I, Nobody: పృథ్వీరాజ్ సుకుమారన్... ఐ, నోబడీ మూవీ రివ్యూ
ABN , Publish Date - Jul 10 , 2026 | 07:08 AM
పృథ్వీరాజ్ సుకుమారన్ 'ఐ, నోబడీ' సినిమా ఎలా ఉందంటే...
నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ తన సత్తాను చాటుకుంటున్నాడు మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. 'లూసిఫర్, ఎల్2: ఎంపురాన్' వంటి సినిమాలతో తెలుగు వారికి దగ్గరయ్యాడు. 'ది గోట్ లైఫ్'మూవీ కోసం అద్భుతమైన మేకోవర్ చేసిన పృథ్వీరాజ్ సినిమా అంటే సమ్ థింగ్ స్పెషల్ అనే భావన తెలుగు వారికి కలిగింది. ఇప్పుడు రాజమౌళి మాగ్నమ్ ఓపస్ మూవీ 'వారణాసి'లో నటిస్తుండటంతో అతనిపై తెలుగు సినిమా ప్రేక్షకుల ఫోకస్ మరింత పెరిగింది. మరి తెలుగులో డబ్ అయిన పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) తాజా మలయాళ చిత్రం ఐ, నోబడీ (I, Nobody) ఎలా ఉందో తెలుసుకుందాం.
రాజీవ్ (పృథ్వీరాజ్ సుకుమారన్), మీరా (పార్వతి తిరువోతు) మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన భార్యాభర్తలు. వారికి ఇద్దరు అమ్మాయిలు. మీరా ప్రైవేట్ జాబ్ చేస్తుంటే, రాజీవ్ ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంటాడు. ఓ రోజు అతనో బ్యాంక్‌కు వెళ్ళినప్పుడు అక్కడకు ముగ్గురు వ్యక్తులు వచ్చి, 17 కోట్ల రూపాయలను దోచుకుని వెళ్తారు. అక్కడ నుంచి తప్పించుకునే సమయంలో రాజీవ్ ముఖానికి ముసుగువేసి అతన్నీ తమతో తీసుకెళతారు. మార్గం మధ్యలో రాజీవ్ ను దించేసి, తమ దారిన తాము వెళ్ళే క్రమంలో రాజీవ్ తిరుగుబాటు చేయడంతో వారి కారు బోల్తా పడి దోపిడి దొంగలు ముగ్గురూ దుర్మరణం పాలౌతారు. అయితే ఆ కారులో వీళ్ళు దొంగిలించిన 17 కోట్ల రూపాయల డబ్బు ఉండదు. బ్యాంక్ నుంచి దోచుకున్న ఆ డబ్బులు వాళ్ళు ఎక్కడ పెట్టారో తెలుసుకోవడానికి పోలీసులు రంగంలోకి దిగుతారు. వాళ్ళ అనుమానం రాజీవ్ మీద పడుతుంది. అతను కూడా దోపీడీ దొంగల బృందానికి చెందిన వాడేమోననే అనుమానంతో ఇన్వెస్టిగేటివ్ పేరుతో అతన్ని మానసిక హింసకు గురిచేస్తారు. అప్పటి వరకూ నోబడీగా ఉన్న రాజీవ్‌ను ఈ సొసైటీ ఎలా ట్రీట్ చేసింది? 17 కోట్ల దొంగగా ముద్రపడిన అతనితో ఎవరెవరు, ఎలా ప్రవర్తించారు? నడిరోడ్డు మీద అతన్ని ఎలా వెంటాడి, వేటాడే ప్రయత్నం చేశారు? చివరకు ఈ నోబడీ వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను ఎలా కుదిపేసింది? అనేది మిగతా సినిమా. I, Nobody Review
పైకి బ్యాంక్ రాబరీ ఇన్వెస్టిగేటివ్ డ్రామాగా కనిపించినా, 'ఐ, నోబడీ'లో చాలా లేయర్స్ ఉన్నాయి. దోచిన డబ్బు ఎలా మాయమయ్యిందనేది ఒక లేయర్ అయితే, దానికి సహకరించి వ్యక్తులకు సంబంధించిన అగచాట్లు మరో లేయర్. విడాకుల వరకూ వెళ్ళిన రాజీవ్, మీరా పర్సనల్ ఇష్యూస్ ఇంకో లేయర్ కాగా దోపిడీ దొంగగా రాజీవ్ మీద బలమైన ముద్రవేసి సమాజం ముందు అతన్ని దోషిగా నిలబెట్టే మీడియా వైఖరి మరో లేయర్. కూతురు కిడ్నాప్ డ్రామాతో ఈ కథకు ఫుల్ స్టాప్ పెట్టాలని రాజీవ్ భావించినా, అది మరో మలుపు తీసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. సినిమా క్లయిమాక్స్ కు వచ్చే సరికీ అందరి దృష్టిలోనూ 'తప్పుచేయని మనిషి'గా రాజీవ్ పై సానుభూతి కలిగించడం విశేషం. 'నోబడీ' నుంచి 'సమ్ బడీ'గా మారిన రాజీవ్‌పై నుంచి సమాజం దృష్టిని మరల్చడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వేసే ఎత్తుగడ అసలు సిసలు కొసమెరుపు. చిత్రం ఏమిటంటే... బ్యాంక్ నుంచి దుండగులు దోచుకున్న 17 కోట్లు ఏమయ్యాయి? అనేది చివరకు ప్రాధాన్యం లేని విషయంగా మారిపోవడం ఐరనీ!
