సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సినిమా రివ్యూ: టొవినో థామస్‌ నటించిన ‘పళ్లిచట్టంబి’

ABN, Publish Date - Apr 16 , 2026 | 08:57 PM

టొవినో థామస్‌ నటించిన చిత్రం ‘పళ్లిచట్టంబి’. డిజో జోస్‌ ఆంటోనీ దర్శకత్వం వహించారు. కాయదు లోహర్‌ కథానాయిక. మలయాళంలో ఈ నెల 15న విడుదలైన ఈ చిత్రం తెలుగులో శుక్రవారం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరీ చిత్రం ఎలా ఉందో చూద్దాం.

సినిమా రివ్యూ: ‘పళ్లిచట్టంబి’ (Pallichattambi Review)
విడుదల తేది:
17-4-2026


మలయాళ నటుడు టొవినో థామస్‌ (Tovino Thomas) చిన్న చిన్న పాత్రలతో కెరీర్‌ మొదలుపెట్టి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తదుపరి హీరోగా ఎంట్రీ ఇచ్చి సెలెక్టివ్‌ సినిమాలతో ముందుకెళ్తున్నారు. ‘మిన్నల్‌ మురళి’, ‘2018’, ‘ఎఆర్‌ఎం’, ‘ఐడెంటిటీ’ చిత్రాలతో హీరోగా నిరూపించుకుని తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘పళ్లిచట్టంబి’. డిజో జోస్‌ ఆంటోనీ దర్శకత్వం వహించారు. కాయదు లోహర్‌ కథానాయిక. తెలుగు నటుడు శత్రు కీలక పాత్ర పోషించారు. వరల్డ్‌ వైడ్‌ ఫిలింస్‌, సి క్యూబ్‌ బ్రోస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్స్‌పై నౌఫల్‌, బ్రిజీష్‌, చాణక్య, చైతన్య, చరణ్‌ నిర్మించారు. మలయాళంలో ఈ నెల 15న విడుదలైన ఈ చిత్రం తెలుగులో శుక్రవారం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరీ చిత్రం ఎలా ఉందో చూద్దాం.

కథ: (Pallichattambi Review)
1930 - 50ల సమయంలో కేరళ, కర్ణాటక సరిహద్దులో ఉన్న కాణియార్‌ ప్రాంతంలో సాగే కథ ఇది. అక్కడ ఓ కొండపై ఉన్న బంగారు గనిపై కన్నేస్తాడు పటేలర్‌ కుంజుంబు నంబియార్‌ (పృథ్వీరాజ్‌ సుకుమారన్‌). తన దగ్గర పనిచేసే అణగారిన వర్గాలను అణగదొక్కుతూ, ఎదురు చెప్పిన వారిని కనికరం లేకుండా చంపేస్తుంటాడు.. ఇదొక కథ. 1957లో కేరళలో కమ్యూనిస్ట్‌ ప్రభుత్వం అధికారంలో వస్తుంది. ఆ తర్వాత కేరళ రాష్ట్ర మంతటా కమ్యూనిస్ట్‌ ప్రభావానికిలోనై ఉంటుంది. దాంతో కాణియార్‌ గ్రామంలో ఉన్న చర్చి సంబంధీకులకు, కమ్యూనిస్ట్‌ పార్టీకి మధ్య వివాదం జరుగుతుంటుంది. చర్చి వాళ్లు తమ ప్రాంతంలో పట్టు నిలుపుకోవడానికి ఓ రక్షకుడు కృష్ణ పిళ్లై అలియాస్‌ క్రిష్టోఫర్‌ (టోవినో థామస్‌) రంగంలోకి దింపుతారు. అతన్ని చర్చి వాళ్లు ‘పళ్లి చట్టంబి’గా పిలుస్తారు. అతడు కమ్యూనిస్టు గుండాల నుంచి చర్చిని కాపాడే క్రమంలో గ్రామంలో యువతకు కలరియపట్టు వంటి యుద్థ కళల్లో శిక్షణ ఇస్తాడు. కమ్యూనిస్ట్‌ అమ్మాయి రెబెకా వేసిన ఓ నాటకం వల్ల కమ్యూనిస్టులను తప్పుగా అర్థం చేసుకున్నానని చర్చి ఫాదర్‌కు, అక్కడ జనాలకు చెబుతాడు   క్రిష్టోఫర్‌. ఈ క్రమంలో అతను క్రిస్టియన్‌ కాదు.. హిందువు అని తెలిసి చర్చి వాళ్ళు అతన్ని ఊరి నుంచి వెళ్లగొడతారు. ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ ఊరు అనుకోని కష్టం వస్తుంది. దాన్ని నుంచి పళ్లిచట్టంబి అలియాస్‌ కృష్ణ పిళ్లై ఆ ఊరును ఎలా రక్షించాడు. రెబెకా ఎందుకు చనిపోయింది? పటేలర్‌కు, పళ్లిచట్టంబికి ఉన్న సంబంధమేంటి అన్నది కథ. *(Pallichattambi Review)


