మహేంద్రగిరి వారాహి సినిమా రివ్యూ
ABN , Publish Date - Sep 11 , 2026 | 01:35 PM
సుమంత్ తాజా చిత్రం మహేంద్రగిరి వారాహి శుక్రవారం జనం ముందుకొచ్చింది. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని లక్ష్మణ్, మధు కాలెపు నిర్మించారు.
సుమంత్ ఈ మధ్య చాలా సెలక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు. కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. దాంతో అందులో కొన్ని ఓటీటీలకే పరిమితం అవుతున్నాయి. అయితే సుమంత్ తాజా చిత్రం 'మహేంద్రగిరి వారాహి' మాత్రం ఇప్పుడు థియేటర్లలో విడుదలైంది. అందుకు ప్రధాన కారణం సుమంత్, ఈ చిత్ర దర్శకుడు సంతోష్ జాగర్లపూడి గతంలో చేసిన 'సుబ్రహ్మణ్యపురం' సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే. సో... వారిద్దరి కాంబోలో వచ్చిన తాజా చిత్రం 'మహేంద్రగిరి వారాహి' ఎలా ఉందో తెలుసుకుందాం.
ఈ సినిమా కథ రెండు వందల యేళ్ళ క్రితం మొదలవుతుంది. రక్తబీజుడనే రాక్షసుడిని సంహరించిన వారాహి అమ్మవారు నెలవుండే మహేంద్రగిరి ప్రాంతానికి చెందిన కథ ఇది. అయితే అప్పటి మహేంద్రగిరి రాజవంశస్థుల అరాచకం కారణంగా వారాహి అమ్మవారు ఆ వంశానికో శాపం పెడుతుంది. ఆ వంశంలో పుట్టే ఏ మగపిల్లాడు 33 సంవత్సరాలకు మించి బ్రతకడు. అయినా అమ్మవారు ఎప్పుడోకప్పుడు కరుణించక పోతుందా అనే నమ్మకంతో వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు, సంసార జీవితాన్ని సాగిస్తుంటారు. కానీ మగవాళ్ళు మాత్రం 33వ పుట్టిన రోజునే ప్రమాదవశాత్తు మరణిస్తుంటారు. భక్తి పేరుతో ప్రజలను మభ్యపెట్టి పబ్బం గడుపుకునే వారి ఆటలు కట్టే యూట్యూబర్ సిద్ధార్థ్ (సుమంత్). అతని అన్నయ్య రాజీవ్ (కమల్ కామరాజు) పెళ్ళికి ముందు దోష నివారణ కోసం విజయనగరం సమీపంలోని వారాహి అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ ప్రమాదవశాత్తు చనిపోతాడు. అదే సమయంలో మహేంద్రగిరి రాజవంశానికి చెందిన నరేంద్ర వర్మ (వంశీ చాగంటి)ని సైతం ఓ దున్నపోతు పొడిచి చంపేస్తుంది. ఇదంతా వారాహి అమ్మవారి శాపమేనని గ్రామస్థులు నమ్ముతారు. కానీ నాస్తికుడైన సిద్ధార్థ్ నిజంగా అమ్మవారంటూ ఉంటే... తన భక్తులను, తనను ఆరాధించే ప్రజలను రక్షించాలి కానీ ఇలా శాపం పెట్టడం ఏమిటని తార్కికంగా ఆలోచిస్తాడు. రాజవంశానికి చెందిన వారి మరణాల వెనుక మిస్టరీని ఛేదించాలని భావిస్తాడు. మరి అతని సంకల్పం నెరవేరిందా? అందుకు అమ్మవారే స్వయంగా అతనికి ఎలాంటి సాయం చేసింది? రాజవంశీకుల మరణాలకు కారకులు ఎవరు? అనేది మిగతా కథ.
