Scene Movie Review: సూర్య 'సీన్' మూవీ రివ్యూ!
ABN , Publish Date - Nov 06 , 2026 | 02:14 PM
సూర్య, జీతూ మాధవన్ కాంబినేషన్లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ 'సీన్' ఎలా ఉంది? పోలీస్ ఆఫీసర్‌గా సూర్య నటన, నజ్రియా, నస్లీన్ పెర్ఫార్మెన్స్, కథాకథనాలపై పూర్తి సమీక్ష.
ఈ యేడాది సూర్య టైమ్ నడుస్తోంది. అతను నటించిన 'కరుప్పు', 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. అదే ఊపులో ఈ యేడాది సూర్య నుంచి వచ్చిన మూడో సినిమా 'సీన్'. మలయాళంలో 'రోమాంచం', 'ఆవేశం' వంటి హిట్ చిత్రాలను రూపొందించిన జీతూ మాధవన్ దీనికి దర్శకుడు కావడం, ఈ సినిమాను సూర్య, తన హోమ్ బ్యానర్ లో నిర్మించడంతో సహజంగానే 'సీన్' చిత్రానికి విడుదలకు ముందే క్రేజ్ వచ్చింది. మరి సూర్య మరోసారి పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
డి.ఎస్.పీ. ప్రేమ్ రాజ్ (సూర్య) పోలీస్ డిపార్ట్ మెంట్లో లెజెండ్. తను టేకప్ చేసిన ప్రతి కేసునూ చాలా తెలివిగా సాల్వ్ చేస్తాడు, నేరస్థులను జైలుకు పంపుతాడు. అలాంటి ప్రేమ్ రాజ్ పెర్ఫ్యూమ్ కిల్లర్ విక్టర్ (టోవినో థామస్) నూ జైలు పాలు చేస్తాడు. అయితే ఆ తర్వాత రంగంలోకి దిగిన కాంట్రాక్ట్ కిల్లర్ ఈశ్వరన్ (నస్లీన్) పోలీసులను తప్పుదారి పట్టించడానికి పెర్ఫ్యూమ్ కిల్లర్ తరహాలో రెండు హత్యలు చేస్తాడు. దాంతో అందరూ ప్రేమ్ రాజ్‌ను అనుమానంగా చూస్తారు. తన వ్యక్తిగత కారణాలతో ఉద్యోగానికి రాజీనామా చేయాలనుకున్న ప్రేమ్ రాజ్‌కు దీనిని ఛాలెంజ్‌గా తీసుకుంటాడు. తన మనసు మార్చుకుని, అసిస్టెంట్ మాయ (నజ్రియా నస్రీన్) సాయంతో ఈ కేసును టేకప్ చేస్తాడు. ఈశ్వరన్ ఎత్తులకు పైఎత్తులు వేస్తూ అతన్ని ఎలా పోలీసులకు ప్రేమ్ రాజ్ అప్పగించాడన్నదే 'సీన్' మిగతా కథ.
నిజం చెప్పాలంటే ఈ తరహా సీరియల్, కాంట్రాక్ట్, సైకో కిల్లర్స్ ను పోలీస్ అధికారులు ఇన్వెస్టిగేట్ చేసి పట్టుకునే కథాంశాలతో చాలానే సినిమాలు వచ్చాయి. అలానే వారం వారం ఓటీటీలలో ఎన్నో వెబ్ సీరిస్ వస్తున్నాయి. ఇదీ అదే తరహా కథ. కాకపోతే ఇందులో హీరోకు దృష్టిలోపం ఉంటుంది. కానీ దాన్ని కప్పిపెట్టి రెండేళ్ళు ఉద్యోగం చేసేస్తాడు. ఆ సమయంలో ప్రేక్షకులకు ఇటీవల వచ్చిన 'లెనిన్' సినిమా గుర్తుకు రాకమానదు. అలానే క్లయిమాక్స్‌లో తన ఎరీనాలోకి వచ్చిన విలన్‌ను... తనకు అనుగుణంగా వాతావరణాన్ని మార్చుకుని తుదముట్టించడం అనేది మనం 'రాజా ది గ్రేట్'లో చూశాం. అయితే... ఈ సినిమా ట్రీట్ మెంట్ భిన్నంగా ఉండటంతో ఈ తరహా కథాంశాలను ఇష్టపడే వారికి నచ్చే ఆస్కారం ఉంది. సీరియస్ సబ్జెక్ట్ ను వీలైనంత వినోద ప్రధానంగా దర్శకుడు తెర మీద చూపించాడు.