విశ్లేషణ:
1950ల సమయంలో కేరళలో కమ్యూనిస్ట్ లీడర్‌ ఈఎంఎస్‌ నంబూద్రిపాద్‌ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో భూసంస్కరణలను ఇతివృత్తంగా తీసుకుని, దానికి నియంత లాంటి ఓ వ్యక్తి నుంచి ప్రభుత్వాన్ని, ఓ ప్రాంతాన్ని కాపాడుకోవడానికి కొందరు పడే తపనను లింక్‌ చేసి రూపొందించిన చిత్రమిది. ప్రథమార్థం అంతా  కాణియార్‌ ప్రాంతంలో కిస్ట్రియన్స్‌, కమ్యూనిస్ట్‌ గొడవలు, ఆ ప్రాంత చర్చిని, జనాలకు కాపాడటానికి రక్షకుడిగా వచ్చిన పళ్లి చట్టంబి చేసిన ప్రయత్నాలు, క్రిస్టోపర్‌ హిందువని అతనికి అక్కడి నుంచి పంపించేయడంతో కథ నడుస్తుంది. ఇదంతా సోసోగా సాగుతుంది. అసలు కథేంటో సెకెండాఫ్‌లోనే రివీల్‌ అవుతుంది. ఫ్లాష్‌బ్యాక్‌లో ఏం జరిగింది? ఇప్పుడు చేయాల్సింది ఏంటి? అన్న దాంతో సంఘర్షణ మొదలవుతుంది. కథలో పాయింట్‌ బలంగా ఉన్నా దర్శకుడు చెప్పడంలో తడబడ్డాడు. రెండు వర్గాల మధ్య జరిగిన పోరాటం కాబట్టి మాటల్లో ఇంకాస్త లోతు, భావోద్వేగాలు జోడించి ఉండే బావుండేది. క్రిస్టియన్‌ అయినా, కమ్యూనిస్ట్‌ అయినా తమ గడ్డకు కష్టం వస్తే ‘అంతా ఒకటే’ అనే సందేశాన్ని దర్శకుడు ఇచ్చాడు. అయితే  కేరళ రాజకీయాలు గురించి తెలిసిన వారికి ఈ సినిమా బాగా కనెక్ట్‌ అవుతుంది. అయితే ఓ క్రిస్టియన్‌, కమ్యూనిస్ట్‌ల మధ్య తగాదాను దర్శకుడు డైరెక్ట్‌గా చెప్పేయడం జనాలు ఎలా తీసుకుంటారో చూడాలి. కేరళ జనాలకు కూడా ఇది మింగుడు పడని అంశమే. దర్శకుడు పూర్తిగా కమర్షియల్‌ ఫార్మెట్‌లో నడిపించాడు. కైమాక్స్‌ తీర్చిదిద్దిన విధానం బావుంది. బంగారు గనిని స్వాధీనం చేసుకోవాలనుకున్న నియంత పటేలర్‌ కుంజుంబు నంబియార్‌తో కృష్ణ పిళ్లై పోరాటానికి దిగడంతో పార్టు 2కు హింట్‌ ఇచ్చారు.

నటీనటుల పనితీరు..
టొవినో థామస్‌ విలక్షణ నటుడు. ఎలాంటి పాత్రకైనా న్యాయం చేయగలడు. ఇందులో కృష్ణ పిళ్లై అలియాస్‌ క్రిస్టోపర్‌గా ఒదిగిపోయి నటించారు. ఎమోషన్స్‌, చక్కగా పండించారు. యాక్షన్‌ పార్ట్‌ అయితే సూపర్‌ అనే చెప్పాలి. కమ్యూనిస్ట్‌ భావాలున్నా అమ్మాయి రెబెకా పాత్రలో కాయాదు లోహార్‌ కనిపించింది. రెండు పాటలు, కొన్ని సీన్లలోనే కనిపించినా తన మార్కు చూపించింది. సంప్రదాయంగా కనిపించి అలరించింది. పోలీస్‌ ఆఫీసర్‌గా తెలుగు నటుడు శత్రుకి మంచి మార్కులు పడతాయి. సినిమాకు మెయిన్‌ విలన్‌ పటేలర్‌ కుంజుంబు నంబియార్‌ పాత్రలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఎసెట్‌ అని చెప్పొచ్చు. ఆడుకాలం నరేన్‌, టీజీ రవి తదితరులు పాత్రలకు న్యాయం చేశారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే 1950ల నేటివిటీ తీసుకురావడానికి ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ పడిన కష్టం తెరపై కనిపించింది. అలాగే కథానుగుణంగా కెమెరా వర్క్‌ ఉంది. సినిమాటోగ్రాఫర్‌ టిజో టోమీ చక్కని ఫొటోగ్రఫీ అందించారు. జేక్‌ బిజోయ్‌ సంగీతం సినిమాకు చాలా ప్లస్‌ అయింది. భావోద్వేగ, పోరాట సన్నివేశాల్లో నేపథ్య సంగీతం వినపొంపుగా ఉంది. పాటలు కూడా ఫర్వాలేదనిపించాయి. ఎడిటర్‌ శ్రీజిత్‌ సారంగ్‌ ప్రథమార్ధానికి కాస్త కత్తెర వేసుంటే బావుండేది. నిర్మాణ విలువలు బావున్నాయి. డబ్బింగ్‌ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవలసింది. అక్కడక్కడా ఆర్టిస్ట్‌ల లిప్‌సింక్‌ అసలు మ్యాచ్‌ కాలేదు. దర్శకుడు రాసుకున్న కథలో బలం ఉన్నా తెరపై ఆవిష్కరించడంలో  కాస్త తడబాటు కనిపించింది. ఓవరాల్‌గా సినిమాకు కీలకమైన సన్నివేశాలు మాత్రం ఆకట్టుకుంటాయి. పక్కా కేరళ నేటివిటీ సినిమా కావడంతో తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో చూడాలి.

ట్యాగ్‌లైన్‌:  ‘పళ్లిచట్టంబి’ అక్కడక్కడా మెప్పిస్తుంది 
రేటింగ్‌:
2.25/5

Updated Date - Apr 16 , 2026 | 11:27 PM