శ్రీవిష్ణు 'విష్ణు విన్యాసం' మూవీ రివ్యూ
ABN, Publish Date - Feb 27 , 2026 | 03:42 PM
శ్రీవిష్ణు, నయన్ సారిక జంటగా నటించిన సినిమా 'విష్ణు విన్యాసం'. శుక్రవారం జనం ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉందంటే...
ఈ యేడాది ప్రారంభంలోనే శ్రీవిష్ణు (Srivishnu) 'నారీ నారీ నడుమ మురారి' (Naari Naari Naduma Murari) సినిమాలో గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చి, చక్కని విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అలా కొత్త సంవత్సరానికి శుభారంభం పలికిన శ్రీవిష్ణు నటించిన సినిమాలు ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి. ఈ శుక్రవారం 'విష్ణు విన్యాసం' (Vishnu Vinyasam) విడుదల కాగా, వచ్చే శుక్రవారం 'మృత్యుంజయ్' రిలీజ్ కాబోతోంది. సో... 'విష్ణు విన్యాసం' ఎలా ఉందో తెలుసుకుందాం.
విష్ణు (శ్రీవిష్ణు)కు వాస్తు అంటే పిచ్చి. ఏ పని చేయాలన్నా వాస్తునే ఫాలో అవుతుంటాడు. దానికి తోడు న్యూమరాలజీనీ నమ్ముతుంటాడు. కాలేజీలో జూనియర్ లెక్చరర్‌గా పనిచేస్తున్న అతని జీవితంలోకి ఊహించని విధంగా హెచ్.ఓ.డి. రూపంలో మనీషా (నయన్ సారిక Nayan Sarika) వస్తుంది. ఆమె తనకున్న విపరీతమైన అలవాట్లతో మొదటి రోజే విష్ణుకు షాక్ ఇస్తుంది. దానికి తోడు అతనంటే ఇష్టమనీ చెప్పేస్తుంది. తామిద్దరి జాతకాలు కలవడంతో ఆమెలోని లోటుపాట్లను పక్కన పెట్టి విష్ణు కూడా ఆమెను ప్రేమించడం మొదలు పెడతాడు. ఇక పెళ్ళి చేసుకోవడమే తరువాయి అనుకుంటున్న సమయంలో ఆమెకు రెండు మంగళ సూత్రాల దోషం ఉందని తెలుస్తుంది. వాస్తును, జాతకాలను విపరీతంగా నమ్మే శ్రీవిష్ణు ఈ విషయాన్ని ఎలా డైజెస్ట్ చేసుకున్నాడు? ప్రేమించిన మనీషాను వివాహం చేసుకోవడానికి అతను ఏం చేశాడు? వాళ్ళ పెళ్ళి తర్వాత ఏం జరిగింది? అనేది మిగతా కథ.
వాస్తు, జాతకాల పిచ్చి ఉన్న హీరోల కథలు గతంలో చాలానే వచ్చాయి. అలాంటి పాత్రలనూ మనం చాలా సినిమాల్లో చూశాం. అప్పుడెప్పుడో వచ్చిన రవితేజ (Raviteja) 'వెంకీ' (Venky) సూపర్ హిట్ కాగా, ఈ మధ్యే వచ్చిన ప్రియదర్శి (Priyadarsi) 'సారంగపాణి జాతకం' ఫ్లాప్ అయ్యింది. ఇలాంటి సినిమాలను హీరోలకు ఉన్న జాతకాలు, వాస్తు పిచ్చితో నడిపించి, చివరకు స్వార్థంతో తమ పబ్బం గడుపుకోవడానికి ఎవరో ఎలా ప్రవర్తించినట్టు చూపించడం పరిపాటి. ఈ సినిమాలోనూ అదే జరిగింది. హీరోకు ఉన్న బలహీనతను ఆసరా చేసుకునే వారు ఒకరైతే, హీరోయిన్ ఆస్తిని కాజేయాలని ఆమె జాతకంతో నాటకం ఆడేవారు మరికొందరు. ఈ మొత్తం వ్యవహారం అంతా జాతకాల మీదనే సాగుతుంది. కానీ దానికి సంబంధించిన సన్నివేశాల్లో బలం లేకపోవడంతో సినిమా తేలిపోయింది. కథలో దమ్ములేకపోవడంతో సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ శ్రీవిష్ణు రకరకాల విన్యాసాలు చేయాల్సి వచ్చింది. దీనికి తోడు ప్రథమార్ధంలో హీరోయిన్‌కు అర్థం పర్థం లేని అవలక్షణాలను అంటగట్టి దాని ద్వారా కామెడీ సృష్టించే ప్రయత్నం చేశారు.
నటీనటుల విషయానికి వస్తే ఇది శ్రీవిష్ణు వన్ మ్యాన్ షో. ఎప్పటిలానే తనదైన డైలాగ్ మాడ్యులేషన్‌తో శ్రీవిష్ణు చెలరేగిపోయాడు. కథను అంతగా అతను ఓన్ చేసుకోకపోయి ఉంటే... ఈ మాత్రం రిజల్ట్ కూడా దీనికి దక్కి ఉండేది కాదు. 'క', 'ఆయ్' చిత్రాలతో చక్కని విజయాలను అందుకున్న నయన సారిక ఈ సినిమాలోనూ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆమె పాత్ర చిత్రవిచిత్రమైన పోకడలు పోయినా... తొణక్కుండా బెణక్కుండా పాత్రకు న్యాయం చేయడానికి కృషి చేసింది. ఇందులో ఇతర ప్రధాన పాత్రలను సత్య (Satya), శ్రీనివాసరెడ్డి, గోపరాజు రమణ, ప్రమోదిని, బ్రహ్మాజీ, ప్రవీణ్, సత్యం రాజేశ్, మురళీశర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, వడ్లమాని శ్రీనివాస్ తదితరులు పోషించారు. తెర మీద తారలు చాలామంది కనిపించినా.. వాళ్ళను దర్శకుడు పెద్దంతగా ఉపయోగించుకోలేదు. దానికి ప్రధాన కారణం... ఇందులో సిట్యుయేషనల్ కామెడీ ఉంది తప్పితే... కథ లేదు. సీన్స్ కూడా కొత్తగా లేవు.
యదునాథ్ మారుతీ రావును దర్శకుడిగా పరిచయం చేస్తూ సుమంత్ నాయుడు ఈ సినిమాను నిర్మించారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. రథన్ ట్యూన్స్ చెప్పుకోదగ్గట్టు లేవు. సురేశ్ బొబ్బిలి నేపథ్య సంగీతం బాగుంది. సినిమా నిడివి తక్కువే అయినా ద్వితీయార్థంలో కథ అక్కడక్కడే తిరగడంతో ప్రేక్షకులకు భారంగానే అనిపిస్తుంది. కథను పట్టించుకోకుండా కామెడీని కోరుకునే వారికి, శ్రీవిష్ణు అభిమానులకు ఈ సినిమా ఓ మేరకు నచ్చే ఆస్కారం ఉంది.
ట్యాగ్ లైన్: వ్యర్థ విన్యాసం!
రేటింగ్: 2.5/5