సినిమా ప్రారంభంలో సూర్య ప్రవర్తన కాస్తంత అతిగా ఉండటంతో ప్రేక్షకులు డైలమాలో పడతారు. అయితే ఆ తర్వాత దానికి దర్శకుడు చూపించిన రీజన్‌తో తృప్తి పడతారు. కానీ హీరో తల్లిదండ్రులకు ఉన్న ఆరోగ్య సమస్యలను, బలహీనతలను పక్కన పెట్టి, వారితో కేసును సాల్వ్ చేయించాలనుకోవడం పెద్దంత కిక్ ఇవ్వదు. కళ్ళు కనిపించని హీరోకు చూపుగా మారిన మాయ అతనికి సహాయం చేయడం కంటే... నిర్లక్ష్యంతో అతన్ని తప్పుదారి పట్టించిన సన్నివేశాలే ఇందులో ఎక్కువ ఉన్నాయి. అలానే వందకు పైగా హత్యలు చేసిన కాంట్రాక్ట్ కిల్లర్ మోటో ఏమిటో కూడా దర్శకుడు ఎక్కడా చూపించలేదు. అన్ని హత్యలు చేసిన వ్యక్తి ఒక హత్యను మాత్రం 'పెర్ఫ్యూమ్ కిల్లర్' తరహాలో చేయడం కన్వెన్సింగ్ గా అనిపించదు. పోలీస్ డిపార్ట్ మెంట్ ను, అధికారులను చాలా సన్నివేశాల్లో డీగ్రేడ్ చేసే విధంగా, కామెడీగా చూపించారు.
నటీనటుల విషయానికి వస్తే... పోలీస్ ఆఫీసర్ గా సూర్య బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. 'సింగం' సీరిస్ చూసిన వారు సూర్యను సిన్సియర్ పోలీస్‌గా తప్ప మరో రకంగా ఊహించుకోలేరు. కానీ వారి ఊహకు పూర్తి భిన్నంగా ఇందులో సూర్య కనిపిస్తాడు. వినోదాన్ని మేళవించిన ఈ పాత్రకు సూర్య సంపూర్ణ న్యాయం చేకూర్చాడు. అతని అసిస్టెంట్ మాయగా నజ్రియా సహజ నటన ప్రదర్శించింది. కాంటాక్ట్ కిల్లర్‌గా నస్లీన్ అద్భుతంగా చేశాడు. కొన్ని సన్నివేశాలలో సూర్యను సైతం డామినేట్ చేశాడు. ఇతర ప్రధాన పాత్రలను లాల్, ఆనంద్ రాజ్, రాజ్ ప్రియన్ తదితరులు పోషించారు. టోవినో థామస్ ప్రత్యేక పాత్రను పోషిస్తే, జ్యోతిక ఓ సన్నివేశంలో మెరుపులా మెరిసింది. సుషిన్ శ్యామ్ నేపథ్య సంగీతం బాగుంది. తెలుగు సంభాషణలకు నేటివిటీని అద్దడంతో అలరించాయి. ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్స్ ను ఇష్టపడే వారికి 'సీన్' కొంత వరకూ నచ్చే ఆస్కారం ఉంది.
రేటింగ్: 2.5/5
ట్యాగ్‌లైన్: మరీ అంత 'సీన్' లేదు!
ఇవి కూడా చదవండి:
చిరంజీవి ‘మెగావర్స్’లో సందడి చేయనున్న స్టార్స్ వీరేనా?
మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్‌కు కాబోయే భార్య పేరు ఇదే..