Vaazha 2 Review: మలయాళ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘వాలా2' ఎలా ఉందంటే
ABN, Publish Date - Apr 24 , 2026 | 10:47 AM
ప్రస్తుతం మలయాళ చిత్రాల హవా బాగా నడుస్తోంది. చిన్న కథ, సహజత్వం, హంగులు లేని సెటప్పులు భారీ విజయం.. ఇదే మలయాళ సినిమా ఫార్ములా. ఈ మధ్యకాలంలో అలా వచ్చిన ప్రతి సినిమా హిట్టై, కాసుల వర్షం కురిపించాయి. తాజాగా వచ్చిన మరో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘వాలా2: బయోపిక్ ఆఫ్ బిలియిన్ బ్రోస్’. 2024లో వచ్చిన ‘వాలా’ చిత్రానికి కొనసాగింపుగా ఈ చిత్రం తెరకెక్కింది.
సినిమా రివ్యూ: ‘వాలా2: బయోపిక్ ఆఫ్ బిలియిన్ బ్రోస్’
ప్రస్తుతం మలయాళ చిత్రాల హవా బాగా నడుస్తోంది. చిన్న కథ, సహజత్వం, హంగులు లేని సెటప్పులు భారీ విజయం.. ఇదే మలయాళ సినిమా ఫార్ములా. ఈ మధ్యకాలంలో అలా వచ్చిన ప్రతి సినిమా హిట్టై, కాసుల వర్షం కురిపించాయి. తాజాగా వచ్చిన మరో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘వాలా2: బయోపిక్ ఆఫ్ బిలియిన్ బ్రోస్’. 2024లో వచ్చిన ‘వాలా’ చిత్రానికి కొనసాగింపుగా ఈ చిత్రం తెరకెక్కింది. సావిన్ షా దర్శకుడు. సోషల్ మీడియాలో పాపులర్ అయిన హషీర్, అలెన్, వినాయక్, అజిన్ జాయ్ కీలక పాత్రధారులు. ఏప్రిల్ మొదటి వారంలో మలయాళంలో విడుదలైన ఈ చిత్రం సూపర్‌హిట్టై మొదటివారం వంద కోట్లు కలెక్ట్ చేసి.. ప్రస్తుతం రెండు వందల కోట్ల మార్కును దాటింది. షైన్ స్క్రీన్స్ అధినేత సాహు గారపాటి తెలుగులో విడుదల చేశారు. మరీ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.
కథ:
హషీర్, అలన్, అజిన్, వినాయక్ నలుగురు.. స్కూల్ నుంచి మంచి స్నేహితులు. తరచూ గొడవలతో అల్లరి చిల్లరిగా ఉంటారు. కాలేజీ రోజుల్లో ఈ గ్యాంగ్ చేసిన అల్లరు ఎన్నోసార్లు పెద్దల దగ్గర పంచాయతీ వరకూ తీసుకెళతాయి. ఓ సందర్భంలో పీటీ మాస్టర్ ముజీర్ విద్యార్థులు ప్రేమ పేరుతో బయట తిరుగుతున్నారని, ఫోన్లు ఉపయోగిస్తున్నారని గమనించి ఓ జంట ద్వారా క్లాస్‌లో ఉన్న ప్రేమ జంటల్ని, ఫోన్ ఉపయోగించేవారిని బయటకు లాగుతారు. అలెన్ చెల్లి వేరే అబ్బాయితో తిరుగుతుందని ముజీర్ మాస్టర్.. ‘పిల్లల్ని పెంచేది ఇలాగేనా' అంటూ తల్లిదండ్రులను అవమానించడంతో ఆగ్రహించిన అలెన్.. ఆ మాస్టర్‌పై చేయి చేసుకుంటాడు. దాంతో ఆ నలుగురు కుర్రాళ్లు ఆవేశం డ్రగ్స్ తీసుకుని వారిని కామెంట్ చేసిన అందరిపై దాడికి దిగుతారు. పోలీస్ కేసు కావడం.. కౌన్సిలింగ్ ఇవ్వడంతో ఆ నలుగురు స్నేహితుల్లో మార్పు వస్తుంది. ఆలోచనలో పడ్డ ఆ యువత బాగా చదువుకుని విదేశాలకు వెళ్లి సంపాదించాలని నిర్ణయించుకుంటారు? ఈ జర్నీలో వారు ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? జీవితం వారికి ఏం నేర్పింది? ఫైనల్‌గా గమ్యాన్ని చేరుకున్నారా? లేదా అన్నది కథ.
