సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సినిమా రివ్యూ: హే బలవంత్‌

ABN, Publish Date - Feb 20 , 2026 | 10:00 AM

సుహాస్, శివానీ నాగరం జంటగా నటించి  ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'హే బలవంత్‌’. గోపీ అచ్చెర దర్శకత్వం వహించారు. బి.నరేంద్రరెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి, బన్నీ వాసు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ట్రైలర్‌, విన్నూత ప్రచారంతో ఆకట్టుకున్న ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.

సినిమా రివ్యూ: హే బలవంత్‌(Hey Balwanth)

యూట్యూబ్‌ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు సుహాస్‌. మొదట ఫ్రెండ్‌ క్యారెక్టర్స్‌ చేస్తూ, తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. ుకలర్‌ఫొటో’తో హీరోగా పరిచయమై గుర్తింపు తెచ్చుకున్నారు. సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వెళ్లినా కొన్ని చిత్రాలు సరైన ఫలితం ఇవ్వలేదు. తాజాగా ఆయన నటించిన కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'హే బలవంత్‌’. (హే భగవంత్‌.. టైటిల్‌ మారింది). శివానీ నాగరం కథానాయిక. నరేశ్‌, వెన్నెల కిశోర్‌, స్రవంతి చొక్కారపు, అన్నపూర్ణమ్మ, హర్షవర్ధన్‌, అజయ్‌ ఘోష్‌, సుదర్శన్‌ కీలక పాత్రధారులు. గోపీ అచ్చెర దర్శకత్వం వహించారు. బి.నరేంద్రరెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి, బన్నీ వాసు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ట్రైలర్‌, విన్నూత ప్రచారంతో ఆకట్టుకున్న ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.

కథ:
కృష్ణ బలవంత్‌ (సుహాస్‌) ఏంబీఏ పూర్తి చేసిన కుర్రాడు. చిన్నతనంలో తల్లి మరణించడంతో తండ్రి రావు బలవంత్‌ (వీకే నరేశ్‌), నాన్నమ్మ (అన్నపూర్ణమ్మ) వద్ద పెరుగుతాడు. తండ్రే తనకి హీరో. చదువు పూర్తయిన తర్వాత తండ్రి చేసే వ్యాపారం టేకోవర్‌ చేసి మంచి పేరుతో స్థిరపడాలనుకుంటాడు. తండ్రి చేసే వ్యాపారం ఏంటో చిన్నప్పటి కృష్ణకు తెలీదు. ఓసారి తండ్రికి ఆరోగ్యం బాగోక నెలరోజులపాటు రెస్ట్‌లో ఉండటంతో కృష్ణ బిజినెస్‌ టేకోవర్‌ చేయాల్సి వస్తుంది. తండ్రి వ్యాపారం ఏంటో తెలిశాక... కృష్ణకు మైండ్‌ బ్లాక్‌ అవుతుంది. ప్లాన్స్‌ అన్నీ తారుమారు అవుతాయి. ప్రేమించిన అమ్మాయి మిత్ర (శివానీ నాగరం) కూడా కృష్ణను వద్దనుకుంటుంది. అసలు కృష్ణ తండ్రి చేసే వ్యాపారం ఏంటి? దానికీ కృష్ణ–మిత్రల ప్రేమకు లింక్‌ ఏంటి? ఆ వ్యాపార ప్రాంతంలో చనిపోయిన పీవీబీ తండ్రి పీవీపీ(బాబు మోహన్‌) ఎవరు? ఆయన శవాన్ని యువన్‌ (వెన్నెల కిశోర్‌) ఎందుకు కిడ్నాప్‌ చేశాడు. యువన్‌కు చెంప (స్రవంతి)కు సంబంధం ఏంటి? ఈ కథలో బెజ్జం దుర్గారావు (అజయ్‌ ఘోష్‌), పీవీబీ (హర్షవర్ధన్‌) ఎవరు? చివరికి కృష్ణ ఏం చేశాడు. తన ప్రేమ సుఖాంతం అయిందా? అన్నది కథ.


