Godari Gattupaina Review: గోదారి గట్టు పైన.. సినిమా రివ్యూ
ABN, Publish Date - May 08 , 2026 | 09:54 AM
సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా జగపతి బాబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'గోదారి గట్టుపైన’ శుక్రవారం ప్రేక్షకుల ఎదుటకు వచ్చింది.
సినిమా రివ్యూ: గోదారి గట్టు పైన (Godari Gattupaina Review)
విడుదల తేది: 8–5–2026
సుమంత్ ప్రభాస్ (Sumanth Prabhas), నిధి ప్రదీప్ (Nidhi Pradeep) జంటగా నటించిన చిత్రం 'గోదారి గట్టుపైన’ (Godari Gattupaina). 100కు పైగా లఘు చిత్రాలు తీసిన అనుభవం ఉన్న సుభాష్ చంద్ర (Subhash Chandra) దర్శకత్వం వహించిన తొలి సినిమా ఇది. జగపతి బాబు, దేవి ప్రసాద్, లైలా, సుదర్శన్, రాజీవ్ కనకాల, రాజ్ కుమార్ కసిరెడ్డి ఇందులో కీలక పాత్రధారులు. మేమ్ ఫేమస్ చిత్రంతో హీరోగా నటించి దర్శకత్వం కూడా చేసిన సుమంత్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం కావడంతో పాటు ప్రచారంతో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ పతాకంపై అభినవ్ రావు నిర్మించిన ఈ విలేజ్ బ్యాక్డ్రాప్ లవ్స్టోరీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.
కథ:
రాజు (సుమంత్ ప్రభాస్) భీమవరం దగ్గర ఉన్న ఓ పల్లెటూరులో ఆటో డ్రైవర్. తన చెల్లి స్నేహితురాలు మాయ (నిధి ప్రదీప్)ని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. అయితే అనుకోకుండా మాయని చెంపదెబ్బ కొడతాడు రాజు. ఆ పై మాయ రాజుని ఇష్టపడుతుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. మాయ తండ్రి శ్యామ్ బాబు (జగపతిబాబు) సెక్యూరిటీగార్డ్‌గా పని చేస్తుంటాడు. కూతురంటే ప్రాణం పెట్టే శ్యామ్ బాబు అంటే ఊరిలో జనాలకు భయం. అయితే కూతురులో మార్పు గమనించిన తండ్రి తను ఎక్కడ ప్రేమలో పడి తనకు దూరం అవుతుందో అని భయపడుతుంటాడు. అయితే రాజుని ఎంతో ఇష్టపడిన మాయ సడన్ గా అతనికి దూరమవుతుంది. అలా రాజుకి మాయ దూరం కావడానికి కారణమేంటి? కూతురి ప్రేమ విషయం తెలిసిన శ్యామ్ బాబు ఏం చేశాడు? మధ్యలో రాజు అరెస్ట్ కావటానికి కారణం ఏమిటి? చివరికి రాజు, మాయ ఒకటవుతారా? లేదా? అన్నదే కథ.
విశ్లేషణ:
గోదావరి జిల్లా నేపథ్యంలో ఓ ఆటో డ్రైవర్ – కాలేజీ స్టూడెంట్ ప్రేమ కథ ఇది. దీనికి తండ్రి, కూతుళ్ళ భావోద్వేగాలను జోడించి తెరకెక్కించారు. హీరో, హీరోయిన్, వారి వారి ఫ్యామిలీల పరిచయాలు, హీరో ఫ్రెండ్స్ చేసే కామెడీ, రాజు, మాయ ప్రేమలో పడి దగ్గరవడం, శ్యామ్ బాబు కూతురు గురించి భయపడటం వంటి సన్నివేశాలతో ప్రథమార్ధం సాగుతుంది. ఇంటర్వెల్ ముందు మాయ రాజుని ఇంకెప్పుడు కలవొద్దు అనడంతో వాట్ నెక్ట్స్ అనే ఆసక్తి కలుగుతుంది. ఇక సెకెండాఫ్ ఈ జంట మళ్ళీ కలవడం, తండ్రి, కూతుళ్ళ ఆప్యాయతానురాగాలు, అటు తండ్రి ఇటు ప్రేమించిన వాడి మధ్య అమ్మాయి నలిగిపోయే సన్నివేశాలు, పద్ధతిగా పెరిగిన కుర్రడు ప్రేమించిన అమ్మాయి, ఆ అమ్మాయి ప్రాణంగా ఇష్టపడే తండ్రిని డీల్ చేసే విధానం వంటి సీన్స్ లో కథ క్లయిమాక్స్ కు చేరుతుంది. అయితే స్ర్టిక్ట్గా పెరిగిన ఓ అమ్మాయి అబ్బాయి చెంపదెబ్బకే ఎలా ప్రేమలో పడిపోతుందనేది కన్వింసింగ్ గా లేదు. ప్రథమార్ధం అంతా స్నేహితుల గోలగోలతో కథలో లీనం కాలేము. హీరో స్నేహితులను ఒక్కో మతానికి సంబంధించిన వారిగా చూపించి మతం అనేది స్నేహానికి, ప్రేమకు అడ్డుకాదని చూపించారు. అయితే ఆ సీన్స్ కూడా బలవంతంగా ఇరికించిన భావన కలుగుతుంది. అయితే ప్రభాస్ ఫ్యాన్స్‌కు కొన్ని సర్ప్రైజ్‌లు ఉన్నాయి.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు..
