సినిమా రివ్యూ: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు
ABN, Publish Date - Jun 19 , 2026 | 04:01 PM
వడ్డే నవీన్ కొంత గ్యాప్ తర్వాత 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు.రాశీ సింగ్ కథానాయిక. కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయమయ్యారు. ఇన్నాళ్ల తర్వాత తెరపై కనిపించిన వడ్డే నవీన్ ఈ ఇన్వెస్టిగేటివ్ డ్రామాతో మెప్పించారా? లేదా అన్నది చూద్దాం.
సినిమా రివ్యూ: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు
విడుదల తేది: 19-6-2026
వడ్డే నవీన్ ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్‌కు అభిమాన హీరో. కెరీర్ బిగినింగ్‌లో వరుస విజయాలతో ఆకట్టుకున్న ఆయన తదుపరి పరాజయాలను చవిచూశారు. దాంతోపాటు పలు కారణాల వల్ల సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. 2016లో రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘ఎటాక్’ చిత్రంలో చివరి సారిగా ఓ పాత్రను పోషించారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రాన్ని ఆయనే నిర్మించారు. రాశీ సింగ్ కథానాయిక. కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయమయ్యారు. ఇన్నాళ్ల తర్వాత తెరపై కనిపించిన వడ్డే నవీన్ ఈ ఇన్వెస్టిగేటివ్ డ్రామాతో మెప్పించారా? లేదా అన్నది చూద్దాం.
కథ:
త్రిమూర్తులు (వడ్డే నవీన్) నిజాయతీ గత కానిస్టేబుల్. భార్య లక్ష్మీ (రాశీ సింగ్). వాళ్ళకో పాప. ఇలా చిన్న కుటుంబం అతనిది. 10 ఏళ్ల సర్వీస్‌లో 55 సార్లు ట్రాన్స్‌ఫర్ అవుతాడు. అతని తండ్రి శ్రీనివాసులు కూడా నిజాయతీ గల పోలీస్. ఆయన బాటలోనే నీతి-నిజాయతీలతో ముందుకు సాగాలనుకుంటాడు. అలా అరకులోని ఓ పోలీస్ స్టేషన్‌కు ట్రాన్స్‌ఫర్ కాగా అక్కడ ఓ ప్రియమ్మ అనే యువతి మానభంగంకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్ కాపీ దొరుతుకుంది. దానిని ఫైల్ చేసింది త్రిమూర్తులు తండ్రే! అసలు 20 ఏళ్లగా ఆ కేసు పక్కన పడటానికి కారణం ఏంటి? దీని వెనకున్నది ఎవరు? ముఖ్యమంత్రి కమల (శిల్ప తులస్కర్)కు ఈ కేసుకు ఉన్న సంబంధం ఏంటి? అసలు ప్రియమ్మ బతికుందా లేదా? ఈ కేసును త్రిమూర్తులు ఎలా చేధించారు? అన్నది కథ.
విశ్లేషణ:
అన్యాయం జరిగిన ఓ గిరిజన యువతికి న్యాయం చేసే క్రమంలో ఓ పోలీసు కానిస్టేబుల్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి అన్నది ఈ సినిమా ఇతివృత్తం. బలవంతులు, రాజకీయ నేపథ్యం ఉన్నవారు బలహీనులైన వారి జీవితాలను నాశనం చేయడం ఎన్నోసార్లు తెరపై చూశాం. అలా ఓ బడాబాబు కోరికకు బలైపోయిన ఓ యువతి కథ ఇది. యువతి మానభంగంతో కథలోకి తీసుకెళ్లిన దర్శకుడు వెంటనే హీరో పరిచయం.. అతని నేపథ్యాన్ని సింపుల్‌గా చూపించాడు. ఫస్టాఫ్ అంతా రాజకీయ పార్టీల ప్రసంగాలు, ట్రాన్స్‌ఫర్లు అంటూ స్లోగా కథను నడిపించాడు. ప్రియమ్మ కేసు ఎఫ్‌ఐఆర్ బయటకు రావడంతో కథలో ఆసక్తి పెరుగుతుంది. అక్కడి నుంచి కథ ఇన్వెస్టిగేషన్ వైపు మళ్లుతుంది. దాంతో ఇంటర్వెల్. ఇదంతా కూడా రెగ్యులర్ సినిమా ఫార్మట్‌లోనే ఉంటుంది. ఇక సెకెండాఫ్ అంతా కేసు ఛేదించే క్రమంలో హీరో పలు చోట్లకి తిరగడంలాంటి సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నా స్లోగా ఉందని భావన కలుగుతుంది. అయితే ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ కాస్త బెటర్ అనిపిస్తుంది. ఇందులో కొత్తగా అనిపించిన విషయం ఒకటే. జనరల్‌గా రేప్ కేసును కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే బాధిత మహిళను ఎలా జరిగింది.. ఎన్నిసార్లు జరిగింది.. ఎంతమందితో జరిగింది అంటూ ప్రశ్నలతో వేధిస్తుంటారు. కానీ ఈ చిత్రంలో బాధిత గిరిజన యువతి బతికున్నా మరణించిందని ఫైల్ అయి ఉండడంతో ఆమెను బయటకు తీసుకురాకుండా కేసును పూర్తి చేస్తారు. అది మాత్రం ఉన్నంతలో కొత్తగా అనిపిస్తుంది.
