సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని మూవీ రివ్యూ
ABN , Publish Date - Mar 06 , 2026 | 03:51 PM
శివాజీ నటించి నిర్మించిన సినిమా 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని'. శివాజీ, లయ జంటగా నటించిన ఈ క్రైమ్ కామెడీ డ్రామా శుక్రవారం విడుదలైంది.
నటుడు శివాజీ (Shivaji) కి ఇది సెకండ్ ఇన్నింగ్స్. ఇప్పుడు వైవిధ్యభరితమైన పాత్రలతో శివాజీ అదర గొడుతున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో కన్నడ రీమేక్ 'తాజ్ మహల్'ను తెలుగులో నిర్మించి చేతులు కాల్చుకున్నాడు శివాజీ. ఆ చేదు అనుభవంతో మళ్ళీ చిత్ర నిర్మాణం జోలికి పోలేదు. అయితే ఇప్పుడు మళ్ళీ మంచి మంచి అవకాశాలు రావడంతో తనే హీరోగా 'సాంప్రదాయని సుప్పిని సుద్దపూసని' (Sampradayini Suppini Suddapoosani) చిత్రాన్ని నిర్మించాడు. ఈటీవీ విన్ (ETV Win) తో కలిసి శివాజీ నిర్మించిన ఈ సినిమాను బన్నీ వాస్, వంశీ నందిపాటి మార్చి 6న విడుదల చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
శ్రీరామ్ (శివాజీ) హార్స్‌లీ హిల్స్‌లోని గ్రామ సచివాలయంలో అధికారి. నీతికీ, నిజాయితీకి మారు పేరు. అతన్ని ఎన్నో రకాలుగా ప్రలోభపెట్టాలని చూసిన వాళ్ళంతా చివరకు రూటు మార్చుకుంటారు. అయితే శ్రీరామ్ నిజాయితీకి ఇంట్లో భార్య ఉత్తర (లయ Laya) ఎలాంటి విలువ ఇవ్వదు. ఏదో రూపంలో లంచం తీసుకోమని అతన్ని పోరుతూ ఉంటుంది. ఇక వీళ్ళబ్బాయి మిట్టూ (రోహన్)కు రీల్స్ అంటే పిచ్చి. అదే ఊరిలో ఉండే ఎస్.ఐ. (ప్రిన్స్ Prince) ఉమనైజర్. ఒకసారి రోడ్డు మీద శ్రీరామ్‌తో అతను గొడవ పడతాడు. ఆ మర్నాడే శ్రీరామ్ ఇంటి వీధిలోకి వచ్చి, ఉత్తరను చూసి... శ్రీరామ్ కోసం వచ్చానని చెప్పి వారి ఇంటిలోకి అడుగుపెడతాడు. శ్రీరామ్ కోసం ఎస్. ఐ. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడే లోపలకు అడుగుపెట్టిన రోహన్... సరదాగా ఎస్.ఐ. నుండి తుపాకీ తీసుకుని, ఆయనకే గురిపెట్టి కాల్చేస్తాడు. ఇంతలో ఇంటిలోకి అడుగుపెట్టిన శ్రీరామ్ ఎస్. ఐ. శవాన్ని చూసి అవాక్కవుతాడు. జరిగింది తెలుసుకుని పోలీసులకు లొంగిపోదామంటాడు. కానీ అందుకు భార్య ఒప్పుకోదు. చివరకు ఎస్.ఐ. శవాన్ని మాయం చేయాలనే నిర్ణయానికి వస్తారు. ఈ క్రమంలో వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? వాటిని ఎలా అధిగమించారు? ఆ ఊరి ఎమ్మెల్యేకు, ఎస్.ఐ.కు, శ్రీరామ్‌కు మధ్య అసలు ఏం జరిగింది? అనేది అసలు కథ.