తొలి చిత్రం 'మేమ్ ఫేమస్ తో నటుడిగా మెప్పించిన సుమంత్ ప్రభాస్ ఈ చిత్రంలోనూ పక్కింటి కుర్రాడిగా, పల్లెటూరి ఆటో డ్రైవర్ పాత్రలో ఆకట్టుకున్నాడు. తన మొదటి సినిమా కంటే ఈ సినిమాలో తన నటనలో పరిణతి కనిపించింది. ఆటో డ్రైవర్ రాజుగా తన ఎనర్జీ సినిమాకు హైలైట్. కామెడీ టైమింగ్‌తో పాటు ఎమోషనల్ సీన్లలోనూ మెప్పించాడు నిధి ప్రదీప్ మహాలక్ష్మిగా కొన్ని సన్నివేశాల్లో క్యూట్ గా కనిపించి మెప్పించింది. సుదర్శన్, రాజ్ కుమార్ కసిరెడ్డి తెరై కనిపించిన ప్రతిసారీ గోలగోల అనిపించింది. ఇక తండ్రిగా జగపతిబాబు పోషించిన పాత్రకు అమ్మాయిల తండ్రులు బాగా కనెక్ట్ అవుతారు. ఆ పాత్రను తీర్చిదిద్దిన తీరు సూపర్బ్. చాలా గ్యాప్ తర్వాత లైలా తెరపై కనిపించారు. హీరోయిన్ తల్లిగా ఆమెను సరైన రీతిలో వాడుకోలేదనిపించింది. ఉన్నంతలో తను మెప్పించటానికి కృషి చేసింది. దేవి ప్రసాద్, శ్రీవాణి హీరో పేరెంట్స్గాను, వైవా రాఘవ, రోహిత్ కృష్ణ వర్మ, రాజీవ్ కనకాల, హర్ష వర్థన్ తదితర నటీనటులు తమ పాత్ర పరిధి మేరకు మెప్పించారు.
సుభాష్ చంద్ర రచనలో పెద్దగా మెరుపులు లేకున్నా… విజువల్ గ్రాండియర్ తో మెప్పించే ప్రయత్నం చేశాడు. సాయి సంతోష్ సినిమాటోగ్రఫీ బావుంది. గోదావరి జిల్లా అందాలను చక్కగా క్యాప్చర్ చేశాడు. నాగవంశీ కృష్ణ మ్యూజిక్ కొంత వరకూ బాగుంది. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో లౌడ్ నెస్ తగ్గించి ఉంటే బాగుండేది. నిర్మాతలు ఖర్చుకు వెనకాడలేదు. కథ రొటీన్ దే అయినా కథనంతో మెప్పించాల్సింది. ఈ విషయంలో దర్శకుడు సక్సెస్ కాలేక పోయాడు. దర్శకుడు సుభాష్ చంద్ర షార్ట్ ఫిలింస్ క్యూట్నెస్కు మారుపేరు. కానీ ఆ క్యూట్ నెస్ వెండితెరపై క్యారీ చేయలేక పోయాడు. చాలా సీన్స్ ప్రత్యేకించి తొలి అర్ధభాగం చాలా వరకూ సాగదీతతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేలా ఉంది. ప్రేమకథలను ఇష్టపడే కొందరికి నచ్చవచ్చు. అసలు టైటిల్ ‘గోదారి గట్టుపైన’ అని ఎందుకు పెట్టారో దర్శకుడికే తెలియాలి. అయితే సినిమా చివరి అరగంటలో దర్శకుడు తన ప్రతిభను ప్రదర్శించాడు. అది ఆడియన్స్ కు నచ్చి మౌత్ పబ్లిసిటీ చేస్తే సినిమాకు మనుగడ ఉంటుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో…