సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

హింసాత్మక దేవదాసు.. డిసి విశ్లేషణ

ABN, Publish Date - Sep 20 , 2026 | 06:50 AM

భారతీయ సినిమా వందేళ్లుగా శరత్ 'దేవదాస్'ను రకరకాల వేషాల్లో చూపిస్తోంది. బారువా దేవదాస్, దిలీప్ దేవదాస్, అక్కినేని దేవదాసు, షారుక్ దేవదాస్, అనురాగ్ కశ్యప్ దేవ్ డి, అర్జున్ రెడ్డిలో అర్జున్.. ఇప్పుడు 'డిసి' లో దాస్.

DC MOVIE Review

భారతీయ సినిమా వందేళ్లుగా శరత్ 'దేవదాస్'ను రకరకాల వేషాల్లో చూపిస్తోంది. బారువా దేవదాస్, దిలీప్ దేవదాస్, అక్కినేని దేవదాసు, షారుక్ దేవదాస్, అనురాగ్ కశ్యప్ దేవ్ డి, అర్జున్ రెడ్డిలో అర్జున్.. ఇప్పుడు 'డిసి' లో దాస్. వీళ్లందరి మధ్య.. కాలం, ప్రాంతం, వర్గం, భాష మారాయి. కానీ లోపల ఒక గాయం మాత్రం ఒకరి నుంచి మరొకరికి వారసత్వంగా ప్రయాణిస్తూనే ఉంది. ఇప్పుడీ 'డిసి' (DC) కూడా ఒక దేవదాసు మరో వేషమే.

ఇది దేవదాసు అనుసరణ కాదు, వినిర్మాణం. రీమేక్ కాదు, రీ టెల్లింగ్. నివాళి కాదు, వాదన. 'డిసి'లో డి అంటే దాస్ అనీ, సి అంటే చంద్రముఖి అనీ సూటిగానే చెప్పాడు దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ (Arun Matheswaran). 'డిసి' దేవదాస్ చేతిలో గ్లాసుతో పాటు తుపాకీ ఉంటుంది. సినిమా చివరి షాట్ లో తుపాకీకి ఒక గులాబీని కూడా కలిపి ఎండ్ కార్డ్ వేశాడు దర్శకుడు. ఇక్కడ లోకేష్ కనగరాజ్ పోషించే దాస్ సంప్రదాయ దేవదాస్ కాదు. అతని ప్రపంచమే హింసాత్మకం. అతని ప్రేమ పూల తోటలో పుట్టదు. రక్తం, నేరం, మరణం మధ్య మొలుస్తుంది. శరత్ దేవదాసుకు జీవితం ఉంది. ప్రేమను కాపాడుకోలేకపోయాడు.

‘డిసి' దాస్ కు జీవితం అనేదే సవ్యంగా లేదు. ప్రేమ దొరికాక జీవితాన్ని కోరుకోవడం మొదలుపెడతాడు. ఇందులో దాస్, పార్వతి, చంద్ర పేర్లే మూలకథతో అంతర్గత భావాత్మక వంతెనను నిర్మిస్తాయి. కానీ వాటిని జిరాక్స్ చేయవు. ముఖ్యంగా చంద్రను కేవలం పతనమైన సున్నిత మనస్వి అనే పాత చంద్రముఖి రొడ్డకొట్టుడులో బంధించలేదు. ఇక్కడ ఇద్దరూ ఒకరి దగ్గరకు మరొకరు ఓదార్పు కోసం రావడం కన్నా... తమ గాయాలకు మరో గాయంలో పరిచయం దొరికినట్టు దగ్గరవుతారు. ఇక్కడ ప్రేమకు పవిత్రత అవసరం లేదు. అది ఆశ్రయం అయితే చాలు. ఈ దేవదాసు పార్వతిలోనూ చంద్రముఖిలోనూ తల్లిని చూసుకుంటాడు. పార్వతి, చంద్ర పాత్రలు దేవదాస్ జీవితంలోని రెండు ప్రేమ అధ్యాయాలు కావు. అతనిలోని రెండు భిన్నమైన మనుషులను బయటకు తీసే అద్దాలు.