విశ్లేషణ:
తను ఏం చేసినా బిడ్డకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని తపనపడే తండ్రి, ఆయన స్ఫూర్తితో వ్యాపారం రెట్టింపు చేసి  గుర్తింపు పొందాలని కోరుకునే కొడుకు కథ ఇది. తండ్రి వ్యాపారం ఏంటో పుత్రుడికి తెలిశాక ఎలా రియాక్ట్‌ అయ్యాడనే నేపథ్యంలో సాగు ఈ కథను వినోదాత్మకంగా చెప్పారు. హీరో ఫ్యామిలీ, బిజినెస్‌, ఓ రాజకీయ కుటుంబం చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. హీరో చిన్నతనం, తండ్రి వ్యాపార సన్నివేశాలతో సినిమా ప్రారంభమవుతుంది.  ట్రైలర్‌లో బిజినెస్‌ ఏంటనే దానిపై సస్పెన్స్‌ క్రియేట్‌ చేసిన దర్శకుడు సినిమా ఆరంభంలోనే ఆ బిజినెస్‌ ఏంటనేది  చెప్పి.. దానిని హీరో ఎలా తీసుకుంటాడు అనే దానిపై ఆసక్తి కలిగించాడు. ఆరంభంలో కాస్త స్లోగా ఉన్నా.. తండ్రి బిజినెస్‌ టేకప్‌ చేసే సన్నివేశం నుంచి కథ పరుగులు తీస్తుంది. సుదర్శన్‌, సుహాస్‌ల మధ్య సీన్స్‌, మరో పక్క లవర్‌ని దక్కించేందుకు హీరో పడే కష్టాలు అలరిస్తాయి. నేచర్‌క్యూర్‌ సీన్‌లో వెన్నెల కిశోర్‌ హంగామా కడుపుబ్బ నవ్విస్తుంది. హీరోయిన్‌ తాత సీన్‌తో ద్వితీయార్థంపై ఆసక్తి కలుగుతుంది. ఆపై సెకెండాఫ్‌ అంతా.. హీరోయిన్‌ తాత శవం, బెజ్జం దుర్గారావు కుటుంబం నేపథ్యంలోనే సాగుతుంది. ఎమ్మెల్యే సీటు కోసం హీరోయిన్‌ తండ్రి పడే ఆరాటం, తండ్రిని లింక్‌ చేస్తూ దాని వెనక నడిచే కథ, లవర్‌ని దక్కించుకోవడానికి హీరో పడే కష్టం నేపథ్యంలో సీన్స్‌ కూడా అందరినీ కడుపుబ్బ నవ్విస్తాయి. క్లైమాక్స్‌ అంతా భావోద్వేగభరితంగా సాగుతుంది. నరేశ్‌ గతం, అతను ఆ బిజినెస్‌ చేయడానికి గల రీజన్స్‌ను దర్శకుడు చక్కగా హ్యాండిల్‌ చేశాడు. చివర్లో సుహాస్‌, నరేశ్‌ల మధ్య తండ్రి కొడుకుల సెంటిమెంట్‌ మనసుకు హత్తుకుంటుంది. క్లైమాక్స్‌ 20 నిమిషాల్లో డ్రామా కాస్త ఎక్కువైనా ఎక్కడా ఇబ్బంది కలిగించేలా లేదు. ఈ సీన్స్‌ను దర్శకుడు డీల్‌ చేసిన విధానం అతని ప్రతిభకు నిదర్శనం. తండ్రి చేసే వ్యాపారం ఏంటో కొడుకుకు తెలియకుండా ఉండటం లాంటి లాజిక్కుల గురించి దర్శకుడు పెద్దగా పట్టించుకోలేదు. చాలా సీన్స్‌కు లాజిక్కులు లేకున్నా.. చక్కని వినోదం పంచడంతో వాటి గురించి ఎవరూ పట్టించుకోరు.


నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు..
సుహాస్‌ నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అతని అమాయకత్వమైన నటన, కామెడీ టైమింగ్‌ బావుంటాయి.  అవే అతని బలాలు. ఇందులో కృష్ణ పాత్రలో చక్కగా నటించాడు. హాస్యం పంచడంతోపాటు భావోద్వేగాలకు చక్కని న్యాయం చేశాడు. హీరోయిన్‌ మిత్రగా శివానీ కూడా బాగా చేసింది. తనకు కూడా ఈ సినిమా మంచి గుర్తింపు తెస్తుంది. ఇక ఈ సినిమాకు హీరోహీరోయిన్‌లతోపాటు మరో ఎసెట్‌ వీకే నరేశ్‌.. రావు బలవంత్‌గా ఆద్యంతం అలరించారు. అలాగే ఫ్లాష్‌బ్యాక్‌ సీన్‌లో కంట తడిపెట్టించాడు. ద్వితీయార్థంలో బాలకృష్ణ ప్రభాస్‌, తారక్‌ను ఇమిటేట్‌ చేసే సీన్‌ అదిరిపోయింది. వెన్నెల కిశోర్‌ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. యాంకర్‌ స్రవంతి డైలాగులు పట్టిపట్టి చెప్పినట్లు అనిపిస్తుంది. సుదర్శన్‌ కామెడీ టైమింగ్‌, డైలాగ్‌లు సినిమాకు ప్లస్‌ అవుతాయి. హర్షవర్ధన్‌, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణమ్మ తదితరులు పాత్రలకు న్యాయం చేశారు. కథ, కథనం, మాటలు సినిమాకు ఎసెట్‌.  అక్కడక్కడా డబుల్‌ మీనింగ్‌ డైలాగ్‌లు ఉన్నా అంత ఇబ్బందికరంగా లేవు. వివేక్‌ సాగర్‌ సంగీతం, మహిరెడ్డి సినిమాటోగ్రఫీ బాగున్నాయి. ఎడిటర్‌ విప్లవ్‌ నైషదం సెకెండ్‌ హాఫ్‌కి కాస్త కత్తెర వేసుంటే బావుండేది. నిర్మాణ విలువలు బావున్నాయి. సమయాన్ని బట్టి కామెడీని, భావోద్వేగాలను మిక్స్‌ చేసిన తీరుతో దర్శకుడు ఆకట్టుకున్నాడు. లైఫ్‌ బాగుండాలంటే చదువును మించినది ఏదీ లేదనే సందేశాన్ని ఇచ్చాడు దర్శకుడు. లాజిక్కులు పట్టించుకోకుండా హాయిగా నవ్వుకోవాలనుకునేవారికి ఈ సినిమా నచ్చుతుంది.

రేటింగ్‌: 2.75
ట్యాగ్‌లైన్‌:
బలవంత్‌ ఫన్‌ రైడ్‌..

Updated Date - Feb 20 , 2026 | 10:05 AM