బాలీవుడ్ బ్యాన్.. సడెన్ గా అక్కడ కనిపించిన ధురంధర్ హీరో
ABN , Publish Date - May 26 , 2026 | 04:22 PM
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) పేరు ప్రస్తుతం ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ధురంధర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న రణ్‌వీర్ చిక్కుల్లో పడిన విషయం తెల్సిందే.
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) పేరు ప్రస్తుతం ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ధురంధర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న రణ్‌వీర్ చిక్కుల్లో పడిన విషయం తెల్సిందే. ఫరాన్ అక్తర్ దర్శకత్వం వహిస్తోన్న డాన్ 3 (Don 3) నుంచి చివరి నిమిషంలో తప్పుకోవడంతో బాలీవుడ్ లోని ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్... రణ్‌వీర్ ని మూడేళ్లు బ్యాన్ చేసింది. 'డాన్ 3' వ్యవహారం తేలేవరకూ రణ్‌వీర్ సినిమాల్లో కనిపించడు. ఈ విషయమై ఇండస్ట్రీలో రచ్చ జరుగుతుంటే.. ఈ హీరో మాత్రం అమ్మవారి సేవలో మునిగిపోయాడు. అది కూడా చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి వెళ్ళాడు అని చెప్పొచ్చు.
అసలు విషయం ఏంటంటే.. గతేడాది గోవాలో జరిగిన ఇఫీ (అంతర్జాతీయ చలన చిత్రోత్సవం) ముగింపు వేడుకల్లో రణ్‌వీర్ సింగ్ కాంతార చిత్రంలోని పవిత్రమైన దైవ నృత్య ఘట్టాన్ని వేదికపై అనుకరించడమే కాకుండా, ఆ దైవాన్ని ఉద్దేశించి భూతం అని వ్యాఖ్యానించాడు. దీనిపై కన్నడిగుల సంస్కృతిని, మతపరమైన భావాలను గాయపరిచాడంటూ బెంగళూరుకు చెందిన ఒక న్యాయవాది ఫిర్యాదు చేయడంతో రణ్‌వీర్‌పై కేసు నమోదైంది. అనంతరం ఆయన ఇన్ స్టాగ్రామ్ వేదికగా రిషబ్ శెట్టి నటనపై ఉన్న గౌరవంతోనే అలా చేశానని, ఎవరి మనోభావాలనైనా దెబ్బతీసి ఉంటే క్షమించాలంటూ బహిరంగ ప్రకటన కూడా విడుదల చేశారు.
ఇక రణ్‌వీర్ బహిరంగ క్షమాపణలు చెప్పడంతో కోర్టు ఆయనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేసింది. అంతేకాకుండా.. ఇలాంటి తప్పు ఇంకెప్పుడూ చేయకూడదని ఈ తప్పుకు ప్రాయశ్చిత్తంగా నాలుగు వారాల్లోగా చాముండి కొండలపై వెలిసిన చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకోవాలని ఆదేశించింది. దీంతో కర్ణాటక హైకోర్టు ఆదేశాల మేరకు రణ్‌వీర్ సింగ్ మంగళవారం మైసూరులోని చాముండేశ్వరి దేవి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించాడు. ఎటువంటి హంగూ ఆర్భాటాలు లేకుండా సాదాసీదా భక్తుడిలా ఆలయానికి వచ్చిన రణ్‌వీర్ సాధారణ భక్తులతో కలిసి క్యూలైన్ లో నిలబడి గర్భగుడిలోకి ప్రవేశించి అమ్మవారిని దర్శించుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.