విశ్లేషణ:
‘వాలా’ చిత్రం క్లైమాక్స్‌లో నలుగురు కుర్రాళ్లు యు.కె వెళ్లి సెటిల్ అవ్వాలి అన్నట్లు చూపించారు. మధ్య తరగతికి చెందిన కుర్రాళ్లు యు.కె.లాంటి ప్రాంతానికి వెళ్లి చదివి సెటిల్ అవ్వాలంటే ఎలాంటి సవాళ్లు ఉంటాయి అన్న లైన్‌తో నిజజీవితాలకు కనెక్ట్ అయ్యేలా 'వాలా2' కథను నడిపించారు. సోదరులు కావాలని కోరుకునే ఇద్దరు స్నేహితుల కథతో సినిమా మొదలవుతుంది. ఆ స్నేహితులు నలుగురై, స్కూల్, కాలేజ్, అల్లర్లు, ఇంట్లో చివాట్లు, పోలీస్ స్టేషన్, కౌన్సిలింగ్ వంటి సన్నివేశాలలో నడుస్తుంది. అయితే ఇదంతా కూడా ఫస్ట్ పార్టుకు దగ్గరగానే ఉంటుంది. కాలేజ్లో గొడవలు, కుర్రాళ్లపై కేసు పెట్టకుండా పోలీస్ రక్షించడం, అక్కడి నుంచి జీవితం గురించి ఆలోచించడంతో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. ఫస్టాఫ్‌లో ఫన్‌కు లోటు ఉండదు. కాలేజ్‌లో ఎదురైన అవమానాలతో ఆ యువతలో వచ్చిన మార్పు, విదేశాలకు వెళ్లడానికి చేసే ప్రయత్నాలు, అక్కడికి వెళ్లాక చదువుకు, సర్వైవ్ కావడానికి పడ్డ కష్టాన్ని చాలా హృద్యంగా చూపించారు. క్లైమాక్స్లో వినాయక్ తండ్రి మరణం, హషీర్ సోదరుల్లో మార్పు, అలెన్ - తన చెల్లిపై చూపించే ప్రేమ, బాధ్యత ఇలా ప్రతి ఒక్కరి కథలోనూ చక్కని భావోద్వేగాలను పండించారు. యువత బాధ్యత గుర్తు చేశారు. కాలేజ్‌లో తల్లిండ్రులు, టీచర్స్, పోలీస్‌కు మధ్య సన్నివేశాలు అలరిస్తాయి. పిల్లల విషయంలో తల్లిదండ్రులు, టీచర్స్ కూడా బాధ్యతగానే వ్యవహరించాలనే సందేశం ఇచ్చారు. అయితే లవ్ ఎపిసోడ్స్ ఉన్నా.. రొమాన్స్‌కు ఎక్కడా స్కోప్ ఇవ్వలేదు. తెలుగు ఆడియన్స్‌కు యువతకు కనెక్ట్ అయ్యేలా కొన్ని అనిల్ రావిపూడి రిఫరెన్స్‌లు, ‘జయ జానకి నాయక’ డైలాగులు క్యాష్ అనుదీప్ ప్రస్తావనలు తీసుకొచ్చి నవ్వులు పూయించారు. సినిమాలో ఎంతగా నవ్వించారో.. అంతా భావోద్వేగాన్ని పంచారు.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు..
కేరళలో సోషల్ మీడియాలో పాపులర్ కుర్రాళ్లు ప్రధాన పాత్రధారులుగా ఈ చిత్రం తెరకెక్కింది. హషీర్, అలన్, అజిన్, వినాయక్ ఇలా ఇందులో కనిపించిన ఆర్టిస్ట్లు అంతా కొత్తవారైనా తమ పాత్రలకు న్యాయం చేశారు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆల్షోన్స్ పుత్రన్ చక్కని నటన కనబర్చారు. తెలంగాణ స్లాంగ్ డైలాగ్లతో అలరించారు. తల్లిదండ్రుల పాత్రల్లో కనిపించిన అందరూ చక్కని నటనతో ఆకట్టుకున్నారు. అఖిల్ లైలాసురన్ కెమెరా పనితనం ఆకట్టుకుంది. అంకిత్ మీనన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సందర్భానుసారంగా అందించిన పాటలు ఆకట్టుకున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెద్ద ఎసెట్. ఎడిటర్ కన్నన్ మోహన్ ఫస్టాఫ్‌లో స్నేహితుల మధ్య నడిచే సన్నివేశాలకు కాస్త కత్తెర వేసుండాల్సింది. విపిన్ దాస్ రాసిన కథను సావిన్ షా చక్కగా తెరకెక్కించారు. అయితే ఫస్టాఫ్ కాస్త గందరగోళంగా ఉన్నా.. సెకెండాప్ మాత్రం చాలా బ్యాలెన్స్‌డ్‌గా తీర్చిదిద్దారు. స్ర్కీన్‌ప్లే బావుంది. రకరకాల కారణాలతో కుటుంబాలను వదిలి దూరం వెళ్లిన యువత ఎలా రీలైజ్ అయ్యారు.. వారిలో వచ్చిన మార్పుతో కుటుంబానికి ఎలా అండగా నిలిచారు అన్న లైన్ క్లైమాక్స్ ఎంతో బలంగా నిలిచింది. దర్శకుడు ఆ సన్నివేశాలు తీర్చిదిద్దిన తీరు అభినందనీయం. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా అంతా నేచురల్‌గా ఉంది. అనువాదం విషయంలో కాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. ప్రతి మిడిల్ క్లాస్ కుర్రాడికి, కుటుంబాలకు కనెక్ట్ అయ్యే సినిమా ఇది. మన జీవితంలో జరిగిన ఎన్నో విషయాలను గుర్తు చేస్తుందీ సినిమా.
ట్యాగ్‌లైన్: ప్రథమార్థం గోల.. ద్వితీయార్థం భళా..
రేటింగ్: 3/5