Vanaveera Movie Review: 'వనవీర' మూవీ రివ్యూ
ABN, Publish Date - Jan 01 , 2026 | 06:12 PM
అవినాశ్ తిరువీధుల హీరోగా నటించి డైరెక్ట్ చేసిన సినిమా 'వనవీర'. సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ సోషియో ఫాంటసీ మూవీలో శివాజీ రాజా, ఆమని, నందు, కోన వెంకట్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జనవరి 1న విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం...
డిసెంబర్ 25న విడుదల కావాల్సిన 'వానర' (Vanara) సినిమా సెన్సార్ సమస్యలతో 'వనవీర' (Vanaveera) గా పేరు మార్చుకుని జనవరి 1న జనం ముందుకొచ్చింది. సినిమా టైటిల్ మాత్రమే కాదు ధర్మం, కులం, రాజకీయం చుట్టూ కథ నడవడంతో పలు చోట్ల డైలాగ్స్ కు మ్యూట్ పడింది. విడుదలకు ముందు డిఫరెంట్ పబ్లిసిటీతో ఆకట్టుకున్న 'వనవీర' మూవీని డైరెక్టర్ కమ్ హీరో అవినాశ్ తిరువీధుల ఎలా తెరకెక్కించారో తెలుసుకుందాం.
గోదావరి ప్రాంతంలోని వానాపురం అనే గ్రామంలో నివసించే రఘు (అవినాశ్ తిరువీధుల) కు తన బైక్ అంటే ప్రాణం. అదే ఊరిలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్న దేవా (నందు) కు భయంకరమైన కులపిచ్చి. అతన్ని నిలబెడితే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తాడని భావించిన అధికార పార్టీ అతనికే సీటు ఇస్తుంది. పార్టీ ప్రచారంలో భాగంగా దేవా బైక్ ర్యాలీ నిర్వహించినప్పుడు అతని మనుషులు రఘు బైక్ ను తీసుకెళతారు. ఎన్ని రోజులైనా తిరిగి ఇవ్వరు. దాంతో తన బైక్ కోసం దేవా పార్టీ కార్యాలయానికి వెళ్ళిన రఘును అతని కులం కారణంగా అక్కడి వాళ్ళు అవమానిస్తారు. ఆ సమయంలో తనకు జరిగిన అవమానాన్ని దిగమింగుకున్న రఘు... ఆ తర్వాత టైమ్ చూసి దేవాకు ఎలా బుద్ధి చెప్పాడు? దేవా కుడిభుజంగా ఉండే బసవ (టార్జన్)ను అతనికి ప్రత్యర్థిగా ఎలా ఎన్నికల బరిలోకి దింపాడు? అసలు దేవా కు, రఘు కుటుంబానికి మధ్య ఉన్న వైరానికి కారణం ఏమిటీ? అనేది 'వనవీర' కథ.
నిజానికి ఈ స్టోరీలోనూ, దీని మేకింగ్ లోనూ ఎలాంటి కొత్తదనం లేదు. గ్రామాల్లో ఉండే కులవివక్ష నేపథ్యంలో ఎన్నో సినిమాలు ఇప్పటికే వచ్చాయి. ఇంకా వస్తున్నాయి. అలానే అగ్ర, నిమ్న వర్గాల మధ్య సాగే రాజకీయ పోరాటాలు, అందులో పావులుగా మారి హత్యకు గురయ్యే వ్యక్తుల కథలను ఎన్నో సార్లు తెర మీద చూశాం. బహుశా అందుకే కావచ్చు దర్శకుడు అవినాశ్ తిరువీధుల ఈ కథకు కాస్తంత పురాణ గాథను, హనుమంతుడి సహకారాన్ని తీసుకుని బడుగు, బలహీనుల పక్షాన వారు నమ్మిన దేవుడు ఉంటాడని చూపించాడు. హీరో... హనుమంతుని అంశ అనే భావన కలిగించేలా కథను రాసుకున్నా... ఆ యా సన్నివేశాల రూపకల్పన దానికి బలం చేకూర్చేలా లేదు. అయితే... ప్రథమార్ధంలోని హీరో చర్యలకు ద్వితీయార్థంలో జస్టిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం దర్శకుడు చేశాడు. అలానే క్లయిమాక్స్ లో ధర్మం గురించి నాలుగైదు మంచి మాటలూ చెప్పించారు.
నటీనటుల విషయానికి వస్తే అవినాశ్ తిరువీధుల (Avinash Thiruveedhula) నటుడిగా ఫర్వాలేదనిపిస్తాడు. కొన్ని చోట్ల డల్ గా కనిపించినా, చాలా సన్నివేశాలలో హుషారుగా ఉండటానికి ప్రయత్నించాడు. అతని తండ్రి పాత్రలో శివాజీ రాజా (Shivaji Raja) మెప్పించాడు. హీరోయిన్ సిమ్రాన్ చౌదరి (Simran Chowdary) బాగానే చేసింది. ఆమె తల్లిదండ్రులుగా నటించిన ఆమని (Aamani), దేవిప్రసాద్ (Devi Prasad) లను సరిగా ఉపయోగించుకోలేదు. వారి పాత్రలను బలంగా రాసుకోలేదు. నందు (Nandu) విలన్ గా మంచి మార్కులు తెచ్చుకోవడానికి ట్రై చేశాడు కానీ అతని స్థాయి ఈ పాత్రకు సరిపోలేదు. బసవగా టార్జన్, గురు గా శ్రీహర్ష బాగా చేశారు. ఇక అతిథి పాత్రలు కాని అతిథి పాత్రల్లో కోన వెంకట్ (Kona Venkat), 'ఖడ్గం' పృథ్వీ, జ్యోతిరెడ్డి, భద్రం, అప్పాజీ అంబరీష తదితరులు కనిపించారు. క్లయిమాక్స్ ముందు సత్య (Satya) స్పెషల్ ఎంట్రీతో థియేటర్లలో జోష్ నెలకొంది. వివేక్ సాగర్ (Vivek Sagar) నేపథ్య సంగీతం ఫర్వాలేదు. నిర్మాతలు అవినాశ్, అలపాటి రాజా, అంకిత్ రెడ్డి బాగానే ఖర్చు పెట్టారు. ఈ మధ్య కాలంలో ఏదో రకంగా దేవుడిని, ధర్మాన్ని కమర్షియల్ ఎలిమెంట్ గా సినిమాల్లో వాడుకోవడం ఎక్కువైంది. స్టోరీ డిమాండ్ చేయకుండా బలవంతంగా అలాంటి అంశాలను చొప్పిస్తే ఎలాంటి ఉపయోగం ఉండదు. మొన్న 'మోగ్లీ' విషయంలోనూ అదే జరిగింది. ఇప్పుడు అదే రిపీట్ అయ్యింది. ఏదేమైనా... దేవుడు, కులం వంటివి సినిమాలను ప్రతిసారీ గట్టెక్కించలేవని మరోసారి రుజువైంది.
రేటింగ్: 2 / 5
ట్యాగ్ లైన్: రక్షించని వానర!