎపిసోడ్ రోటీన్‌గా ఉంది. ఫ్రీ ఇంటర్వెల్ వరకు స్పీడుగా నడిచిన సినిమాకు ఆ టైమ్‌లో వచ్చే రొమాంటిక్‌ పాట, ఒకటి రెండు సీన్స్ స్పీడు బ్రేకులు వేస్తాయి. అయితే ఇంటర్వెల్‌కు ముందు వచ్చే భారీ యాక్షన్ సీన్స్ ట్విస్టు మూవీకి మంచి హైప్ ఇస్తాయి.

ఇక సెకండాఫ్ లో హీరో వాస్తవాలు తెలుసుకోవడం మొదలు పెట్టాక మరో కథ చూస్తున్నామా అనే ఫీల్ వస్తుంది. అప్పటి వరకు మంచి డెప్త్‌తో ట్రెజర్, నాగబంధం, బ్రహ్మ కమలం మిస్టరీ కలగలిపిన దైవత్వం అంటూ సాగిన స్టోరి ఆపై 17వ శతాబ్దంలోకి ఎంటరై రుద్ర, బైరాగీ, ముస్లిం రాజు చుట్టూ తిరుగుతూ చూసిన సన్నివేశాలు, పాత్రలు మళ్లీ చూస్తున్నామనే భావన కలుగుతుంది. ఫ్రీ క్లైమాక్స్ అంతా భారీ పోరాట సన్నివేశాలతో రొటీన్, రిపీట్ సీన్లతో నిండిపోతుంది. ఫస్టాప్ ఒకలా నడిచి సడన్‌గా హిందూ మతం, సనాతన ధర్మం.. నరకడాలు, చంపడాలతో కొత్త టర్న్ తీసుకోవడం కనెక్ట్ అయ్యేలా అనిపించదు. ఈ సన్నివేశాలు సైతం ఎక్కడా బలంగా హత్తుకునేలా లేవు. పైగా నాగ సాధువులతో కత్తులు పట్టించి, గొంతులవిసేలా అరిపిస్తూ, ముఖంలో వింత వింత ఎక్స్ప్రెషన్స్ పెట్టించి వారితో హత్యాకాండ నడిపించడం సహజత్వానికి చాలా దూరంగా వెళ్ళినట్లు అనిపిస్తుంది. సెకండాప్‌లో హిందూత్వంపై వచ్చే డైలాగులు బలవంతంగా చెప్పిస్తున్నట్లు ఉంది తప్ప ఫీల్ లేదు. సినిమా ముగింపులో తొలి షాట్ నుంచి అఖరి వరకు నాగబంధం తెరవాలంటూ స్టోరీ నడిపి చివరికి దాని వెనక కథ తెలుసుకోవాలంటే మరో పార్ట్ తీసే వరకు ఆగాల్సిందే అంటూ ముగించడం ప్రేక్షకుల్లో అసహనం కలుగజేస్తుంది..

నటీనటులు: ఈ సినిమా విషయంలో ఎక్కువగా చెప్పుకోవాల్సింది హీరో విరాట్ కర్ణ గురించే. రెండో చిత్రమే అయినా తన పాత్రకు సాధ్యమైనంత వరకూ న్యాయం చేశాడు. రుద్రగా, నాగ సాధువుగా సెట్ అయినప్పటికీ కొన్ని సీన్స్ లో ఎక్స్ ప్రెషన్స్ పలికించలేక పోయాడు. హీరోయిన్ నభా నటేశ్, విలన్ పాత్రదారి రిషభ్ సావ్నీ, జగపతి బాబు, గరుడ రామ్‌ల‌కు మంచి పాత్రలే పడ్డాయి. నభా పాత్ర ప్రేక్షకులకు కాస్త థ్రిల్ ఇస్తుంది. అలాగే బేబీ కైరా ఖన్నా తన పాత్రకు తగిన న్యాయం చేసింది. ఐశ్వర్య మీనన్, దక్ష నగార్కర్లు ఒకటి రెండు సన్నివేశాలకే పరిమిత మయ్యారు. సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే ఈ సినిమాను మోసింది వారే. ఈ మూవీకి సినిమాటో గ్రాఫర్ సౌందర్ రాజన్ ఫోటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైనర్ కమ్ ఆర్ట్ డైరెక్టర్ అశోక్ కుమార్, సంగీత దర్శకులు జునైద్, అభి ప్రధాన బలం అనడంలో అతిశయోక్తి లేదు. ఒకటి రెండు సీన్స్ లో మినహా విజువల్స్ ఆసాంతం మంచి హైప్ ఇచ్చాయి. అయితే కొన్ని సీన్లలో ఏఐని ఉపయోగించిన సంగతి అర్థం అవుతుంది. విజువల్ ఎఫెక్ట్ ని సమర్ధవంతంగా అందించిన అభిషేక్ నామా, దర్శకుడుగా మాత్రం తన పాత్రకు న్యాయం చేయలేక పోయాడు. నిర్మాతలు పెట్టిన ప్రతి పైసా స్క్రీన్ మీద కనిపిస్తుంది. తొలి సినిమా అయినప్పటికీ నిర్మాతలు ఖర్చుకు ఏమాత్రం వెనకడుగు వేయని విషయం స్పష్టం అవుతుంది. నిడివి మూడు గంటల 16 నిమిషాలు ఉండి సాగదీసినట్లు అనిపిస్తుంది. సినిమాను రెండున్నర గంటలకు కుదించి రిపీటెడ్ సీన్స్ లేకుండా చేసి ఉంటి అందరినీ ఆకట్టుకునేలా ఉండేది.

రేటింగ్: 2.5/5

ట్యాగ్: పట్టుతప్పిన ‘నాగబంధం’

Updated Date - Jul 03 , 2026 | 01:01 PM