సహజంగా ఇలాంటి డివోషనల్ సోషియో ఫాంటసీ చిత్రాలలో దర్శకుడు ఏదో ఒక వైపు నిలబడతారు. పూర్తిగా భక్తిని లేదంటే ఆ భక్తి పేరుతో కొందరు చేసే మోసాలను ఎక్స్ ప్లోర్ చేస్తారు. కానీ ఇందులో దైవశక్తి ఉందని చెబుతూనే, ఆ దైవ శక్తి పేరుతో కొందరు తమ పగను ఎలా తీర్చుకుంటారో చూపించారు. నాస్తికుడైన సిద్ధార్థ్ ఆస్తికుడిగా మారడంతో ఈ సినిమా ముగుస్తుంది. అయితే సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకూ రాజ వంశస్థుల మరణాలకు కారణం వారాహి అమ్మవారి శాపం అని చెబుతూ వచ్చి, చివరిలో ఊహించిన ట్విస్ట్ ఇచ్చారు. అప్పటి వరకూ సాఫీగా సాగిపోయిన ఈ సినిమా గ్రాఫ్ చివరి పది, పదిహేను నిమిషాలలో అమాంతంగా పెరిగింది. కానీ అప్పటికే ప్రేక్షకులు ఈ రొటీన్ డివోషనల్ డ్రామాతో ఆసక్తికోల్పోతారు. అమ్మవారి శాపానికి సంబంధించిన మిస్టరీని హీరో ఛేదించడానికి ఆలస్యంగా రంగంలోకి దిగడం ఇందులోని ప్రధానమైన లోపం. దాంతో క్లయిమాక్స్ ట్విస్ట్ ను కన్వెన్సింగ్ గా చెప్పడానికి దర్శకుడికి టైమ్ సరిపోలేదు. దానికి తోడు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సాగదీయడంతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్టు అయ్యింది. మొత్తం మీద దర్శకుడు ఏదో అనుకుని, మరేదో తీశాడనే భావనే కలుగుతుంది.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు టీమ్‌లో ఉన్న లక్ష్మణ్ చాలా కాలం తర్వాత మళ్ళీ నిర్మాతగా ఈ సినిమాతో జనం ముందుకు వచ్చారు. ఆ మధ్య వచ్చిన 'రంగమార్తాండ' ను ప్రొడ్యూస్ చేసిన మధు కాలెపు ఈ సినిమాకు మరో నిర్మాత. సంతోష్ జాగర్లపూడికి ఈ తరహా సినిమా తీయడంలో అనుభవం ఉన్నా.. ఎందుకే ఈ కథను ఆసక్తికరంగా చెప్పడంలో విఫలమయ్యాడు. నటీనటుల విషయానికి వస్తే సుమంత్ తన పాత్రను బాగానే చేశాడు. సిద్ధు జొన్నలగడ్డ, మాళవిక నాయర్ గెస్ట్ రోల్ ను మించి కాస్తంత ప్రాధాన్యమున్న పాత్రలను చేశారు. ఇతర కీలక పాత్రలను మంజుభార్గవి, మీనాక్షి గోస్వామి, బ్రహ్మానందం, రాజీవ్ కనకాల, వెన్నెల కిశోర్, వడ్లమాని సాయి శ్రీనివాస్, ప్రమోదిని, వంశీ చాగంటి, కమల్ కామరాజు, అలీ, భరత్ రెడ్డి, సురేశ్, నవీనా రెడ్డి, నిత్యశ్రీ తదితరులు పోషించారు. ఐశ్వర్య రాజేశ్ స్క్రీన్ మీద కనిపించేది కొద్దిసేపే! అయినా ఆమెను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేదు. అనూప్ రూబెన్స్ స్వరపర్చిన పాటల కంటే నేపథ్య సంగీతం ఉంది. ఈ చిత్రానికి ప్రతాప్ ఆర్ కృష్ణ సినిమాటోగ్రఫీ అందించగా, జునైద్ సిద్ధిఖీ ఎడిటర్‌గా వ్యవహరించారు. క్లయిమాక్స్ ట్విస్ట్ తప్పితే... సినిమా అంతా సాదాసీదాగా సాగిపోవడంతో 'మహేంద్రగిరి వారాహి' ప్రేక్షకులను మెప్పించడం కష్టమే!
రేటింగ్: 2.25/5
ట్యాగ్ లైన్: ట్విస్టే కీలకం!