నటీనటుల పనితీరు:
2010లో వచ్చిన ‘శ్రీమతి కల్యాణం’ చిత్రం తర్వాత వడ్డే నవీన్ హీరోగా నటించలేదు. 2016లో వచ్చిన 'ఎటాక్'లో గెస్ట్‌రోల్ చేశారంతే. దాదాపు 16 ఏళ్ల తర్వాత ఆయన పూర్తిస్థాయి హీరోగా కనిపించే ప్రయత్నం ఈ సినిమాలో చేశారు. అయితే 55 ఏళ్ళ వయసులో 30 ప్లస్‌లా కనిపించారు. కెరీర్ బిగినింగ్‌లో ఎలా హ్యాండ్సమ్‌లో ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. కానీ డాన్స్, ఫైట్స్‌లో తేలిపోయారు. అందువల్లే ఫైట్స్ విషయంలో ఎక్కువ ఇబ్బంది పడుకుండా అలా అలా కానిచ్చేశారు. ఎక్స్‌ప్రెషన్స్ విషయంలోనూ వీకే! లక్ష్మీ పాత్రలో రాశీ సింగ్ పర్ఫెక్ట్‌గా సూటయ్యారు. కూతురిగా బేబీ ఊహ అలరించింది. ముఖ్యమంత్రిగా విలన్ పాత్రలో శిల్ప తులస్కర్ ఫర్వాలేదనిపించారు. యువ నాయకుడు సంతోష్‌బాబు పాత్రధారి అంతగా సూట్ కాలేదు. రఘుబాబు, దేవీ ప్రసాద్, శివన్నారాయణ, వడ్లమాని శ్రీనివాసరావు తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగతా ఆర్టిస్టులు ఓకే. దర్శకుడు కమల్ తేజ రాత బావున్నా... తీత విషయంలో తడబడ్డాడు. సీన్లు పరంగా చూస్తే కొన్ని ఫర్వాలేదనిపించినా ఓవరాల్‌గా దర్శకుడిగా పూర్తి న్యాయం చేయలేకపోయాడు. నిర్మాణ విలువలు బావున్నాయి. సినిమాటోగ్రఫర్ వైజాగ్, అరకు ప్రాంతాల అందాలను బాగా చిత్రీకరించారు. సంగీత దర్శకుడు తన పనికి న్యాయం చేశారు. కొన్ని సన్నివేశాల్లో నేపథ్యం సంగీతం ప్లస్ అయింది. పాటలు బాగానే ఉన్నాయి కానీ ప్లేస్‌మెంట్ కరెక్ట్‌గా లేదనిపిస్తుంది. ఎడిటింగ్ కాస్త మైనస్ అనుకోవచ్చు. ఓవరాల్‌గా త్రిమూర్తుల్ని తెరపై చూడాలంటే కొంత ఓపిక కావలసిందే!
ట్యాగ్‌లైన్: ఓల్డ్ ట్రీట్‌మెంట్
రేటింగ్: 2.5/5