'కపుల్ ఫ్రెండ్లీ'.. సినిమా రివ్యూ
ABN, Publish Date - Feb 14 , 2026 | 05:34 AM
సంతోష్ శోభన్(Santosh Sobhan), మాసన వారణాసి (Manasa Varanasi) జంటగా నటించిన చిత్రం 'కపుల్ ఫ్రెండ్లీ’. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో యు.వి. కాన్సెప్ట్స్ సంస్థ దీనిని నిర్మించింది. ఈ సినిమా టైటిల్ రివీల్ చేసినప్పటి నుంచి మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ మధ్యనే విడుదల చేసిన ట్రైలర్‌తో మరింత క్రేజ్ పెరిగింది. రొమాంటిక్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ శనివారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రేక్షకుల్ని ఏ మేరకు ఇది మెప్పించిందో చూద్దాం.
సినిమా రివ్యూ: కపుల్ ఫ్రెండ్లీ
సంతోష్ శోభన్(Santosh Sobhan), మాసన వారణాసి (Manasa Varanasi) జంటగా నటించిన చిత్రం 'కపుల్ ఫ్రెండ్లీ’. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో యు.వి. కాన్సెప్ట్స్ సంస్థ దీనిని నిర్మించింది. ఈ సినిమా టైటిల్ రివీల్ చేసినప్పటి నుంచి మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ మధ్యనే విడుదల చేసిన ట్రైలర్‌తో మరింత క్రేజ్ పెరిగింది. రొమాంటిక్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ శనివారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రేక్షకుల్ని ఏ మేరకు ఇది మెప్పించిందో చూద్దాం. (Couple friendly Review)
కథ: (Couple Friendly Review)
శివ (సంతోష్ శోభన్) నెల్లూరులో బడ్డింగ్ ఇంటీరియర్ డిజైనర్. సరైన జాబ్ లేక ఖాళీగా తిరుగుతుంటాడు. అదే కారణంలో లవర్ బ్రేకప్ చెప్పి వెళ్లిపోతుంది. ఇక ఖాళీగా ఉండే కుర్రాళ్ల పరిస్థితి ఇంట్లో ఎలా ఉంటుందో, శివది కూడా అలాంటి పరిస్థితే. తండ్రి తిట్టడంతో కోపంతో ఇల్లు వదిలి చెన్నైలో వాలిపోతాడు. అక్కడ కూడా కష్టాలే! రోజు గడవడం కోసం బైక్ పూలింగ్ చేస్తూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటాడు. ఆ తరుణంలో చిత్తూరుకు చెందిన మిత్ర (మానస వారణాసి) పరిచయమవుతుంది. బీటెక్ పూర్తి చేసి హాస్టల్‌లో ఉంటూ జాబ్ ప్రయత్నాల్లో ఉంటుంది. పెళ్లి చూపుల కోసం ఊరు వెళ్లే సందర్భంలో హాస్టల్ ఖాళీ చేయాల్సి వస్తుంది. పెళ్లి వద్దనుకుని ఎక్కిన బసు దిగి హాస్టల్‌కి రాగా రూమ్స్ ఖాళీ ఉండవు. దాంతో శివ ద్వారా హాస్టల్ ప్రయత్నాలు చేసి విఫలం కాగా, తన రూమ్‌లోనే పెయింగ్ గెస్ట్‌గా పెట్టుకుంటాడు. ఆమె రాకతో శివ జీవితం మారుతుంది. అతను ఇంటీరియర్ డిజైనర్‌గా బిజీ అవుతాడు. ఇద్దరూ ప్రేమలో పడతారు. అంతా బావుంది అనుకుంటున్న తరుణంలో చిన్న కుదుపు. అంతా తారుమారు అవుతుంది. మిత్రకు వచ్చిన సమస్య ఏంటి? శివ, మిత్ర ఒకటయ్యారా లేదా? అన్నది మిగతా కథ.