పార్వతి అతనిలో ఇంకా మిగిలివున్న అమాయకత్వాన్నీ, సాధారణ జీవితం పట్ల ఆశనీ తాకితే.. చంద్ర అతని గాయాల తర్వాతి జీవితానికి తోడుగా నిలిచే మరో గాయం. అందుకే ఈ ఇద్దరు పాత్రధారుల నటనలో నాటకీయత కంటే చూపులు, మౌనాలు, శరీరభాష ఎక్కువ. ‘డిసి' ప్రేమలో ఓడిపోయిన దేవదాస్ కాదు. ప్రపంచంతో యుద్ధానికి దిగిన దేవదాస్. పార్వతి, చంద్ర పాత్రలు మూలంలోని పారో, చంద్రముఖి జ్ఞాపకాలను మోస్తాయి. కానీ ఇవి అవే పాత్రలు కావు. పార్వతి మరణం తర్వాత దాస్ చేసే హింస వేదనను బయటకు కన్నీరుగా కార్చేయడం. అతను మాటల్లో చెప్పలేని దుఃఖం.. శరీరం ద్వారా, తుపాకీ ద్వారా, రక్తం ద్వారా వ్యక్తమవుతుంది. అరుణ్ మాథేశ్వరన్ ప్రయత్నం మరో దేవ దాసు తీయడం కోసం కాదు. దేవదాసు అనే సాహిత్య విషాదాన్ని అత్యాధునిక సినిమాగా అనువాదం చేయడం.

అరుణ్ మాథేశ్వరన్ మొదటిసారి దేవదాసు అనే పురాణాన్ని గట్టిగా పెకిలించాడు. దాసు ఒక విషాద స్మృతి చిహ్నం కాదు. అనేక లోపాలున్న సమకాలీన పురుషుడు. పారో కూడా పాత పార్వతి కాదు. చంద్రా కూడా పాత చంద్రముఖి కాదు. లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ను నటుడిగా చూడటం మొదట కొంత ఇబ్బందిగానే ఉంటుంది. కానీ అదే కొంతసేపటికి పాత్రకు ఉపయోగపడుతుంది. అతనిలో మన సంప్రదాయ నాయకుడి జిలుగు లేదు. ఆ ముఖంలో కొంత అలసట ఉంది. శరీరభాషలో మొరటుదనం ఉంది. మాటల్లో ఒక నిర్లిప్తత ఉంది. దేవదాస్ కు అవే అవసరం. అతను ప్రేమలో కరిగిపోయే షారుక్ దేవదాస్ కాదు. మౌనంగా కాలిపోతున్న మనిషి. అందుకే అతని నటనలో కొన్ని పరిమితులు కనిపించినా.. అవే కొన్ని సందర్భాల్లో పాత్రకు అలంకారంగా మారతాయి. చంద్రగా వామికా గబ్బీ (Wamiqa Gabbi) అద్భుతం. అందం, నటన రెండూ రంగరించిన అమ్మాయి. సంజనా కృష్ణమూర్తి (Sanjana Krishnamoorthy ) పార్వతి పాత్రలో అద్భుతం కన్నా తక్కువేం చేయలేదు.

మరోవైపు సినిమాలోని తండ్రీకొడుకుల సంబంధం.. ప్రేమకథకు సమాంతరంగా నడిచే మరో భావోద్వేగపు లోపలి పొర. తండ్రి నుంచి కొడుకుకు సంక్రమించేది రక్తసంబంధం మాత్రమే కాదు.. హింసతో బతకాల్సి వచ్చిన ఒక తరం అనుభవం, దాని భయం, దాని "పశ్చాత్తాపం కూడా. తాను చిక్కుకున్న ప్రపంచంలోకి కొడుకు రాకూడదనే తండ్రి తపనలో ఒక విచిత్రమైన విముక్తి కోరిక ఉంది. కనుక తనకు దొరకని సాధారణ జీవితాన్ని తన తర్వాతి తరానికైనా అందించాలని కోరుకునే తండ్రి కథ కూడా. ప్రేమ మనిషిని మార్చగలదని పార్వతి, చంద్రల ద్వారా చెబితే.. ఆ మార్పునకు ఒక భవిష్యత్తు కావాలని తండ్రీ కొడుకుల బంధం ద్వారా సినిమా చెబుతుంది.

దేవదాసును మరోసారి చంపడం చాలా సులభం. కానీ వందేళ్లుగా చనిపోతూనే ఉన్న దేవదాసు ఈసారి బతకాలనే కోరిక పుట్టించడం 'డిసి' చేసిన అత్యంత ఆధునికమైన, అందమైన ప్రయోగం. మనకు బాగా తెలిసిన ఒక కథను గుర్తుపట్టలేనంతగా మార్చి, అయినా దాని లోపల ఎక్కడో 'దేవదాస్' గుండె చప్పుడు వినిపించేలా చేసినందుకు దర్శకుడిని మెచ్చుకోవాలి. పాత దేవదాస్ ప్రేమ దొరకలేదని చనిపోయాడు. ఈ దేవదాస్ కు మాత్రం ప్రేమ దొరికిన తర్వాత చావడానికి కారణం కాదు.. బతకడానికి కారణం దొరుకుతుంది. అక్కడే ఈ శరత్ చంద్రుడి దేవదాస్ నుంచి విడిపోయి, తనదైన సినిమాగా మిగులుతుంది.

- ప్రసేన్, 70133 58154

Updated Date - Sep 20 , 2026 | 07:03 AM