'ది కేరళ స్టోరీ 2' మూవీ రివ్యూ
ABN, Publish Date - Feb 28 , 2026 | 09:03 AM
ఎట్టకేలకు వివాదాల నడుమ హిందీ చిత్రం 'ది కేరళ స్టోరీ 2' విడుదలైంది. ఈ సినిమా రిలీజ్‌కు కోర్ట్ నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో శుక్రవారం రాత్రి నుండి దేశ వ్యాప్తంగా చిత్ర ప్రదర్శన జరుగుతోంది.
'ది కేరళ స్టోరీ' 2023లో విడుదలై దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. లవ్ జీహాద్ పేరుతో హిందూ మహిళలను వివాహం చేసుకుని, మతం మార్చి విదేశాలకు ఎలా తరలిస్తున్నారనేది ప్రధానాంశంగా తెరకెక్కిన 'ది కేరళ స్టోరీ' (The Kerala Story) ని సమర్థించిన వారు ఉన్నారు, విమర్శించిన వారూ ఉన్నారు. ఆ సినిమాకు లభించిన ఆదరణను దృష్టిలో పెట్టుకునే ఆ చిత్ర నిర్మాత విపుల్ అమృత్ షా లాల్ ఇప్పుడు కామాఖ్య నారాయణ సింగ్ దర్శకత్వంలో దానికి కొనసాగింపుగా 'ది కేరళ స్టోరీ 2' చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా విడుదలకు ముందే చర్చోపచర్చలకు దారితీసింది. ఈ చిత్రాన్ని క్షుణంగా పరిశీలించిన సీబీఎఫ్‌సి యు/ఎ సర్టిఫికెట్ జారీ చేసింది. కానీ ఈ సినిమా విడుదలకు ముందు కోర్టులో ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకున్నారు. ఈ సినిమాకు గుడ్డిగా సర్టిఫికెట్ ఇచ్చారని, ఇలాంటి సినిమాలు సమాజంలో శాంతికి విఘాతం కలిగిస్తాయని సింగిల్ జడ్జి అభిప్రాయపడ్డారు. అంతేకాదు... రెండు వారాలపాటు విడుదలపై తాత్కాలిక స్టే ఇచ్చారు. దీంతో చిత్ర నిర్మాతలు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. జస్టిస్ ఎస్.ఎ. ధర్మాధికారి, జస్టిస్ పి.వి. బాలకృష్ణన్‌తో కూడిన బెంచ్ సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను ఎత్తివేసింది. ఆ రకంగా 'ది కేరళ స్టోరీ 2' విడుదలకు మార్గం సుగమం కావడంతో శుక్రవారం సెకండ్ షో నుండి వివిధ నగరాలు, పట్టణాలలో సినిమాను ప్రదర్శించడం మొదలు పెట్టారు.
'ది కేరళ స్టోరీ 2' (The Kerala Story 2) కథేమిటంటే... ఇది ముగ్గురు యువతుల వైవాహిక జీవితానికి సంబంధించిన సంఘటనల సమాహారం. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో నివసించే ముగ్గురు యువతల జీవితం లవ్ జీహాద్ కారణంగా ఎలాంటి మలుపులు తిరిగిందనే విషయాన్ని కళ్ళకు కట్టినట్టుగా దర్శకుడు కామాఖ్య నారాయణ సింగ్ (Kamakhya Narayana Singh) తెరకెక్కించారు. పదహారేళ్ళ దివ్యకు డాన్స్ అంటే ఇష్టం. ఇన్ స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ ఫేమ్ సంపాదించుకుంటుంది. తల్లిదండ్రులు ఆమె పిచ్చి చేష్టలను ఏ మాత్రం ప్రోత్సహించరు. అదే సమయంలో ఆమెకు రషీద్‌తో పరిచయం అవుతుంది. అతని ప్రోత్సాహంతో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ గా మంచి గుర్తింపు సాధించగలననే నమ్మకంతో అతనికి దగ్గరవుతుంది. నేహ క్రీడాకారిణి. జావెలిన్ త్రో స్టేట్ ప్లేయర్. ఆమె రాజును గుడిలో పెళ్ళి చేసుకుంటుంది. మూడో అమ్మాయి సురేఖ. ఆమె కేరళ వాసి. అభ్యుదయ భావాలు కలిగిన జర్నలిస్ట్ సలీమ్‌ను ఆమె ప్రేమించి పెళ్ళి చేసుకుంటుంది. ఇదిలా ఉంటే.. తనకు తగినంత స్వేచ్ఛను ఇచ్చి, బాసటగా నిలుస్తాడని రషీద్‌ను పెళ్ళి చేసుకున్న దివ్యకు కొద్ది రోజుల్లోనే అతని నిజస్వరూపం తెలుస్తుంది. రాజు పేరుతో తనను వివాహం చేసుకుంది ఓ ముస్లిం యువకుడని తెలుసుకుని నేహా ఖంగుతింటుంది. ప్రోగ్రెసివ్ థాట్స్ ఉన్నాయని నమ్మి సలీమ్‌ను వివాహం చేసుకుంటే అతను నయ వంచకుడనే విషయం సురేఖకు బోధపడుతుంది. వివాహానంతరం ఈ ముగ్గురు తమ పేర్లను, మతాన్ని మార్చుకోవాల్సి వస్తుంది. వైవాహిక జీవితం ఛిద్రమైన తర్వాత ఈ ముగ్గురు యువతులు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? వాటి పర్యవసనాలు ఏమిటనేది మిగిలిన కథ.
