Sardar 2 Review: కార్తీ సర్దార్ 2 మూవీ రివ్యూ
ABN, Publish Date - Sep 10 , 2026 | 02:22 PM
కార్తీ ద్విపాత్రాభినయం చేసిన 'సర్దార్' కు సీక్వెల్‌గా వచ్చిన చిత్రం 'సర్దార్ 2'. పి.ఎస్. మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ సీక్వెల్ గురువారం జనం ముందుకు వచ్చింది.
హీరో కార్తీ, డైరెక్టర్ పి. ఎస్. మిత్రన్ కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం 'సర్దార్'. 2022 దీపావళి కానుకగా వచ్చిన ఆ మూవీలో కార్తీ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశాడు. ఈ స్పై థ్రిల్లర్ మూవీ ఫర్వాలేదనిపించింది. దాని సీక్వెల్ గా వచ్చిన 'సర్దార్ 2' గురువారం తమిళ, తెలుగు భాషల్లో విడుదలైంది. తొలి చిత్రాన్ని నిర్మించిన ఎస్. లక్ష్మణ్ కుమార్ ఈ సీక్వెల్ ను పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలోనే నిర్మించారు. మరి కార్తీ ద్విపాత్రాభినయం చేసిన ఈ సీక్వెల్ ఎలా ఉందో తెలుసుకుందామా!?
రా ఏజెంట్ విజయ్ (కార్తీ) మీద పెద్దంత విశ్వాసంలేని చీఫ్ బొమ్మై (ఆషిష్ విద్యార్థి) అతన్ని లూప్ లైన్‌లో పెడతాడు. తనలాంటి మరో ఇద్దరి (యోగిబాబు, నిళల్‌గళ్ రవి)తో కలిసి విజయ్ అప్పటికే కనిపించకుండా పోయిన రా ఏజెంట్ వాల్రస్ (అచ్యుత్ కుమార్)ను వెతికే పనిలో పడతాడు. ఇంటర్నేషనల్ అండర్ వరల్డ్ డాన్ బ్లాక్ డగ్గర్ (ఎస్.జె.సూర్య) మనుషుల చేతిలో చనిపోతూ, విజయ్ కు తన దగ్గర ఉన్న ఓ 'కీ'ని ఇచ్చిన వాల్రస్ కన్నుమూస్తాడు. దీనికి కొద్దిరోజుల ముందే అలాంటి మరో 'కీ' చనిపోయే ముందు మరో 'రా' ఏజెంట్ (మాళవిక మోహనన్) తన కూతురు ఫైజా (ఆషిష్ రంగనాథ్)కు ఇస్తుంది. ఇలాంటి ఇంకో 'కీ' డి.ఆర్.డి.వో. ఛీఫ్ టైగర్ హరిశ్చంద్ర (బాబు ఆంటోనీ) దగ్గర ఉందని దానిని కూడా సంపాదిస్తే... ఈ దేశాన్ని ఓ పెద్ద విపత్తు నుంచి కాపాడవచ్చని విజయ్ భావిస్తాడు. అయితే విజయ్ కంటే ముందే బ్లాక్ డగ్గర్ ఆ 'కీ'ని సొంతం చేసుకుని, ఈ దేశాన్ని నాశనం చేయడానికి సిద్థమౌతాడు. బ్లాక్ డగ్గర్ ను ఎదుర్కొవడం లో విజయ్ విఫలమైనప్పుడు ఊహించని విధంగా అతని తండ్రి సర్దార్ (కార్తీ) రంగంలోకి దిగుతాడు. ప్రభుత్వం దృష్టిలో చైనాలో చనిపోయిన సర్దార్ ఎలా బతికి బయటపడ్డాడు? బ్లాక్ డగ్గర్ సృష్టించబోతున్న మారణ హోమం గురించి సర్దార్ కు ఎలా తెలిసింది? బయో వెపన్ ను నిర్వీర్యం చేయడానికి ఈ తండ్రీ కొడుకులు ఏం చేశారు? అనేది మిగతా కథ.
దర్శకుడు పి.ఎస్. మిత్రన్ తన సినిమాల ద్వారా సాధారణ ప్రజలలో ఏదో ఒక అంశంపై అవగాహన కల్గించడానికి కృషి చేస్తుంటారు. 'సర్దార్' మూవీలో డ్రింకింగ్ వాటర్ మాఫియా గురించి చెప్పిన మిత్రన్... ఈ సీక్వెల్ లో మనం తినే ఆహారం ఎంతగా కలుషితం అయిపోయింది? విపరీతంగా మందుల వాడకం కారణంగా మన శరీరం ఎలా నిర్వీర్యం అయిపోతోందన్నది తెలియ చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఆయన చెప్పే విషయాల్లోని మంచిని సగటు ప్రేక్షకుడు ఎంత వరకూ ఆచరిస్తాడనేది పెద్ద ప్రశ్న.
