సినిమా రివ్యూ: ‘నూటన్స్ థర్డ్ లా’
ABN, Publish Date - Jul 31 , 2026 | 10:26 AM
సుమంత్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘న్యూటన్స్ థర్డ్ లా’. రాజేశ్ కర్ణ దర్శకత్వం వహించిన చిత్రాన్ని కె.హరీశ్ నిర్మించారు. ట్రైలర్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరీ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.
సినిమా రివ్యూ: ‘నూటన్స్ థర్డ్ లా’ (Newtons Third Law)
విడుదల తేది: 31-7-2026
సుమంత్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘న్యూటన్స్ థర్డ్ లా’. రాజేశ్ కర్ణ దర్శకత్వం వహించిన చిత్రాన్ని కె.హరీశ్ నిర్మించారు. జగపతిబాబు, అవసరాల శ్రీనివాస్, త్రినాథ్ వర్మ, రవివర్మ, నేహా పటాన్ కీలక పాత్రధారులు. ట్రైలర్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరీ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.
కథ:
వినయ్ (త్రినాధ్ వర్మ) ఇంజనీరింగ్ స్టూడెంట్. ఇంట్లో ఆర్థిక సమస్యల వల్ల స్నేహితుడు కార్తిక్‌తో కలిసి చిన్నచిన్న దొంగతనాలు చేస్తాడు. కార్తిక్ ఓ పెద్ద డీల్ తీసుకొస్తాడు.. దాంతో లైఫ్ సెటిల్ అయిపోవాలని ప్లాన్ చేస్తారు. ఆ పనిలో ఉండగా వీరిద్దరూ వెళ్తున్న కారు జ్యోతి(నేహాపటాన్) అనే మహిళను ఢీ కొట్టగా ఆమె మరణిస్తుంది. ఆ తర్వాత ఓ రోజు వినయ్ అనుమానస్పదంగా తన ఇంటిపై నుంచి కింద పడి మరణిస్తాడు. ఆ కేసు వాసుదేవ్ (సుమంత్) చేతికి వస్తుంది. ఇందులో భాగంగా వినయ్ తల్లిదండ్రులైన గంగాధర్(రవివర్మ), తల్లి పార్వతి (షెల్లీ కుమార్)లను విచారించగా కొన్ని విషయాలు బయటకొస్తాయి. ఆ నిజాలు ఏంటి? స్నేహితుడి ద్వారా వినయ్‌కు అందిన డీల్ ఏంటి? దానికి మెర్య్కూరీ (జగపతిబాబు) ఉన్న సంబంధం ఏంటి? దీనిలో డేవిడ్ (అవసరాల శ్రీనివాస్) పాత్ర ఏంటి? అతను చదివి భయపడిన ‘న్యూటర్స్ థర్డ్ లా’ బుక్ రాసిందెవరు? వంటి ఆసక్తికర విషయాలకు సమాధానమే ఈ సినిమా.
విశ్లేషణ: (Newtons Third Law Review)
చర్యకు ప్రతిచర్య అన్న న్యూటర్ ధర్ట్ లా ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. జీవితంలో మన చేసే కర్మ, చర్య.. అది మంచైనా, చెడైనా దానికి ప్రతి చర్య ఉంటుంది.. అని చెప్పడమే ఈ కథ ఉద్దేశం. దీనికి కాస్త సస్పెన్స్ ఎలిమెంట్స్ జోడించి ఓ థ్రిల్లర్ ఎలిమెంట్‌గా మలిచే ప్రయత్నం చేశారు దర్శకుడు రాజేశ్ కర్ణ. 1999 సమయంలో ఈ కథ సాగుతుంది. జ్యోతి అనే మహిళ యాక్సిడెంట్, ఆ వెంటనే వినయ్ అనే యువకుడు బిల్డింగ్ మీద నుంచి పడిపోయి మరణించడంతో సినిమా మొదలవుతుంది. ఫస్టాఫ్ అంతా వినయ్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలోనే సాగుతుంది. వదిలేశాం అనిపించుకోకుండా మధ్యలో జ్యోతి కేసును టచ్ చేశారు. సుమంత్‌తో సాగే ఈ ఇన్వెస్టిగేషన్ ఆసక్తికరంగానే ఉన్నా.. నత్తనడకన సాగిన భావన కలుగుతుంది. ఇన్వెస్టిగేషన్ వేగవంతం చేయాల్సిన సమయంలో కూడా స్లోగా సాగదీతగా చేశారు. విరామ సమయానికి వినయ్ కేసు ఓ కొలిక్కి వస్తుంది. అక్కడి నుంచి మరో కథ రన్ అవుతుంది. మెర్య్కూరీ అనే వ్యక్తి తెరపైకి వస్తాడు. అతనితో కలిసి వినయ్, కార్తిక్‌లు ఏం చేశారు? వీరు దేని కోసం ఆశపడ్డారు. జ్యోతి మరణానికి ఈ ఇద్దరూ ఎలా కారణమయ్యారు అనేది చూపించారు. ఈ సన్నివేశాలన్ని స్లో గా సాగినా.. ఆసక్తికరంగా తెరకెక్కించారు. వీటితో కథలో కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారు. మరికొన్నింటికి జవాబు క్లైమాక్స్‌లో చెబుతారనుకుంటే ఓ ట్విస్ట్ ఇచ్చి గజిబిజి చేసేశారు. పోలీస్ అధికారిగా రంగంలో దిగిన వాసుదేవ్ పాత్ర విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. ఆ పాత్ర ముగింపు ఆసక్తికరంగా లేదు. కథ ప్రారంభం నుంచి వాసుదేవ్ పాత్ర బాగానే ఉన్నా క్లైమాక్స్‌లో మాత్రం ట్విస్ట్‌లతో కన్‌ప్యూజ్ చేసేశారు. పైగా పార్ట్-2కి లీడ్ ఇచ్చారు.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు..
