Razor Review: రవిబాబు 'రేజర్' సినిమా ఎలా ఉందంటే..
ABN, Publish Date - May 08 , 2026 | 05:42 PM
'అల్లరి'తో దర్శకుడిగా మారిన రవిబాబు... ఇప్పటి వరకూ డిఫరెంట్ జానర్స్ లో సినిమాలు తీశారు. ఆయన తాజా చిత్రం 'రేజర్' శుక్రవారం జనం ముందుకు వచ్చింది. రవిబాబుతో కలిసి సురేశ్ బాబు నిర్మించిన ఈ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ ఎలా ఉందో చూద్దాం.
రవిబాబు 'రేజర్' మూవీ రివ్యూ (Razor Movie Review)
రిలీజ్ డేట్: 08-05-2026
ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత రవిబాబుకు (Ravi Babu) తెలుగు సినిమా రంగంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తొలి చిత్రం 'అల్లరి'తో దర్శకుడిగా మారిన రవిబాబు... ఇప్పటి వరకూ డిఫరెంట్ జానర్స్ లో సినిమాలు తీశారు. ఆయన తాజా చిత్రం 'రేజర్' శుక్రవారం జనం ముందుకు వచ్చింది. రవిబాబుతో కలిసి సురేశ్ బాబు నిర్మించిన ఈ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ..
ముఖ్యమంత్రి సీటుపై కన్నేసిన హోమ్ మినిస్టర్ కనకరాజు (వీరన్న చౌదరి), ఆయన కొడుకులు సి.ఎం (రామరాజు)ను ఆయన ఫామ్ హౌస్ లోనే హత్య చేస్తారు. పక్కన ఉన్న ఫామ్ హౌస్ సి.సి. కెమెరాలో ఇది రికార్డ్ అవుతుంది. దానిని గుర్తించిన సి.సి. కెమెరా నిర్వాహకుడు విష్ణుధర్ (తనీశ్)ని, అతని భార్యను, విషయం తెలిసిన తనీశ్ ఫ్రెండ్ ను హోమ్ మంత్రి తనయులు చంపేస్తారు. తల్లిదండ్రుల హత్యను తనీశ్ ఏడేళ్ళ పాప తేజు చూస్తుంది. అయితే ఆ సమయానికి వారి ఇంటికి వచ్చిన డాగ్ గ్రూమర్ రేజర్ (రవిబాబు) పాప ప్రమాదంలో ఉందని గమనించి తనని చంపటానికి వచ్చిన హోమ్ మినిస్టర్ కనకరాజు మనుషులను అడ్డుకుంటాడు. ఆ తర్వాత పాప రక్షణ బాధ్యత తీసుకుంటాడు. తనీశ్ హోమ్ మినిస్టర్, అతని కొడుకులు హత్య చేసిన దృశ్యాలను చిప్ లో కాపీ చేసి దానిని కోడ్ వర్డ్స్ తో భద్ర పరుస్తాడు. ఆ పుటేజ్ ను చేజిక్కించుకుని, పాపను చంపాలనుకున్న హోమ్ మినిస్టర్ కు రేజర్ అలియాస్ రుద్ర ఎలా చెక్ పెడతాడు? అసలు రుద్ర ప్లాష్ బ్యాక్ ఏంటి!? చివరకు హోమ్ మినిస్టర్ బండారం బయటపడుతుందా!? అన్నదే కథ
విశ్లేషణ:
గతంలో ఈ తరహా కథాంశంలో పలు చిత్రాలు వచ్చాయి. అయితే ట్రైలర్ చూసిన తర్వాత రవిబాబు ‘అనసూయ’లో లాగా కొత్తగా ఏదైనా చెబుతాడేమో అనిపించింది. కానీ సినిమా అంతా రొటీన్. పాపను చంపాలనుకునే హోమ్ మినిస్టర్, అతని మనుషులను ఊచకోత కోస్తూ కాపాడటమే. సినిమా మొత్తం రక్తపాతమే. హిందీలో వచ్చిన ‘కిల్’, మలయాళ చిత్రం ‘మార్కో’ తరహాలో పూర్తిగా బ్లడ్ బాత్ తో నిండిందీ రేజర్. అయితే ఆ సినిమాలు గ్రిప్పింగా ఉండి చూస్తున్నంత సేపు తర్వాతేం జరుగుతుందనే ఉత్కంఠ కలుగుతుంది. కానీ రేజర్ విషయం అలా కాదు. నిడివి తక్కువ ఉన్నా చాలా పెద్ద సినిమా చూశామనే భావన కలుగుతుంది. ఫైట్ సీక్వెన్స్ అన్నీ ఓవర్ అనిపిస్తాయి. ఈ సినిమాలో రవిబాబు కాకుండా వేరే మాస్ హీరో ఎవరైనా చేస్తే బాగుండి ఉండేదేమో అనిపించింది.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు
ఈ సినిమాకు ఆల్ ఇన్ వన్ రవిబాబునే. అయితే నటుడుగా తన ఫేస్ లో ఎక్స్ ప్రెషన్స్ లేక పోవడం పెద్ద డ్రా బ్యాక్. సినిమా మొత్తం ఒకే ఎక్స్ ప్రెషన్ ఉంటుంది. మిగిలిన నటీనటుల విషయానికి వస్తే ప్యాష్ బ్యాక్ లో రవిబాబు పెయిర్ గా మీనా వాసు నటించింది. తనీశ్ కి చిన్నదైనా మంచి పాత్ర లభించింది. బెనర్జీ కూడా ఉన్నంతలో బాగానే చేశాడు. తేజు పాత్రలో నటించిన పాప క్యూట్ గా ఉంది. గతంలో రవిబాబు సినిమాలను చూస్తే గ్రిప్పింగా ఉండి ఆకట్టుకునేలా ఉంటాయి. ఆ గ్రిప్ ఈ సినిమాలో కనిపించలేదు. స్పెషల్ కమెండోస్ హీరో ఉన్న హాస్టల్ ను చుట్టిముట్టినపుడు చేతిలో టార్చ్ తో వారిని తరిమేసిన సీన్ ఒక్కటి చాలు సినిమా లూప్ హోల్ గురించి చెప్పుకోవడానికి. అంతే కాదు పదుల సంఖ్యలో రౌడీలను ఎదుర్కొని సింగిల్ హ్యాండ్ గా మట్టికరిపించే సన్నివేశాలను భరించటం చాలా కష్టం. అయితే చరణ్ కెమెరా వర్క్ తో పాటు రాజేష్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపిస్తాయి. మొత్తానికి రవిబాబు గ్యాప్ తర్వాత చేసిన ఓ వ్యర్ధ ప్రయత్నం ఈ ‘రేజర్’ అనిపించక మానదు.
రేటింగ్: 2.25 / 5
ట్యాగ్ లైన్: రేజర్… మితిమీరిన హింస