ఇక సినిమా విషయానికి వస్తే... 'సర్దార్'తో పోల్చినప్పుడు ఈ సీక్వెల్ తేలిపోయింది. మొదటి చిత్రంలో హ్యూమన్ ఎమోషన్స్ కు, భార్యభర్తల అనుబంధానికి మిత్రన్ పెద్ద పీట వేశారు. ముఖ్యంగా ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా దేశం కోసం ప్రాణత్యాగానికి సిద్థపడే సీక్రెట్ ఏజెంట్ సర్దార్ గా కార్తీ నటన ఓ రేంజ్‌లో ఉంటుంది. అతని కొడుకు విజయ్ పాత్రను అందులో సరదాగా చూపించారు. దాంతో 'సర్దార్' కోసం ఎంచుకున్న కథ సీరియస్ దే అయినా... సరదా సరదాగా మూవీ సాగిపోయింది. ప్రేక్షకులు దానిని ఇష్టపడ్డారు. కానీ 'సర్దార్ 2' దగ్గరకు వచ్చే సరికీ ఆ ఎమోషన్ మిస్ అయ్యింది. ఒక ప్యాట్రన్‌లో దర్శకుడు సినిమాను నడిపించాడు. జపాన్ నుంచి పొరపాటున ఇండియా వచ్చిన బయో వెపన్‌కు విరుగుడు కోసం 'రా' టీమ్ జపాన్ వెళ్ళడం, దాన్ని తీసుకొచ్చే క్రమంలో జరిగే పొరపాటు, ఆ కారణంగా మూడు వేలమంది గిరిజనులు మృతి చెందడం, ఆ కుటుంబాలకు చెందిన ఒక వ్యక్తి ప్రతి నాయకుడిగా మారి 'రా' ఏజెంట్‌ను అంతం చేయడంతో పాటు ఈ దేశం మీదనే పగ తీర్చుకోవాలనుకోవడం ఇవేవీ కన్వెన్సింగ్ గా అనిపించవు.
'సర్దార్ 2' సినిమా ఒక ఫ్లో లో ఎక్కడా బోర్ కొట్టకుండా సాగిపోయినా... తెర మీద జరిగే తంతు అంతా యాంత్రికంగా ఉంది. నటీనటుల నటన, సాంకేతిక నిపుణుల పనితనం కూడా ఏమంత గొప్పగా లేవు. అవీ రొటీన్ గానే సాగాయి. సినిమా మొత్తం మీద ఒక్కటంటే ఒక్కటి కూడా హై మూమెంట్ అనేది లేదు. 'రా' ఏజెంట్స్ పై తీసిన సినిమాను మరీ ఇంత 'రా'గా తీయడం అవసరమా అనిపిస్తుంది. ఇందులో చెప్పుకోవడానికి ముగ్గురు మహిళలు... ఆషికా రంగనాథ్, రజిషా విజయన్, మాళవిక మోహనన్ కీలక పాత్రలు పోషించారు. కానీ ఎవరి పాత్ర పూర్తి స్థాయిలో ఉన్నట్టుగా అనిపించదు. సినిమా ప్రారంభం విజయ్ పాత్రతో మొదలైనా సర్దార్ ఎంట్రీతో అతని పాత్రే కీలకంగా మారింది. మొదటి చిత్రంలో మాదిరే ఇందులోనూ కార్తీ తండ్రి పాత్రలో మెప్పించాడు. ఎస్.జె. సూర్య ఎప్పటిలానే ఓవర్ యాక్షన్ చేశాడు. ప్రధాన ప్రతినాయకుడైన అతని పాత్రను కూడా దర్శకుడు ఏమంత గొప్పగా రాసుకోలేదు. కొన్ని చోట్ల సూర్య నటన ఏకపాత్రాభినయాన్ని తలపిస్తుంది. ఇతర ప్రధానపాత్రలను అచ్యుత్ కుమార్, ఆశిష్ విద్యార్థి, నాజర్, నిళల్‌గళ్ రవి, దేవదర్శిని, యోగిబాబు, అవినాశ్, మనీష్ కాంత్, బాలాజీ శక్తివేల్, బాబు ఆంటోని తదితరులు పోషించారు. సంభాషణలు అక్కడక్కడా నవ్వు తెప్పిస్తాయి. యోగిబాబు చెప్పే డైలాగ్సే ప్రేక్షకులకు కాస్తంత రిలీఫ్. సామ్ సి.ఎస్. సంగీతం ఫర్వాలేదు. కానీ ప్రేక్షకులను ఆకట్టుకునే పాటలకు ఆస్కారమే లేకుండా పోయింది. ఇందులో ఉన్నది ఒకే ఒక్క బ్యాక్ గ్రౌండ్ సాంగ్. జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ బాగుంది. భారతదేశం ఉనికి ప్రమాదంలో పడినప్పుడు 'సర్దార్' అనే రా ఏజెంట్ యువకుడిగా ఉన్నప్పుడు, వృద్ధుడయ్యాక ఎలా తన ప్రాణాలను పణంగా పెట్టి కాపాడాడు అనేది ఇందులో ప్రధానాంశం. అయితే కథలో కొత్తదనం లేకపోవడం, కథనం ఆసక్తిని కలిగించకపోవడంతో ప్రేక్షకులను మెప్పించడంలో 'సర్దార్ 2' విఫలమైంది.
ట్యాగ్ లైన్: రొటీన్ స్పై డ్రామా!
రేటింగ్ : 2.25/5