వాసుదేవ్ పాత్రకు సుమంత్ పూర్తి న్యాయం చేశారు. పోలీస్ అధికారికగా సెటిల్డ్‌గా కనిపించారు. వినయ్‌లో పాత్రలో త్రినాథ్ వర్మ, కార్తిక్ పాత్రలో గౌతమ్ పండిట్ కూడా చక్కని నటన కనబర్చారు. ఇద్దరి నటన ఆకట్టుకుంది. వినయ్ తల్లిదండ్రులుగా రవివర్మ, షెల్లీ మెప్పించారు. మెర్య్కూరీ పాత్రలో జగపతిబాబు అక్కడక్కడా మెరిశారు. కథకు కీలకమైన పాత్రే అయినా తేల్చేశారు. అవసరాల, నేహా పఠాన్, హరిణి తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. వేద వ్యాస్ గొట్టిపాటి సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అయింది. అలాగే సంగీతం కూడా కలిసొచ్చింది. థ్రిల్లర్ సినిమాకు నేపథ్యసంగీతం ఎంతో ముఖ్యం. ఈ కథకు సింజిత్ యర్రమిల్లి చక్కని నేపథ్య సంగీతం అందించారు. పాటలన్నీ లిరిక్స్ వినిపించేలా ఉన్నాయి. ఫస్టాఫ్‌లో సాగదీతగా అనిపించిన ఇన్వెస్టిగేషన్స్ సీన్స్‌ను కాస్త ఎడిట్ చేసుంటే బావుండును అనిపించింది. 1999ల సమయానికి సంబంధించి ఆర్ట్ వర్క్ బావుంది. హరీష్ నిర్మాణ విలువలు కూడా బావున్నాయి. ఇక దర్శకుడు విషయానికొస్తే.. చర్యకు ప్రతిచర్య అన్న కాన్సెప్ట్‌తో.. ఇద్దరి మరణాలు.. దాని వల్ల జరిగిన పరిణామాల నేపథ్యంలో దర్శకుడు చక్కని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఈ కథ రాసుకున్నాడు. కథను బాగానే చెప్పినా.. కొన్ని ఎలిమెంట్స్‌ను తెరపై చూపించిన తీరులో తడబాటు కనిపించింది. దానివల్లే క్లైమాక్స్‌లో కొన్ని పాత్రలకు సరైన ఎండింగ్ ఇవ్వలేకపోయారనిపించింది. అదే ప్రేక్షకుడు కన్‌ప్యూజ్ అవ్వడానికి కారణంగా చెప్పుకోవచ్చు. స్ర్కీన్‌ప్లే మాత్రం బావుంది. ఇంట్లో పెద్దలు బాధ్యతాయుతంగా లేకపోతే పిల్లలు సరైన మార్గంలో ఉండరనే సందేశం ఇచ్చారు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను ఇష్టపడేవారు కాస్త ఓపికగా కూర్చుంటే సినిమాను కొంతమేరకు ఎంజాయ్ చేయవచ్చు. ఎక్కువ ఆశించి ·వెళ్తే నిరాశ పడతారు.
ట్యాగ్‌లైన్: కిచిడి..కిచిడి థర్డ్ లా..
రేటింగ్: 2.5 / 5