సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Jana Nayakudu: విజయ్‌ జన నాయకుడు రివ్యూ

ABN, Publish Date - Jul 23 , 2026 | 02:29 PM

తమిళనాడు ముఖ్యమంత్రి, దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయకుడు' జనం ముందుకొచ్చింది. బాలకృష్ణ 'భగవంత్ కేసరి' ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.

Jana Nayakudu Movie Review

దళపతి విజయ్‌ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగుపెడుతూ, తాను నటించబోతున్న చివరి సినిమా 'జన నాయగన్' అని ప్రకటించారు. హెచ్. వినోద్ దర్శకత్వంలో వెంకట కె. నారాయణ దీనిని నిర్మించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సిన 'జన నాయగన్' సెన్సార్ ఇక్కట్ల కారణంగా అనుకున్న సమయంలో రిలీజ్‌ కాలేదు. దాంతో తెర మీద కంటే నిజ జీవితంలోనే ముందుగా జన నాయగన్ అనిపించుకున్నారు విజయ్‌. ఆ రకంగా ఆయన తమిళనాడు ముఖ్యమంత్రి అయిపోయారు. ఈ లోగా రివైజింగ్‌ కమిటీకి వెళ్ళిన 'జన నాయగన్' సినిమా 'ఎ' సర్టిఫికెట్ పొంది... గురువారం జనం ముందుకు వచ్చింది. తెలుగులోనూ దీనిని 'జన నాయకుడు' పేరుతో డబ్ చేశారు. మరి ఈ 'జన నాయకుడు' ప్రేక్షకులను మెప్పించాడో లేదో తెలుసుకుందాం.


బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి' చిత్రం రీమేక్ గా 'జన నాయగన్' రూపుదిద్దుకుంటోందనే ప్రచారం మొదట్లో బాగా జరిగింది. ఆ సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి ఈ విషయంలో వ్యూహాత్మక మౌనం పాటించినా... 'జన నాయగన్'కు సంబంధించిన ప్రమోషనల్ వీడియోస్ వచ్చినప్పుడు అది వాస్తవమనే విషయం జనాలకు అర్థమైంది. అయితే.. 'భగవంత్ కేసరి'లోని కోర్ పాయింట్ ను తీసుకుని దర్శకుడు హెచ్. వినోద్ దానికి రాజకీయాంశాలను జత చేసి తయారు చేసిన కిచిడి ఈ 'జన నాయగన్'.

వెట్రి కొండన్ (విజయ్) గిరిజన గ్రామం నుంచి వచ్చిన పోలీస్‌ ఆఫీసర్. అవినీతి, అక్రమాలను చీల్చిచండాడే నిజాయితీ పరుడతను. అలాంటి పోలీస్ అధికారి కొందరి కుట్ర వల్ల జైలు పాలవుతాడు. జైలులో ఉండగానే ప్రతిపక్ష నాయకుడిపై జరిగిన దాడిని అడ్డుకుంటాడు. దాంతో జైలర్ (గౌతమ్ వాసుదేవ మీనన్)కు అతని పట్ల సానుభూతి కలుగుతుంది. తల్లిని చివరి చూపు చూడటానికి వెట్రికి అవకాశం ఇస్తాడు. యాక్సిడెంట్‌లో చనిపోయే ముందు జైలర్ తన కూతురు విజ్జీ (మమితా బైజు)ని ఆర్మీ ఆఫీసర్ చేయమని వెట్రీ చేతిలో పెట్టి కన్నుమూస్తాడు. చిన్నప్పుడే తల్లి మరణంతో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విజ్జీని వెట్రీ ఆర్మీ ఆఫీసర్ చేయగలిగాడా? నిజాయితీ పరుడైన వెట్రీ ఎందుకు జైలుకు వెళ్ళాల్సి వచ్చింది? అధికారం కోసం అర్రులు చాచిన రోజా రంగస్వామి (ప్రకాశ్‌ రాజ్‌), దుర్మార్గుడైన హెమ్లర్ (బాబీ డియోల్)తో కలిసి ఎలాంటి దారుణాలకు పాల్పడ్డాడు? దానిని వెట్రీ ఎలా ఎదుర్కొన్నాడు? ఆ క్రమంలో అతనికి రిపోర్టర్ కాయల్ (పూజా హెగ్డే) ఎలా సాయం చేసింది? చివరకు వీరు రావణ కాష్టంగా మారిన రాష్ట్రంలో ఎలా శాంతిని నెలకొల్పారు? అనేది ఈ సినిమా కథ.


'భగవంత్ కేసరి' లోని బ్యాడ్ టచ్ - గుడ్ టచ్, ఉమెన్ ఎంపవర్ మెంట్ వంటి కీలకాంశాలను తీసుకుని, ప్రస్తుతం విజయ్ కు ఉన్న ఇమేజ్ ను జత చేసి హెచ్. వినోద్ ఓ కొత్త కథను తయారు చేసుకున్నాడు. అందులో భాగంగా దేశాన్ని కులం, మతం, ప్రాంతం పేరుతో విడదీసి పబ్బం గడుపుకోవాలనే రాజకీయ నాయకులకు చురక అంటించే ప్రయత్నం చేశాడు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు విడుదల చేయాలనుకున్నారు కాబట్టి ఆ తరహాలోనే ఉత్తమ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోవాలనే సందేశాన్ని ఇవ్వాలనుకున్నారు. కానీ సినిమా విడుదల సమయానికి స్వయంగా చిత్ర కథానాయకుడు విజయ్‌ తమిళనాడు సీఎం అయిపోయారు. దాంతో ముందు అనుకున్న కొన్ని సన్నివేశాలను తొలగించి, మరికొన్ని కొత్తగా జత చేసి చివరి నిమిషంలో అతికించారు. ఆ విషయం తెలిసి పోతోంది. విజయ్‌ ఎలివేషన్ సీన్స్ కు, పొలిటికల్ సెటైర్స్ కు ఇందులో కొదవలేదు. అంతేకాదు... తమిళనాడులో మూడో పార్టీకి చెందిన ప్రకాశ్‌ రాజ్ తో ఈ రాష్ట్రంలో రెండు పార్టీలే అధికారాన్ని మార్చి మార్చి పొంది, మూడో పార్టీకి ప్రజలను దోచుకునే ఆస్కారమే ఇవ్వడం లేదని చెప్పించారు. చిత్రం ఏమంటే... ఇప్పుడు అలా మూడో పార్టీ నుంచి అధికారంలోకి వచ్చింది విజయే!