విశ్లేషణ:
నిరుద్యోగ యువకుడు ఇంట్లో ఉంటే పరిస్థితులు ఎలా ఉంటాయో చూపిస్తూ సినిమా ప్రారంభమౌతుంది. ఖాళీగా ఉంటున్నాడనే కారణంతో తండ్రితో చివాట్లు, గర్ల్‌ఫ్రెండ్ బ్రేకప్‌తో నెల్లూరులో మొదలైన కథ కాసేపటికే చెన్నైకి షిప్ట్ అవుతుంది. మిత్రతో పరిచయం తర్వాత ఈ జంట సాగించే ప్రేమ, లివిన్ రిలేషన్, ఫిజికల్ కాంటాక్ట్, మరో పక్క ఉద్యోగం, బాధ్యతలు కాస్తంత సీరియస్‌గా సాగినా ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా ఉంది. ప్రథమార్ధంలో సగ భాగం హీరోహీరోయిన్లు బైక్ మీద తిరుగుతూనే కనిపిస్తారు. ఆ సీన్స్ ఎక్కడా బోర్ కొట్టవు. అయితే వేర్వేరు వ్యక్తులతో వీళ్ళ పెళ్లి అంటూ పెద్దల ఎంట్రీ, ఆపైన హీరోయిన్ వైపు నుండి మరో పెద్ద కుదుపుతో కథ రసకందాయంలో పడుతుంది. అక్కడి నుంచి ప్రతి సన్నివేశాన్ని దర్శకుడు బ్యాలెన్స్‌గా తెరకెక్కించాడు. సినిమా ప్రారంభం నుంచే ఓ పక్క చెన్నైలో సీన్స్ చూపిస్తూనే మరో పక్కన హీరోహీరోయిన్‌లను కేరళలో టైమ్‌లైన్ చేశాడు. ఏదో ట్విస్ట్ ఉందని తెలియజేసి దాని కోసం ఆసక్తిగా ఎదురుచూసేలా చేశాడు. అయితే ఈ సస్పెన్స్‌లో ఇంటెన్స్ ఇంకాస్త పెంచితే బావుండేది. క్లైమాక్స్ ట్విస్ట్‌తో ప్రేక్షకుల గుండెల్లో బరువు నింపాడు. పతాక సన్నివేశాలను చాలా మెచూర్డ్‌గా తెరకెక్కించాడు. హీరోహీరోయిన్లు ఒకే ఇంట్లో ఉండటం ప్రేమలో పడటం పెళ్లి వరకూ వెళ్లడం లాంటి కథలు టాలీవుడ్‌లో చాలానే వచ్చాయి. కానీ ఇక్కడ ఇద్దరిలో ఒకరికి కష్టం వచ్చినప్పుడు ఇద్దరూ ఎలా ముందుకెళ్లారు అన్నది దర్శకుడు హృద్యంగా చూపించాడు. ప్రేమంటే ఏదో ఆకర్షణ అని కాకుండా... పెద్ద బాధ్యత అని చివరి సీన్‌లో చెప్పాడు.
నటుడిగా సంతోష్ శోభన్ ఇంతవరకూ పక్కింటి అబ్బాయి పాత్రలే ఎక్కువగా చేశాడు. ఇది కూడా అలాంటిదే. కాకపోతే అతను కనిపించి తీరు కొత్తగా ఉంటుంది. శివ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. క్యూట్ లవ్‌స్టోరీ కావడంతో ఇందులో డాన్స్‌లకు, యాక్షన్‌కు అసలు స్కోప్ లేదు. క్యారెక్టర్‌లో ఉన్న ఎమోషన్స్‌ను చక్కగా క్యారీ చేశాడు. హీరోయిన్‌గా మానస వారణాసి ఈ సినిమాకు పెద్ద ఎసెట్. నటిగా తనకు పేరు పెట్టడానికి లేదు. అందంగానే కాదు చక్కని అభినయంతో అలరించింది. భారమైన సన్నివేశాల్లోనూ తన శక్తి మేరకు భావోద్వేగాలను పండించింది. ఆమె తొలి చిత్రం 'దేవకీ నందన వాసుదేవ’తో కంపేర్ చేస్తే చాలా మెచూర్డ్‌గా నటించింది. హీరో తండ్రిగా గోపరాజు రమణ, హీరోయిన్ తండ్రిగా రాజీవ్ కనకాల తమ పాత్రలకు న్యాయం చేశారు. యోగిబాబు ట్రాక్ ఫర్వాలేదనిపిస్తుంది. మిగతా ఆర్టిస్ట్‌లు అంతా ఓకే.
'కపుల్ ఫ్రెండ్లీ' సినిమాకు మరో హైలైట్ సినిమాటోగ్రఫీ. దినేష్ పురుషోత్తమన్ కలర్‌ఫుల్‌గా మూవీని తెరకెక్కించారు. ఎక్కువశాతం చెన్నై నేపథ్యంలో సాగే సినిమా కాబట్టి కథానుగుణంగా లొకేషన్‌లను చాలా నేచురల్‌గా చూపించారు. ఆదిత్య రవీంద్రన్ నేపథ్య సంగీతం బావుంది. ఎమోషనల్ సీన్స్‌లో రీ–రికార్డింగ్ చక్కగా ఉంది. సంభాషణలు బావున్నాయి. అయితే ఈ తరహా లవ్‌స్టోరీలకు పాటలు, అందులోనూ మెలోడీస్ ఉంటే సినిమాకు ప్లస్ అయ్యేది. ఇందులో అది మిస్ అయింది. ప్రథమార్ధం ద్వితీయార్ధంలో అక్కడక్కడా మినహా ఎడిటింగ్ క్రిస్ప్‌గానే ఉంది. యు.వి. సంస్థకు తగ్గట్టే నిర్మాణ విలువలున్నాయి. దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ చేసిన జెన్యూన్ అటెంప్ట్ ఇది. అయితే ఈ లవ్‌స్టోరీకి శాడ్ ఎండింగ్ ఇవ్వడాన్ని ప్రేక్షకులు ఎలా తీసుకుంటారో చూడాలి. ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా చూస్తే నచ్చే ఆస్కారం ఉంటుంది.
రేటింగ్: 3/5
ట్యాగ్‌లైన్: ఎమోషనల్ లవ్ డ్రామా!