సినిమా ప్రారంభం నుండి విశ్రాంతి వరకూ పాత్రల పరిచయం, వారి ఆలోచనలు, ప్రేమ, పెళ్ళి వరకూ చకచకా సాగింది. అదే సమయంలో ఈ ముగ్గురు యువతులు తాము మోసపోయామని గ్రహించడంతో దర్శకుడు బ్రేక్ ఇచ్చారు. వీరి జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుందనే ఆసక్తితో పాటు తెలియని భయాందోళనలకు ప్రేక్షకుడు గురయ్యే విధంగా చేశాడు. ద్వితీయార్థంలో దర్శకుడు చెప్పాలనుకున్న అసలు విషయాన్ని చెప్పేశాడు. ప్రేమ పేరుతో కొందరు వలవేసి, హిందూ మహిళలను టార్గెట్ చేసి మరీ మతం మార్చుతున్నారని, అమాయకంగా వారి ఉచ్చులో పడి జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారని, ఎదురు తిరిగిన కొందరి జీవితాలు ఊహకందని ముగింపుకు గురవుతున్నాయని తెలిపాడు.
'ది కేరళ స్టోరీ'కి కొనసాగింపుగా వచ్చిన సినిమా కాబట్టి... దీని ద్వారా మేకర్స్ ఏం చెప్పదల్చుకున్నారనేది విదితమే. దేశంలో ఇవాళ పెచ్చుపెరిగిపోయిన లవ్ జీహాద్ కుట్రను బట్టబయలు చేయాలనే తలంపుతో తీసిన సినిమా ఇది. అయితే ఇది ముస్లిం వ్యతిరేక సినిమా కాదు అనే భావన కలగడం కోసం ఈ దేశంలో పుట్టి, ఈ దేశానికి గౌరవాన్ని తెచ్చిన కొందరు ముస్లిం పెద్దలను కొన్ని పాత్రల ద్వారా తలుచుకునే ప్రయత్నం చేశారు. లవ్ జీహాద్‌కు తాము వ్యతిరేకం తప్పితే... మతాంతర ప్రేమ వివాహాలకు కాదని స్పష్టం చేశారు. ఇలాంటి కుట్రలకు బలైన కొందరి వివరాలనూ సినిమా చివరిలో ఉదహరించారు. వాస్తవంగా జరిగిన సంఘటనల నుండి కథను తయారు చేసినా... వాటిని తెర మీద చూపించే క్రమంలో కొంత అతి కనిపిస్తుంది. ఓ సమస్యను సున్నితంగా వేలెత్తి చూపించడం వేరు. హార్డ్ హిట్టింగ్ గా చెప్పడం వేరు. ఇందులో దర్శకుడు రెండో విధానాన్ని ఎంచుకున్నారు. దాని వల్ల అన్ని వర్గాల వారూ ఈ కథలో చూపించిన అంశాల పట్ల ఒకే రీతిన స్పందించే ఆస్కారం లేదు. గతంలో ఇలాంటి సంఘటనలపై తెరకెక్కిన చిత్రాలకు ప్రాపగాండ మూవీస్ అనే ముద్రవేసే ప్రయత్నం కొందరు చేశారు. ఇప్పుడు దీనికీ అదే ముద్ర వేస్తారు! అందులో సందేహం లేదు. ఇప్పటికే కేరళ వంటి చోట్ల కొందరు ఈ సినిమాకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. అన్ని అడ్డంకులు అధిగమించి సినిమా జనం ముందుకు వచ్చింది కాబట్టి... ఇప్పుడు నిరసనలు మరింత పెరిగే ఆస్కారం కూడా లేకపోలేదు.
ఇక నటీనటుల విషయానికి వస్తే... ఉల్కా గుప్తా, అదితి భాటియా, ఐశ్వర్య ఓఝా ప్రధాన పాత్రలను పోషించారు. వీరంతా సహజనటన ప్రదర్శించారు. సలీమ్ పాత్రను సుమిత్ గహ్లావత్ అద్భుతంగా చేశాడు. అలానే అర్జున్ ఉజ్లా, యుక్తమ్ ఖోస్లా, అల్కా అమిన్, రామ్ జీ బాలీ, పూర్వ పరాగ్, శ్వేత మున్షి తదితరులు ఇతర ప్రధాన పాత్రలను పోషించారు. కామాఖ్య నారాయణ సింగ్ దర్శకత్వం బాగుంది. కాకపోతే పతాక సన్నివేశాలు కాస్తంత హడావుడిగా తీసిన భావన కలుగుతుంది. పాటల స్వరాలు పెద్దంతగా ఆకట్టుకోలేదు. అయితే మాన్ షా తన నేపథ్య సంగీతంతో సన్నివేశాలను ఎలివేట్ చేసే ప్రయత్నం చేశాడు. అభిజిత్ చౌదరి సినిమాటోగ్రఫీ బాగుంది. ఇలాంటి వివాదాస్పద చిత్రాలకు మీడియాలో బాగానే ప్రచారం జరుగుతుంది కానీ అది కలెక్షన్స్‌గా మారడం కష్టం. లవ్ జీహాద్ గురించి తెలుసుకోవాలనుకునే వారికి ఈ సినిమా ఓ అవగాహన కలిగిస్తుంది. ముఖ్యంగా జన్ జీ ఇలాంటి సినిమాలను చూస్తే... గుడ్డిగా ఎవరితో పడితే వారితో ప్రేమలో పడే ఆస్కారం ఉండదు. మేకర్స్ వన్ సైడ్ తీసుకుని తెరకెక్కించిన సినిమానే అయినా... ఇలాంటివి చూడటం వల్ల ప్రస్తుత సమాజంలో ఏం జరుగుతుందనేది తెలుస్తుంది.
ట్యాగ్‌లైన్: కఠోర వాస్తవాలు
రేటింగ్: 2.75/5