Jetlee Movie Review: జెట్లీ మూవీ రివ్యూ
ABN, Publish Date - May 01 , 2026 | 01:42 PM
కమెడియన్ సత్య హీరోగా నటించిన చిత్రం 'జెట్‌లీ'. 'మత్తువదలరా' ఫేమ్ రితేష్ రానా తెరకెక్కించిన ఈ సినిమాతో మిస్ యూనివర్స్ (ఇండియా) రియా సింఘా హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.
కమెడియన్స్ హీరోలుగా మారడం కొత్తేమీ కాదు.. ఆ జాబితాలో తాజాగా 'జెట్‌లీ (Jetlee)' మూవీతో సత్య కూడా చేరాడు. గతంలో 'మత్తు వదలరా', 'హ్యాపీ బర్త్ డే' చిత్రాలను రూపొందించిన రితేష్ రానా దర్శకత్వంలో చిరంజీవి, హేమలత ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమాతో మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
'జెట్‌లీ' కథ విషయానికి వస్తే... లక్షలాది మంది తమ కష్టార్జితాన్ని ప్రజాపతి బ్యాంక్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. దాని ఫౌండర్ అయిన ప్రజాపతి (అజయ్ Ajay) క్రిప్టో కరెన్సీలో ఆ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేసి నష్టపోతాడు. దాంతో బ్యాంక్ దివాలా తీస్తుంది. ఇన్వెస్టర్ల డబ్బులు దాదాపు యాభై వేల కోట్ల రూపాయలు గల్లంతవుతాయి. ఈ తప్పును మరో డైరెక్టర్ మీద వేసిన ప్రజాపతి, తన ప్రాణానికి హాని ఉందని, విదేశాలకు పారిపోతాడు. దాంతో అతన్ని స్పెషల్ బ్రాంచ్‌కు చెందిన బృందం విదేశాలకు వెళ్ళి అరెస్ట్ చేస్తుంది. అక్కడ నుంచి ఇండియాకు ప్రజాపతికి చెందిన ప్రైవేట్ విమానంలోనే తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తుంది. ఆ బాధ్యతను శివానీ రాయ్ (రియా సింఘా Rhea Singha) టీమ్ తీసుకుంటుంది. అయితే... ప్రజాపతి ఇండియాలో అడుగు పెట్టకముందే అతన్ని అంతం చేయాలని ఒక బృందం, అతన్ని ఎలాగైనా సేవ్ చేసి వేరే దేశానికి పంపేయాలని మరో బృందం ప్రయత్నిస్తుంటాయి. ప్రజాపతిని ఇండియాకు తీసుకొచ్చే సమయంలో ఫ్లైట్‌లో అసలు ఏం జరిగిందనేదే ఈ సినిమా! కథ మొదట్లో కొంత నేల మీద నడిచినా... ఆ తర్వాత అంతా గాల్లోనే... విమానంలో జరుగుతుంది. ఈ ఆపరేషన్‌లో డాక్టర్ వేదవ్యాస్ (సత్య Satya) ఎలా ఇన్ వాల్వ్ అయ్యాడు? అతనికీ ప్రజాపతికి ఉన్న సంబంధం ఏమిటీ? గతాన్ని మర్చిపోయిన వేదవ్యాస్ తిరిగి ఎలా తన మెమొరీని రీ-కలెక్ట్ చేసుకున్నాడు? ఈ క్రమంలో జరిగిన పరిణామాలేమిటీ? అనేదే మిగతా కథ.
ఓ చిన్న పాయింట్‌ను తీసుకుని, దానికి సిట్యుయేషనల్ కామెడీతో జత చేసి, రెండు గంటల పదిహేను నిమిషాల సినిమాగా తెరకెక్కించాడు రితేష్ రానా. మూవీ జీడిపాకంలా సాగడంతో చివరకు పంచ్ డైలాగ్స్‌ను సైతం ఆస్వాదించలేని పరిస్థితికి ప్రేక్షకుడు వెళ్ళిపోతాడు. హీరో సత్య క్యారెక్టర్ గతం మర్చిపోయి ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమా ఇంటర్వెల్ వచ్చేసరికీ థియేటర్‌లో ఆడియెన్స్ పరిస్థితి కూడా అంతే! ఏ పాత్ర ఎందుకు అలా బిహేవ్ చేస్తుందో తెలియక తికమకపడిపోతారు. పోనీ సెకండ్ హాఫ్‌లో అయినా వారి ప్రవర్తనకు సరైన రీజన్ చెబుతారా అంటే అదీ లేదు... ద్వితీయార్థాన్ని మరింత కంగాళీగా తీశారు. దానికి తోడు క్లయిమాక్స్‌లో వచ్చే పాట అయితే మరో లెవెల్. దాన్ని తట్టుకోవడం మామూలు విషయం కాదు!