పైకి అమాయకంగా కనిపించే భార్యలు... ఆపత్కాలంలో ఎలా క్రిమినల్ నాలెడ్జ్‌తో వ్యవహరిస్తారు? కుటుంబం ఇబ్బందుల్లో ఇరుక్కోకూడదని భావించే భర్తలు ఎలాంటి సాహసాలకు సిద్ధపడతారు? పిల్లలు అమాయకంగా చేసే పనులు ఎలాంటి విపరీతాలకు దారితీస్తాయి? అనేది ఈ సినిమాలో చూపించారు. దీన్ని చూసి ఎంజాయ్ చెప్పాలి తప్పితే... కథగా చెప్పడం చాలా కష్టం. ఈ కథను శివాజీకి వివరించి, ఆయనతో సినిమాను నిర్మించేలా చేసిన దర్శకుడు సుధీర్ శ్రీరామ్ (Sudheer Sriram) ను అభినందించాలి. అనుకోకుండా చేసిన హత్య, మృతదేహాన్ని మాయం చేయడానికి పడే తిప్పలు ఇలాంటి కథాంశంతో గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి. అయితే ఇలాంటివి ఓటీటీ వీక్షకులకు నచ్చినట్టుగా థియేట్రికల్ ఆడియెన్స్‌కు పెద్దంతగా ఎక్కవు. 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' విషయంలోనూ అదే జరిగింది. శవాన్ని మాయం చేసే క్రమంలో దర్శకుడు ఇచ్చే ట్విస్టుల మీద ట్విస్టులను తట్టుకోవడం కూడా ఒకానొక సమయంలో కష్టం అయిపోయింది. ఇన్ని ట్విస్టులు అవసరమా? అనే భావన ప్రేక్షకులకు కలుగుతుంది. ప్రథమార్ధం బాగానే ఉన్నా... ద్వితీయార్ధంలో కథంతా అక్కడక్కడే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇక బండ్ల గణేశ్‌పై చిత్రీకరించిన 'పాయా' పాటను కథలో ఇమడ్చలేక ఎండ్ టైటిల్స్ సమయంలో వేశారు. ఇప్పటికే ఆ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉండటంతో దాన్ని మరోసారి ఓపికగా చూసే వారు కరువయ్యారు.
పరిమితమైన బడ్జెట్‌లో శివాజీ ఈ సినిమాను నిర్మించారు. థియేటర్లలో రిలీజ్ కోసమే ఈ సినిమా తీశారు. కానీ మనసు మార్చుకుని ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యారు. ఈలోగా ఈ సినిమాను చూసిన కొందరి ఇచ్చిన సలహాతో తిరిగి థియేట్రికల్ రిలీజ్‌కు మొగ్గు చివరి క్షణంలో స్ట్రీమింగ్‌ను ఆపేశారు. అలా ఈ శుక్రవారం 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' మూవీని థియేటర్లలో విడుదల చేశారు. నిజం చెప్పాలంటే ఇది ఓటీటీ మూవీనే. ఆ నిర్ణయానికే మేకర్స్ ఫిక్స్ అయిపోయి ఉంటే బాగుండేది.
నటీనటుల విషయానికి వస్తే... ఇలాంటి కామెడీ సినిమాల్లో డ్రామాకు పెద్ద పీట వేస్తారు. ఇందులోనూ అదే జరిగింది. శివాజీ, లయ జంట మధ్య సీన్స్ అన్నీ డ్రమెటిక్‌గానే ఉన్నాయి. లయ ఆ మధ్య వచ్చిన 'తమ్ముడు' (Thammudu) సినిమాలో కంటే ఇందులో బాగుంది. పాత్రలోని గయ్యాళి తనాన్ని బాగానే ప్రదర్శించింది. 'కోర్ట్, దండోరా' సినిమాల్లోని పాత్రలతో పోల్చితే... శివాజీ నటన ఆ స్థాయిలో లేదు. అలానే నైంటీస్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సీరిస్‌లోని రోహన్ పాత్రతో పోల్చితే అతనిది కూడా పేలవంగానే ఉంది. అలీ కామెడీ ట్రాక్ కూడా గొప్పగా లేదు. ఇందులో ప్రిన్స్, శరత్ లోహితశ్వ, కాదంబరి కిరణ్, ధనరాజ్, కమల్, చమ్మక్ చంద్ర, ఇమ్మాన్యుయేల్, అన్నపూర్ణమ్మ, ప్రదీప్, కృష్ణంరాజు... ఇలా చాలామందే నటీనటులు ఉన్నారు. కానీ ఎవరి పాత్రా బలమైన ప్రభావాన్ని చూపించదు. టెక్నీషియన్స్ పరిస్థితి కూడా అంతే. నిర్మాతగా శివాజీకి ఇది సేఫ్ ప్రాజెక్ట్ కావచ్చు కానీ మూవీ అంచనాలను విడుదలకు ముందు పెంచేయడంతో ఆశించిన స్థాయిలో లేదనే అసంతృప్తి ప్రేక్షకులను వెంటాడక మానదు.
రేటింగ్: 2.5/5
ట్యాగ్ లైన్: సుద్దపూసేం కాదు!