తమిళనాడులో ప్రస్తుతం విజయ్ సీఎంగా ఉన్నారు కాబ్టటి, ఆయన కోరుకున్న మార్పుకు ప్రజలు మద్దత్తు పలికారు కాబట్టి అక్కడి ప్రేక్షకులు ఈ సినిమాతో కొంత మేరకు కనెక్ట్ కావచ్చు. కానీ తెలుగువారికి మాత్రం ఈ సినిమా ఎక్కడం కష్టమే. మూడు గంటలకు పైగా ఉన్న నిడివి కూడా పెద్ద సమస్యే. క్లయిమాక్స్ యాక్షన్ పార్ట్ అయితే మరీ సాగదీసినట్టు అనిపిస్తుంది. ఇందులో అతిథి పాత్రలో చాలామందే కనిపించారు. సంగీత దర్శకుడు అనిరుధ్, శేఖర్ మాస్టర్, నిర్మాత వెంకట్ కె. నారాయణ ఓ పాటలో మెరియగా, సినిమా చివరిలో ప్రముఖ దర్శకులు నెల్సన్, అట్లీ, లోకేష్ కనగరాజు కనిపించారు. రోలింగ్‌ టైటిల్స్ తర్వాత విజయ్ నటించిన గత చిత్రాలు తాలూకూ క్లిప్స్ తెర మీద వేయడం అభిమానులను అలరిస్తుంది. ఇదే విజయ్‌ చివరి సినిమా అనే భావన దీనితో మరింతగా కలిగించింది. అలానే సినిమా ప్రారంభంలో విజయ్‌ పేరు పైన తమిళనాడు ముఖ్యమంత్రి, దళపతి అని వేయడం అభిమానులతో విజిల్స్ కొట్టించే అంశమే!


నటీనటుల విషయానికి వస్తే విజయ్‌ వెట్రీ పాత్రను చాలా సునాయాసంగా చేసేశాడు. పొలిటీషియన్ గా ఎంట్రీ ఇచ్చినా... అతని నుంచి అభిమానులు కోరుకునే డాన్సులు చేశాడు. అంతేకాదు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో మాస్ ను మెస్మరైజ్ చేసేలా నాన్ స్టాప్ గా స్టెప్స్ వేశాడు. పూజా హెగ్డే పాత్ర ఇక్కడ కాజల్ చేసిన పాత్రే. అలానే అరా కొరాగా ఉంది. తెలుగులో శ్రీలీల పాత్రను మమితా బైజు పోషించింది. శ్రీలీల పాత్రకు ఉన్నంత డెప్త్ మమితా బైజు పాత్రలో లేకపోయింది. ఈ అమ్మాయి హీరోయిన్ గా నటించిన 'విశ్వనాథ్‌ అండ్ సన్స్' మరో మూడు వారాల్లో రాబోతోంది. సో... మమితా బైజుకు ఇది బాగా కలిసొచ్చే అంశం. ఇతర ప్రధాన పాత్రలను ప్రకాశ్‌ రాజ్, బాబీ డియోల్, ప్రియమణి, సునీల్‌, రేవతి, గౌతమ్‌ వాసుదేవ మీనన్, నాజర్ తదితరులు పోషించారు. తెర మీద చాలామంది ప్రముఖులే ఉన్నా వారి పాత్రలను సరైన రీతిలో మలచలేదు. బాబీ డియోల్ ది కీలక పాత్రే అయినా.. దానికీ పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు.

అనిరుధ్‌ సమకూర్చిన ఏ పాటా జనాలను ఆకట్టుకునేలా లేదు. నేపథ్య సంగీతమూ రొటీన్ గా ఉంది. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌ విషయంలో మరింత జాగ్రత్త పడి నిడివి తగ్గించాల్సింది. 'ఖాకీ' లాంటి సినిమాను తీసిన హెచ్. వినోదే ఈ సినిమా తీశాడా అనే సందేహం కలుగుతుంది. పైగా విజయ్ చివరి సినిమా అంటే ఎంత జాగ్రత్త తీసుకోవాలి? అలాంటివేమీ ఇందులో కనిపించలేదు. థర్డ్ క్లాస్ మాస్ మూవీ తీసినట్టుగా ఉంది. ఏదేమైనా తమిళనాట ఇప్పటికే జన నాయకుడు అనిపించుకున్న విజయ్... వెండితెర మీద మాత్రం ఆ పాత్రలో ఆశించిన స్థాయిలో మెప్పించ లేకపోయాడు.

ట్యాగ్‌ లైన్: కిచిడీ నాయకుడు!

రేటింగ్ : 2.25/5

Updated Date - Jul 23 , 2026 | 03:01 PM