ఒక గొప్ప విషయం ఏమిటంటే... దర్శకుడి మీద నమ్మకం ఉంచి నటీనటులు, సాంకేతిక నిపుణులు తమ వంతు పనితనాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. సత్య మొత్తం సినిమాను తన భుజానికెత్తుకుని ముందుకు తీసుకెళ్ళాడు. అతనికి తోడుగా 'వెన్నెల' కిశోర్ నిలిచాడు. హీరోయిన్ రియా సింఘా యాక్షన్ సీన్స్ అదరగొట్టింది. అజయ్‌కు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే. హోం మినిస్టర్ మేల్కొటేగా వడ్లమాని సాయి శ్రీనివాస్, ప్రజాపతి బ్యాంక్ డైరెక్టర్ గా శుభలేఖ సుధాకర్, మరో కీలక పాత్రలో కబీర్ దుహాన్ సింగ్ నటించారు. ఫ్లైట్‌లో పాసింజర్స్‌గా గుండు సుదర్శన్, శ్రీనివాసరెడ్డి, పైలెట్ గా వైవా హర్ష, న్యూస్ ప్రెజెంటర్‌గా గెటప్ శ్రీను తదితరులు యాక్ట్ చేశారు. అందరూ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. చిత్రం ఏమంటే... సినిమా అయిపోయింది అనుకుంటున్న టైమ్‌లో ఒకప్పటి నటుడు రాజ్ కుమార్ ఎంట్రీ ఇచ్చి హీరో ఎలివేషన్ డైలాగ్స్ ఓ రేంజ్‌లో చెబుతాడు. అది చాలదన్నట్టుగా ఆ తర్వాత ప్రమోషనల్ సాంగ్ వస్తుంది. ఆపైన శుభం కార్డు పడుతుంది.
ఎంతకూ ముందుకు కదలని కథ, విసుగు తెప్పించే సన్నివేశాల కారణంగా నటీనటుల, సాంకేతిక నిపుణుల ప్రతిభ బూడిదలో పోసిన పన్నేరే అయ్యింది. కాలభైరవ నేపథ్య సంగీతం బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో సీన్స్‌ను ఎలివేట్ చేశాడు. చాలా చోట్ల కేవలం సైగలకు కూడా అర్థవంతమైన ఆర్. ఆర్. ఇచ్చాడు. లిమిటెడ్ స్పేస్‌లో సినిమాటోగ్రాఫర్ సురేశ్ సారంగం తన ప్రతిభను కనపరిచాడు. మేకింగ్ పరంగా ఎలాంటి వంకా పెట్టడానికి లేదు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రెజెంటేషన్‌లో చెర్రీ, హేమలత ఈ సినిమాకు అవసరమైన దాని కంటే ఎక్కువే ఖర్చు పెట్టారు. ఎటొచ్చి కథను జడ్జ్ చేసుకోవడంలోనే అట్టర్ ఫెయిల్ అయ్యారు. మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న చెర్రీకి, మైత్రీ మూవీస్ వారికి ఈ కథ ఎలా నచ్చిందనే విషయం బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థం కాదు. కథే లేకుండా కేవలం కామెడీ సీన్స్ రాసుకుని ఎంతో ఓవర్ కాన్ఫిడెన్స్ తో దర్శకుడు రితేష్ రానా సినిమా తీసినట్లుంది. ఎంత గాల్లో తీసిన సినిమా అయినా నేలవిడిచి సాము చేస్తామంటే కుదరదు కదా! అందుకే 'జెట్లీ' సినిమా థియేటర్లలో నిరాశతో కూడిన నిట్టూర్పులు, అసహనంతో వచ్చిన అరుపులు వినిపిస్తున్నాయి.
రేటింగ్: 2/5
ట్యాగ్ లైన్: ఆకాశంలో అసహనం!