Toxic: గ్యాంగ్ స్టర్ డ్రామా 'టాక్సిక్' రివ్యూ
ABN, Publish Date - Aug 26 , 2026 | 12:25 PM
యశ్ ద్విపాత్రాభినయం చేసిన 'టాక్సిక్' జనం ముందుకొచ్చింది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో యశ్, వెంకట్ కె నారాయణ నిర్మించిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
'కేజీఎఫ్', 'కాంతార' వంటి చిత్రాలతో కన్నడ చిత్రసీమపై అందరి దృష్టి పడింది. పాన్ ఇండియా స్థాయి చిత్రాలను తెరకెక్కించి, ఘన విజయాలను సొంతం చేసుకోగలరనే నమ్మకం కలిగింది. దాంతో అక్కడ కూడా పాన్ ఇండియా చిత్రాలు పుట్టగొడుగుల్లా పెరిగిపోయాయి. అయితే యశ్ 'కేజీఎఫ్' తర్వాత ద్విపాత్రాభినయం చేస్తూ, నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన 'టాక్సిక్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలానే ఈ సినిమాను అదే భారీ స్థాయిలో కెవిఎన్ ప్రొడక్షన్స్ అధినేత వెంకట్ కె నారాయణ నిర్మించారు. మలయాళీ నటి గీతూ మోహన్ దాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
కథ గురించి చెప్పాలంటే ఇదో పీరియాడిక్ గ్యాంగ్ స్టర్ స్టోరీ! 1947లో మన దేశానికి స్వతంత్రం వచ్చినా... గోవా మాత్రం పోర్చుగీసు వాళ్ళ చేతుల్లోనే ఉండిపోయింది. ఆ సమయంలో అక్కడ మాదక ద్రవ్యాలు, అక్రమ ఆయుధాల వ్యాపారంలో ఆధిపత్యం కోసం కొన్ని ముఠాలు తరచూ గొడవలు పడుతూ ఉంటాయి. తన అక్క గంగ (నయనతార)తో కలిసి ఆ నేర సామ్రాజ్యంలోకి అడుగు పెడతాడు రాయ (యశ్). తమ్ముడిని ఎలాగైనా నేర సామ్రాజ్య సింహాసనంపై కూర్చోపెట్టాలన్నది గంగ కోరిక. అక్క సహకారంతో అప్పటికే ఆ రంగంలో ఆధిపత్యం చెలాయిస్తున్న సాల్వడోర్ (డారెల్ డిసెల్వా)కు అండగా ఉంటాడు రాయ. దాంతో తన కూతురు రెబెకా (తారా సుతారియా)ను రాయ కు ఇచ్చి వివాహం చేస్తాడు సాల్వడోర్. అయితే గోవాకు వచ్చిన రాయల్ సర్కస్ లోని అందాల సుందరి నదియా (కియారా అద్వానీ)ని చూసి మోజు పడిన రాయ, ఆ తర్వాత ఆమెతో శారీరక బంధాన్ని పెంచుకుంటాడు. నదియా ప్రవేశంతో రాయ, గంగ, సాల్వడోర్, రెబెకా మధ్య ఎలాంటి అభిప్రాయ బేధాలు వచ్చాయి? తన తమ్ముడిని గోవా అండర్ వరల్డ్ కింగ్ ను చేయాలనుకున్న గంగ కోరిక తీరిందా? నదియాతో ప్రేమలో పడిన రాయ ఎలాంటి మూల్యం చెల్లించాడు? వారికి పుట్టిన బిడ్డ టిక్కెట్ (యశ్)తో ఎలాంటి చిక్కుల్లో ఇరుక్కున్నాడు? అనేదే 'టాక్సిక్' కథ.
గోవా బేస్‌గా 1920లో రాయ తండ్రి కథతో మొదలయ్యే ఈ సినిమా, 1967లో రాయ మరణంతో పూర్తవుతుంది. గోవాలో దశాబ్దాలుగా పాతుకుపోయిన డ్రగ్స్ అండ్ క్యాసినో కల్చర్ ను, అక్రమ ఆయుధాల దందాను, ఆ బిజినెస్ లో జరిగే ఆధిపత్య పోరును హైలైట్ చేస్తూ సినిమాను దర్శకురాలు గీతూ మోహన్ దాస్ నడిపించారు. దాంతో సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకూ తుపాకీ తూటాలు, గ్రెనేట్ ప్రేలుళ్ళ చప్పుళ్ళతో చెవులు చిల్లులు పడిపోతాయి. అలానే రక్తపాతం లేని సన్నివేశం లేదంటే అతిశయోక్తి కాదు. బేసిక్ గా ఇది ఓ అక్క, తమ్ముడు అనుబంధాన్ని తెలిపే కథ. అలానే ఓ తండ్రీ కూతురు బంధాన్ని చెప్పే స్టోరీ, అంతేకాదు వివాహేతర సంబంధంలోని బలమైన ప్రేమను చూపించే సినిమా. కన్న కొడుకును నిర్దాక్షిణ్యంగా దూరం చేసుకున్న ఓ తండ్రి మనో వ్యథ. అయితే ఈ ఎమోషన్స్ ను మనసు లోతుల్లోకి తీసుకెళ్లేలా చేయడంలో గీతూ మోహన్ దాస్ పూర్తిగా విఫలం అయ్యారు. సినిమా ప్రారంభంలోనే జరగబోయే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో చూచాయగా చెప్పేశారు. దాంతో తెర మీద వచ్చే హింసాత్మక సన్నివేశాల ప్రభావం కానీ, ఎమోషనల్ సీన్స్ కు ఫీల్ అవ్వడం కాని ప్రేక్షకుడు చేయలేడు. పైగా కథంతా అక్కడక్కడే తిరగడంతో కొద్ది సేపటికే బోర్ కొట్టేస్తుంది. తెరమీద విజువల్స్ ఎంత కలర్ ఫుల్ గా ఉన్నా, నటీనటుల నటన అద్భుతంగా ఉన్నా... అవేవీ మనసును ప్రభావితం చేయవు. దాంతో టాక్సిక్ ఓ టార్చర్ గా మారిపోయింది. సినిమాపై పెట్టుకున్న భారీ అంచనాలు నిదానంగా కరిగిపోవడంతో థియేటర్లలో ప్రేక్షకులు అసహనంగా అరుపులు అరిచే పరిస్థితి వస్తుంది. పతాక సన్నివేశంలో ప్రేక్షకుల ఊహకు అందని ఓ ట్విస్ట్ ఉన్నా... అదేమంతగా జనాలను కదలించదు. అప్పటికే వారంత నిస్సత్తువుకు గురైపోయి ఉంటారు. వాళ్ళకు కాస్తంత ఆనందానికి కలిగించే అంశం ఏదైనా ఉందంటే... అది ఈ సినిమాకు సీక్వెల్ లేకపోవడం.