ఓ సమస్యలో ఇరుక్కున్న వ్యక్తిని ఈ సిస్టమ్ ఎలా ట్రీట్ చేస్తుంది? అతన్ని మీడియా, ప్రభుత్వం ఎలా కార్నర్ చేస్తాయి? ఆ వ్యక్తి సమస్యను అడ్డం పెట్టుకుని తమ స్వార్థ ప్రయోజనాలను కొందరు వ్యక్తులు ఎలా నెరవేర్చుకోవాలనుకుంటారు? అనే దాన్ని దర్శకుడు నిషమ్ బషీర్ ఆసక్తికరంగా తెరకెక్కించాడు. బ్యాంక్ రాబరీతో మొదలయ్యే ఈ సినిమా ఓ ట్రెజర్ హంట్‌గా మారడం బాగుంది. అయితే ద్వితీయార్థంలో ఓ వ్యక్తిని ఈ సిస్టమ్ ఎలా టార్చర్ చేస్తుందనే అంశానికి దర్శకుడు ప్రాధాన్యం ఇవ్వడంతో నిదానంగా గ్రిప్ సడలిపోయింది. అలా ముందుకు సాగి, చివరకు ఓ పొలిటికల్ డ్రామాగా దీన్ని దర్శకుడు ముగించాడు. దాంతో ప్రేక్షకులు కొంత అసహనానికి గురౌతారు. పైగా సినిమా ప్రారంభం నుంచి చివరి వరకూ పోరాట సన్నివేశాలతో నిండిపోవడం కూడా చికాకు తెప్పిస్తుంది.
హీరోహీరోయిన్లుగా నటించిన పృథ్వీరాజ్ సుకుమారన్, పార్వతి (Parvathy Thiruvothu)తమదైన సహజ నటనతో ఆకట్టుకున్నారు. పృథ్వీరాజ్‌కు ఇలాంటి పాత్రలు చేయడం కొట్టిన పిండే. కాకపోతే... మాస్ ఆడియెన్స్ ను ఆకట్టుకునే క్రమంలో అవసరానికి మించిన యాక్షన్ సీన్స్ ను పెట్టారు. పార్వతి తిరువోతు ఇప్పటికే 'దూత' వెబ్ సీరిస్ ద్వారా తెలుగువారికి సుపరిచితురాలు. మీరా పాత్రలోని సంఘర్షణను ఆమె చక్కగా పోట్రేట్ చేసింది. వారి పిల్లలుగా నటించిన వారు మెప్పించారు. ఇతర ప్రధాన పాత్రలు పోషించిన వారెవరూ తెలుగువారికి తెలిసిన వారు కాదు. ఈ చిత్రానికి జోక్స్ బిజోయ్ సంగీతం అందించారు. రెండు నేపథ్య గీతాలు హిందీలో ఉంటే, రెండు తెలుగులో ఉన్నాయి. ఓ పాటను ఇంగ్లీష్‌లో పాడించారు. పృథ్వీరాజ్ సుకుమారన్ కుమార్తె అలంకృత మీనన్ ఆ పాట పాడటం విశేషం. దినేశ్ పురుషోత్తమన్ సినిమాటోగ్రఫీ బాగుంది. సమీర్ అబ్దుల్ ఈ కథను అందించారు. సీవీ సారథి, ముఖేశ్ ఆర్ మెహతాతో కలిసి పృథ్వీరాజ్ ఈ సినిమాను నిర్మించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను స్రవంతి మూవీస్, మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు.
సొసైటీ మీద సెటర్ గా సాగిన 'ఐ, నోబడీ' మూవీ లోతులను అర్థం చేసుకోవడం సామాన్య ప్రేక్షకుడికి కాస్తంత కష్టమే. తెలుగులో రోలింగ్ టైటిల్స్ ఎ.ఐ.తో చేయడం, అవి అధ్వాన్నంగా ఉండటం అనీజీగా అనిపిస్తుంది. అలానే సినిమాలో కీలకమైన సంఘటనలు తెలియచేసే వార్తా పత్రికలను కూడా మలయాళంలోనే చూపించడంతో తెలుగు ప్రేక్షకులకు అందులో ఏముందో లేశమాత్రమైనా అర్థం కాదు. డబ్బింగ్ చేసే సమయంలో ఇలాంటి వాటికి ప్రాధాన్యం ఇస్తే బాగుండేది. టేకిట్ గ్రాంట్ గా తీసుకుంటే మాత్రం ఆ ప్రభావం ఖచ్చితంగా సినిమా ఫలితం మీద పడుతుంది.
రేటింగ్: 2.5/5
ట్యాగ్ లైన్: సిస్టమ్ మీద సెటైర్!