నటీనటుల విషయానికి వస్తే.... యశ్ ఎప్పటిలానే తన పాత్ర కోసం ప్రాణం పెట్టాడు. రాయ పాత్రలో ఎంతో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడో, కొడుకు టిక్కెట్ పాత్రలో అంత తెంపరి తనాన్ని ప్రదర్శించాడు. యశ్ అక్కగా నయనతార బాగా చేసింది. గతంలో కొన్ని యాక్షన్, ఎమోషనల్ సినిమాలు చేసినా... ఈ తరహా సెంటిమెంట్ పాత్ర చేయడం నయన్ కు ఇదే మొదటిసారి కావచ్చు. సర్కస్ సుందరి నదియాగా కియారా అద్వానీ బాగా సెట్ అయ్యింది. ఈ సినిమాలో పేయింగ్ ఎలిమెంట్ ఏదైనా ఉందంటే కియారా, యశ్ మధ్య వచ్చే మూడు నాలుగు సన్నివేశాలు మాత్రమే. సాల్వడోర్ కూతురు రెబెకా పాత్రలో తారా సుతారియా తేలిపోయింది. ఆమె నటన కూడా పేలవంగా ఉంది. అదే సమయంలో ఆమె పిన్ని పాత్రలో హుమా ఖురేషీ అదరగొట్టింది. ఈ సినిమా విషయంలో జాలిపడాల్సి వస్తే అది రుక్మిణీ వసంత్ గురించే. ద్వితీయార్థంలో ఎంట్రీ అయ్యే ఆ పాత్రను సరైన రీతిలో దీర్చిదిద్దలేదు. దాంతో ఆమెకు ప్రాధాన్యమే లేకుండా పోయింది. యశ్ నమ్మిన బంటుగా సుదేవ్ నాయర్ బాగా చేశాడు. ఈ సినిమాకు స్వరాలు సమకూర్చిన వాళ్ళు చాలామందే ఉన్నారు. కానీ పాటలేవీ బాలేదు. రవి బస్రూర్ నేపథ్య సంగీతమే కాస్తంత ఇంపాక్ట్ ను క్రియేట్ చేసేలా ఉంది. రాజీవ్ రవి సినిమాటోగ్రఫీ... సీన్స్ మూడ్ ను ఎలివేట్ చేసింది. విశేషం ఏమంటే... రాజీవ్ రవి ఈ చిత్ర దర్శకురాలు గీతూ మోహన్ దాస్ భర్తే! ఆయనకూ నాలుగైదు సినిమాలు డైరెక్ట్ చేసిన అనుభవం ఉంది. భర్తే సినిమాటోగ్రాఫర్ కావడం కూడా గీతూ మోహన్ దాస్ కు కొంత కలిసొచ్చిందనే చెప్పాలి. అయితే లెంగ్తీ కాన్వాస్ ను తీసుకుని ముక్కలు ముక్కలుగా కథను ప్రెజెంట్ చేయడం వల్ల ఏదీ ప్రభావం చూపించలేకపోయింది. యశ్ తో పాటు ఒకటి రెండు పాత్రలకు తప్పితే మిగిలిన పాత్రల డబ్బింగ్ కూడా దారుణం ఉంది. తెలుగు అనువాదం కొన్ని చోట్ల గ్రాంధికంగా సాగింది.
అసలు ఏ పాత్ర ఎందుకు వస్తోందో? ఎందుకు వెళుతుందో? హీరోతో వాళ్ళకు ఉన్న వైరం ఏమిటో? ఎవరీ అర్థం కాదు. మరబొమ్మల్లా తెర మీద జరిగే సన్నివేశాలను ప్రేక్షకులు చూడాల్సిన పరిస్థితి. ఇలాంటి కథను చెప్పిన గీతూ మోహన్ దాస్ ను నమ్మి, ఈ ప్రాజెక్ట్ ఆమె చేతిల్లో పెట్టిన యశ్, వెంకట్ నారాయణను అభినందించాలి. 'టాక్సిక్' దెబ్బకు 'ఇరుముడి' సినిమా కలెక్షన్స్ పెరిగి... అది అతి త్వరలోనే రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరినా ఆశ్చరపోనక్కర్లేదు. ఈ సినిమాలో హీరో ఒక మాట పదే పదే చెబుతుంటాడు. 'మనం తీసుకున్న నిర్ణయానికి ఎప్పటికైనా మూల్యం చెల్లించకతప్పదు' అని. ఈ సినిమా చూడాలనుకునే వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని గ్రహిస్తే మంచిది.
ట్యాగ్ లైన్: టాక్సిక్ టార్చర్
రేటింగ్: 2/5